చెట్టు కింద సభ | Suspended DMK members hold mock Assembly session | Sakshi
Sakshi News home page

చెట్టు కింద సభ

Published Sat, Aug 20 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

Suspended DMK members hold mock Assembly session

  •  పోటీ అసెంబ్లీ
  •  స్పీకర్‌గా దురై మురుగన్
  •  చలోక్తులు, వ్యంగాస్త్రాలతో హాస్యపు జల్లులు
  •  నేటికి వాయిదా
  •  కోర్టుకు సస్పెన్షన్ వ్యవహారం
  •  
    చెన్నై: జార్జ్ కోట ఆవరణలో శుక్రవారం రెండు రకాల అసెంబ్లీ సమావేశం సాగింది. ఒకటి అన్నాడీఎంకే నేతృత్వంలో సభా మందిరంలో సాగితే, మరొకటి డీఎంకే నేతృత్వంలో ‘సభ’ చెట్టు కిందకు జరిగింది. పోటీ అసెంబ్లీ నినాదంతో సాగిన ఈ సభకు స్పీకర్‌గా డీఎంకే శాసన సభాపక్ష ఉపనేత దురైమురుగన్ వ్యవహరించారు. చెట్టు కింద చలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు వెరసి హాస్యపు జల్లుల్ని పండించాయి. ఇక, డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం మద్రా సు హైకోర్టుకు చేరింది.
     
    అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం వ్యవసాయ, పశుసంవర్థక శాఖల కేటాయింపులపై చర్చ జరిగింది. అన్నాడీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తోపాటు సస్పెండ్ వేటు పడని ఐదారుగురు డీఎంకే సభ్యులు మాత్రమే సభలోకి అనుమతించారు. సప్పెన్షన్‌కు గురైన ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో పాటుగా ఇతర డీఎంకే సభ్యులు అటు వైపుగా రానివ్వకుండా గట్టి చర్యలే తీసుకున్నా రు.
     
    సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు రాగానే వారిని జార్జ్‌కోట పరిసరాల్లోనే అడ్డుకున్నారు. దీంతో జార్జ్‌కోటలోని  ఓ అతి పెద్ద చెట్టు కింద మైక్‌లు, స్పీకర్లు, కుర్చీలు ప్రత్యక్షం అయ్యాయి. అన్నాడీఎంకే ప్రభుత్వానికి పోటీగా, తామూ ఇక్కడ అసెంబ్లీ నిర్వహించనున్నామని ప్రకటించి, చెట్టు కింద సభ వ్యవహారాలను సాగించే రీతిలో తమ నిరసనను డీఎంకే సభ్యులు వ్యక్తం చేశారు.
     
    పోటీ సభ : అసెంబ్లీ సమావేశ మందిరంలో స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో సభ ఆరంభం కాగానే, సపెన్షన్ రద్దుకు పట్టుబడుతూ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ తోపాటు ఆరుగురు డీఎంకే సభ్యులు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో సభ నుంచి సదరు పార్టీల సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అదే సమయంలో చెట్టు కింద పోటీ సభ ఆరంభం కాగానే... వారు కూడా ఈ సభలో పాల్గొన్నారు.
     
    ఈ పోటీ సభకు డీఎంకే శాసన సభా పక్ష నేత దురై మురుగన్ స్పీకర్‌గా వ్యవహరించారు. సభలో ప్రతి పక్షాల గళం నొక్కడం లక్ష్యంగా ధనపాల్ ఏవిధంగా వ్యవహరిస్తారో దానిని అనుకరిస్తూ దురై మురుగన్ చక్కటి నటనతో అందర్నీ మెప్పించారు. సభలో సభ్యులు ఏ విధంగా ప్రశ్నల్ని సంధిస్తారో, అందుకు మంత్రులు ఏ విధంగా అడ్డు పడుతారో, ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ లేవగానే, అధికార పక్షం నుంచి వచ్చే అరుపులు కేకల్ని కళ్లకు గట్టినట్టు వివరించారు.
     
