సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ఈ వారంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలతో పాటు ప్రభుత్వం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపైనే కేబినేట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుందని అధికారవర్గాల ద్వారా తెలిసింది.
శాసనసభ, మండలిలో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలను చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి ఇప్పటి వరకు 8 ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమింగ్ చట్టం, వ్యాట్, దుకాణాలు–సముదాయాలు, ఆబ్కారీ చట్టాలకు సవరణ, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు.. తదితర ఆర్డినెన్స్‌లను జారీ చేసింది.
వీటన్నిటినీ ఈ సమావేశాల్లోనే బిల్లులుగా ప్రవేశపెట్టి 2 సభల ఆమోదం పొందాల్సి ఉంది. వీటితో పాటు దాదాపు 60 అంశాలను కేబినెట్ భేటీలో చర్చించేందుకు అధికారులు ఎజెండాను సిద్ధం చేశారు. వివిధ శాఖల్లో కొత్త పోస్టుల మంజూరు, నియామకాలకు అనుమతితోపాటు గతంలో మంజూరు చేసిన పోస్టులకు ఆమోదం తెలుపనున్నారు.
పంచాయతీరాజ్ చట్టానికి సవరణ!
రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు, పంచాయతీరాజ్ చట్ట సవరణ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై అధ్యయనం, బిల్లు రూపకల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే ఓ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ సోమవారం ఉదయం సచివాలయంలో మరోసారి సమావేశమై నివేదికను ఖరారు చేయనుంది. ఈ నివేదికపై కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి.
భూ రికార్డుల ప్రక్షాళన, మిషన్ భగీరథ పనుల పురోగతి తదితర అంశాలపైనా చర్చ జరగనుంది. శీతాకాల సమావేశాల సందర్భంగా సభ ద్వారా ప్రభుత్వం జనంలోకి తీసుకెళ్లాలనుకునే అంశాలు, ప్రతిపక్షాల దాడిని తిప్పి కొట్టేందుకు రాజకీయంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్లో చర్చించనున్నారు. బీబీ నగర్ నిమ్స్‌కు 800 పోస్ట్‌లతోపాటు వైద్య, ఆరోగ్య శాఖలో 850 పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి.
వీటితోపాటు నర్సాపూర్, తిర్మలాయ పాలెం, జాఫర్‌గఢ్, వీపనగండ్ల, మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అప్ గ్రేడేషన్, మరో 300 కొత్త ఉద్యోగాలకు ఆమోదం తెలపనుంది. నీటిపారుదల శాఖలో ఈఎన్సీ స్థాయిలో సూపర్ న్యూమరరీ పోస్టును మంజూరు చేసేందుకు ఆమోదం తెలుపనున్నారు.
మిషన్ భగీరథకు వివిధ బ్యాంకుల నుంచి రూ.11 వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపైనా సమావేశంలో చర్చ జరుగనుంది. నీటిపారుదల ప్రాజెక్టులు, భూసేకరణ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పురోగతి తదితర అంశాల పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment