గెలుపు కోసం శ్రమిస్తున్న సతిపతులు
‘కార్యేషు దాసి.. కరుణేషు మంత్రి.. భోజ్యేషు మాత.. శయనేషు రంభ.. అపురూపమైనదమ్మ ఆడజన్మ.. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలేనమ్మా’ అన్న సినీ కవి మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తున్నారు నేటి మహిళలు. కష్టసుఖాల్లో, గెలుపోటముల్లో అన్నింటా... అన్ని వేళలా తోడునీడగా కలిసి నడుస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల బరిలో నిలిచిన తమలో సగమైన జీవితభాగస్వామి గెలుపు కోసం సతిపతులు శ్రమిస్తున్నారు. ఎండలు చుర్రుమంటున్నా.. ఉక్కపోతతో చెమట చిందిస్తూ విజయావకాశాలను మెరుగుపరిచేందుకు అవసరమైన మంత్రాంగాన్ని నడుపుతున్నారు. వీరి చిత్తశుద్ధి ముందు భానుడి ప్రతాపం చిన్నబోతోంది.
నిలేకనికి నీడలా..
ఐటీ రంగ ప్రముఖుడిగా ప్రపంచ ప్రజలకు సుపరిచితుడే అయినా రాజకీయాలకు పూర్తిగా కొత్తవారైన నందన్ నీలేకని బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇన్ని రోజులు సాధారణ ప్రజాజీవనానికి కాస్తంత దూరంగానే ఉన్న ఆయన విజయావకాశాలను మెరుగు పరిచేందుకు జీవిత భాగస్వామి రోహిణి నీలేకని తీవ్రంగా శ్రమిస్తున్నారు.
బెంగళూరు దక్షిణ పరిధిలో ఐటీ రంగానికి చెందిన వారు ఎక్కువగా ఉండే బీటీఎం లేఅవుట్, జయనగర తదితర ప్రాంతాల్లో రోహిణి విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన భర్త విజయావకాశాలను మెరుగు పరిచడంతో తనకున్న నైపుణ్యాన్ని ఆమె ధారపోస్తున్నారు. సాధారణ ప్రజల్లో ఒకరుగా కలిసిపోయే ప్రయత్నం చేస్తూనే స్థానిక సమస్యలపై ఆరా తీస్తూ... నందన్ నిలేకని గెలుపునకు అవసరమైన మంత్రాంగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
అనంతకుమార్‌కు అండగా తేజస్విని
భర్తల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్న వారిలో అందరికన్నా ముందంజలో తేజస్విని ఉన్నారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన అనంతకుమార్ విజయం కోసం ఆయన భార్య తేజస్విని విస్తృత ప్రచారాన్ని సాగిస్తున్నారు. అనంతకుమార్ నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆమె పాదయాత్ర సాగిస్తూ ఓటర్లలో చైతన్యం తీసుకువస్తున్నారు. నిత్యం ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో అనంతకుమార్‌ను గెలిపించాల్సిన ఆవశ్యకతను, నరేంద్ర మోడిని ప్రధానిని చేయాల్సిన అవసరాన్ని గురించి వివరిస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న తేజస్విని నగర ప్రజలకు సుపరిచితులే కావడంతో ఆమె ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గీతను దాటించేందుకు శివన్న
పుట్టినింట రాజకీయాలనే చూస్తూ పెరిగినా మెట్టినింట మాత్రం వాటికి దూరంగా జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి గీతా శివరాజ్‌కుమార్. ప్రముఖ రాజకీయ వేత్త బంగారప్ప గారాల పట్టిగా, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ ఇంటి కోడలిగా గీత సుపరిచితులే. రాజకీయ జీవితం ఆమెకు కొత్తే అయినా అందులో అడుగుపెట్టాలని అనుకున్న మరుక్షణం నుంచే శివరాజ్‌కుమార్ ప్రోత్సహిస్తూ వచ్చారు. ఎన్నో విమర్శలు ఎదురవుతున్నా లెక్కచేయక ఆమె వెన్నంటి నిలిచారు.
తన భార్య రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందోనన్న విషయంపై అందరికీ వివరణలు ఇస్తూ వచ్చారు. పార్టీలో చేరడం మొదలుకొని నామినేషన్ దాఖలు చేయడం వరకు ఆమె వెంటే ఉన్నారు. ఇక ఇప్పుడు తన సినీ గ్లామర్‌తో భార్యకు విజయావకాశాలను పెంచే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అయితే తాను తన భార్య గీతకు ఓటేయ్యాలని కోరతాను తప్పితే జేడీఎస్ తరఫున ప్రచారం చేయబోనని శివరాజ్‌కుమార్ పేర్కొనడం కొసమెరుపు.