    అధ్యక్షా..అధ్యక్షా..అంటూ సాగిన ఈ పోటీ సభలో చలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడంతో చుట్టు చేరిన వారందరికీ పసందైన హాస్యపు విందు లభించినట్టు అయింది. డెంగీ తాండవం గురించి ఓ సభ్యుడు లేవదీసిన ప్రశ్నకు మంత్రిగా నటిస్తూ సమాధానం ఇచ్చిన డీఎంకే సభ్యుడు పొన్ముడి, చివరగా అమ్మ(జయలలిత)ను అడిగి, మందులు పంపిణీ చేస్తామన్నట్టుగా సెటైర్లతో ప్రసంగించారు.
     
    చివరకు సభను రేపటికి వాయిదా వేస్తూ పోటీ స్పీకర్ దురై మురుగన్ నిర్ణయించారు. ఎవర్నో కించ పరచాలనో, మరెవర్నో విమర్శించాలనో తాము ఈ పోటీ సభ ఏర్పాటు చేయలేదని ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక్కడ నిర్వహించిన పోటీ సభను అనేక చానళ్లు ప్రత్యక్ష ప్రసారం కూడా చేసినట్టుగా సమాచారం వచ్చిందన్నారు. దీన్ని బట్టి ఆలోచించండి, అసెంబ్లీ వ్యవహారాల్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సభ్యులు ఏ మేరకు తప్పులు చేస్తున్నారో అన్నది అందరి దృష్టికి చేరుతుందని చెప్పారు.
     
    కోర్టుకు సస్పెన్షన్: డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. డీఎంకే తరఫున న్యాయవాదులు మోహన్, ఎన్‌ఆర్ ఇళంగోవన్ ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ ముందు సప్పెన్షన్ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. అత్యవసర పిటిషన్‌గా విచారించాలని విన్నవించారు.

    ఇందుకు ప్రధాన న్యాయమూర్తి ఆక్షేపణ వ్యక్తం చేశారు. షెడ్యూల్ మేరకు ఈ రోజున విచారించిన కేసుల వివరాలను ఇప్పటికే ప్రకటించి ఉన్నామని, పిటిషన్ దాఖలు చేయాలని, సోమవారం విచారణ చేపడుతామని సూచించారు. డీఎంకే సభ్యు ల సస్పెన్షన్‌ను విజయకాంత్ ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతి పక్షంలో ఉన్న తమ గళాన్ని నొక్కే విధంగా వ్యవహరించారని, ఇప్పుడేమో అదే బాటలో ఈ ప్రభుత్వం సాగుతున్నదని మండిపడ్డారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు కాకుండా, మరొకరికి అధికార పగ్గాలు అప్పగించి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేదా..? అని పరోక్షంగా ప్రజల్ని  ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
     
    నిర్ణయంలో మార్పు ప్రసక్తే లేదు : ఇక, అసెంబ్లీలో డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంపై స్పీకర్ ధనపాల్ స్పందిస్తూ, తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు లేదు అని స్పష్టం చేశారు. ఇక, మంత్రులు తమ ప్రసంగాల్లో కేటాయింపుల గురించి, సభ్యుల  ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మమా.. అనిపించారు. ఆ మేరకు మంత్రి సెల్లూరు రాజు తన ప్రసంగంలో అడిగిందీ, అడగనిదీ ఇచ్చే వ్యక్తి తమ అమ్మ అని, అందుకే తన శాఖ అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు.

    మంత్రి బాలకృష్ణారెడ్డి తన ప్రసంగంలో పశు సంవర్థక శాఖ కేటాయింపులను ప్రస్తావిస్తూ, తిరువళ్లూరు, తిరుప్పూర్‌లలో పశువులకు వచ్చే రోగాలపై పరిశోధనలకు కేంద్రాల ఏర్పాటు గురించి వివరించారు. అలాగే తమిళ సాహసక్రీడ జల్లికట్టు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  ఇక, మదురైలలోని గుంటలు, చెరువుల పరిరక్షణకు రూ. పది హేను లక్షలు ప్రకటించినట్టు మంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement