9 గంటల విద్యుత్ ఇవ్వాలి
పలాస : పలాస నుంచి సోంపేట వెళుతున్న ఆర్టీసీ బస్సులో సోమవారం గుర్తు తెలియని మహిళ (48) మృతి చెందింది. పలాస పారిశ్రామికవాడ సమీపంలో బస్సు వెళ్లేసరికి ఆమె మృతి చెందినట్లు తోటి ప్రయాణికులు గుర్తించారు. కాశీబుగ్గ పోలీసుల కథనం ప్రకారం... కాశీబుగ్గ పాత బస్టాండ్ వద్ద ఓ మహిళ బస్సు ఎక్కి హరిపురం వరకు టిక్కెట్ తీసుకుంది. టిక్కెట్ తీసుకునే సమయంలో ఆమె ఆరోగ్యంగానే కనిపించిందని హరిపురం వరకు వెళుతున్నానని చెబుతూ డబ్బులు కూడా ఇచ్చిందని ఆర్టీసీ కండక్టర్ ఎస్.వి. రమణ తెలిపారు.
పలాస పారిశ్రామికవాడ వద్దకు వెళ్లేసరికి ముందుగా ఆమె చేతులు ఎత్తుతూ పిట్స్ రోగిలా ఏదో చెప్పబోయిందని, కొద్దిక్షణాల్లోనే మృతి చెందిందని ప్రయాణికుల సమాచారం. స్పృహ కోల్పోవడంతో బస్సును ఆపి డ్రైవర్ ఎస్.జోగారావు, కండక్టర్ ఎస్వి రమణ 108కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వచ్చి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కిందకు దిగి వేర్వేరు బస్సుల్లో వెళ్లిపోయారు.
కండక్టర్, డ్రైవర్ కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలం వద్దకు వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి వయసు సుమారు 48 ఏళ్లుంటుందని, అయితే ఆమె వద్ద ఆమెకు సంబంధించిన చిరునామా, ఇతర వ్యక్తిగత విషయాలు ఏమీ లభించలేదని సీఐ తెలిపారు. వడదెబ్బ వల్లగానీ, గుండెపోటు వల్ల గానీ ఆమె మృతి చెంది ఉంటుందని సీఐ అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.