ఖాళీ కడుపుతో విధులెలా?
పుష్కర వైద్య సిబ్బంది ఆవేదన
అల్పాహారం, భోజన పంపిణీ ఒట్టిమాటే
విజయవాడ (లబ్బీపేట) :
నిత్యం మంత్రులూ..ముఖ్యమంత్రి ఘాట్ల చుట్టూ తిరుగుతూ అన్ని సౌకర్యాలు పక్కాగా ఉన్నాయని చెప్పుకుంటున్నా వాస్తవాలు వేరు. 24 గంటలూ యాత్రికులకు సేవలు చేస్తున్న వైద్య ఉద్యోగుల ఆకలి కేకలు వారి చెవికెక్కడం లేదు. చేరినా పట్టిం చుకోవడం లేదు. పుష్కరఘాట్లు, పుష్కరనగర్లు, రైల్వే, బస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి సకాలంలో అల్పాహారం, భోజనం అందించక పోవడంతో ఆకలి కడుపులతోనే పనిచేస్తున్నారు. జిల్లావైద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే సర్దుకుపోండంటూ ఉచిత సలహా ఇచ్చారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండిట్ నెహ్రు బస్ స్టేషన్లో ఐదు వైద్య శిబిరాలు, ఒక వైద్య కేంద్రం ఉండగా, ఆ సిబ్బందికి అల్పాహారం , భోజనం, ఆఖరికి మంచినీరు కూడా సరఫరా చేయడం లేదు. వారే కొనుక్కోవాలి.
అన్ని చోట్లా ఇదే దుస్థితి
జిల్లాలో 3 వేల మందికిపైగా సిబ్బంది పుష్కర విధులు నిర్వహిస్తుండగా, వారికి భోజనం ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. కానీ అన్ని ప్రాంతాల్లో సకాలంలో భోజనాలు పెట్టడం లేదు, ఉన్నతాధికారులు బిస్కెట్లు, అరటిపండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ బస్టాండ్లో శిబిరానికి అవికూడా వెళ్లకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు.