కోతల్లేని కరెంటుకు ఏడాది
సాక్షి, హైదరాబాద్: ‘‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 2014 నవంబర్ 20 నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో కోతల్లేని విద్యుత్ సరఫరాకు గురువారంతో ఏడాది పూర్తయింది. రాష్ట్రం ఏర్పాటై 5 నెలల 18 రోజులకే కోతలను అధిగమించాం. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకం, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవ, ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగుల కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది.
ఈ శుభ సందర్భంగా విద్యుత్ సంస్థలు సంబరాలు చేసుకోనున్నాయి..’’ అని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి చెప్పారు. సంస్థ కార్యాలయంలో ఎస్పీడీసీఎల్ డెరైక్టర్లు టి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్‌రెడ్డి, కమాలుద్దీన్ అలీఖాన్‌లతో కలసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. డిమాండ్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసి సరిపడా విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా నిరంతర విద్యుత్ సాధ్యమైందని చెప్పారు.
రాష్ట్రంలో 1.23 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. రోజూ సగటున 160 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉందన్నారు. ఏపీ నుంచి రాష్ట్ర వాటాలు, సొంత ఉత్పత్తి కలిపి 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభ్యత ఉండగా... మిగతా దాదాపు 100 మిలియన్ యూనిట్లను వివిధ మార్గాల్లో కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ కేంద్రాలు నిర్మించి, విద్యుదుత్పత్తిని 24,075 మెగావాట్లకు పెంచుతున్నామని చెప్పారు. 2018-19 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు.
కారిడార్ కోసమే ఛత్తీస్‌గఢ్ విద్యుత్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని రఘుమారెడ్డి చెప్పారు. 2018-19 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చుతామని సర్కారే చెబుతోందని, మరి ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఎందుకని ప్రశ్నించగా... విద్యుత్ కారిడార్ కోసమే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఆ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 6 వరకు ఉండే అవకాశముందన్న కథనాలు సరికాదని, చవకగా యూనిట్ రూ. 5కే లభిస్తుందని పేర్కొన్నారు.