woman cheated
-
ఆశ పెట్టి.. దోచేసిన కి‘లేడీ’..
సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల పేరిట ఓ వ్యక్తికి ఆశపెట్టింది ఓ కి‘లేడీ’. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. లాభాల సంగతేమోకానీ అసలు సొమ్ము అయినా తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరించింది. ఎట్టకేలకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్(ఈఓడబ్ల్యూ) పోలీసులకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లికి చెందిన పానుగంటి ఇందిరాదేవిరెడ్డి అలియాస్ ఇందిరాలా ఇందిరాదేవిరెడ్డి నాగోల్‌లో దేవిఫుడ్స్, బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మదీనాగూడకు చెందిన ఎస్.సత్యనారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను ప్రవాసరాలినని, తనకు నాగోల్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి ప్రాంతాలలోని గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలు ఉన్నాయని నమ్మించింది. నకిలీ యాజమాన్యపత్రాలను కూడా సృష్టించి చూపించింది. ఫుడ్ ఇండస్ట్రీ, బ్యూటీ పార్లర్లో పెట్టుబడి పెడితే అధికలాభాలు వస్తాయని ఆశపెట్టి సత్యనారాయణ నుంచి రూ.3.06 కోట్లు వసూలు చేసింది. బాధితుడి వద్ద నుంచి రెండు కార్లను తీసుకొని తనఖా పెట్టింది. సూడో పోలీసులతో బెదిరింపులు.. అయితే ఆమె ఎంతకీ లాభాలు ఇవ్వడంలేదు. దీంతో లాభాలు కాదు కదా అసలు సొమ్ము అయినా వెనక్కి ఇవ్వాలని నిలదీయగా తన ఇద్దరు స్నేహితులు పోలీసు అధికారులని పరిచయం చేసింది. వారితో కలిసి తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి భయబ్రాంతులకు గురిచేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇందిరాదేవిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమె నుంచి రెండు కార్లు, ఐ–ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఈమె గతంలో మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడింది. ఈ కేసులో బాధితుడి నుంచి రూ.కోటి వసూలు చేసింది. -
కలలు కల్లలు.. ఏజెంట్ చేతిలో మోసపోయి కటకటాల్లోకి కొత్తగూడెం మహిళ
భద్రాద్రి కొత్తగూడెం: గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు ఏజెంట్లు అమయాక మహిళలను మోసం చేస్తున్నారు. తెలంగాణ కొత్తగూడెం జిల్లాకు చెందిన విజయలక్ష్మీ (40) అనే మహిళ కూడా ఇలాగే అమలాపురానికి చెందిన ఓ ఏజెంట్ చేతిలో మోసపోయింది. ఉద్యోగం వస్తుందని నమ్మి గల్ఫ్ దేశం ఒమన్ వెళ్లిన ఆమెను మస్కట్‌లో ఎయిర్‌పోర్టు అధికారులు ఆపారు. ఆమె వీసా నకిలీదని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం కేరళలోని కొచ్చికి తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏర్నాకులం పోలీస్ స్టేషన్‌కు రిమాండ్‌కు తరలించారు. ఏజెంట్ చేతిలో ఆమె మోసపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఒమన్ కేసులను వాదించే కోర్టులు ప్రస్తుతం కేరళో మూతపడ్డాయి. దీంతో విజయలక్ష్మీ జైల్లోనే మగ్గుతోంది. ఎవరైనా సాయం చేస్తారని ఎదురు చూస్తోంది. విజయలక్ష్మి భర్త మరణించారు. కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లి పూలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. తన కొడుకు ఉన్నత చదువుల కోసం డబ్బులు సంపాదించి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతోనే విజయలక్ష్మీ గల్ప్ దేశం వెళ్లాలనుకుంది. కానీ ఏజెంట్‌ను నమ్మి మోసపోయి ఇప్పుడు జైల్లో దుర్భర జీవితం గడుపుతోంది. చదవండి: కోర్టు ముందు బోరున విలపించిన పార్థ చటర్జీ, అర్పిత ముఖర్జీ -
మ్యాట్రిమోనిలో బయోడేటా.. పెళ్లి పేరుతో భార్యాభర్తల మోసం
సత్తెనపల్లి: పెళ్లి పేరుతో మహిళను భార్యాభర్తలు మోసగించిన సంఘటన ఇటీవల వెలుగుచూసింది. భర్త పరారీలో ఉండగా, భార్యను సత్తెనపల్లి రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఓ మహిళ అబ్బూరులోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు రెండో వివాహం నిమిత్తం ఇటీవల మ్యాట్రిమోనిలో తన బయోడేటా పెట్టింది. ఈ బయోడేటా చూసిన కార్తీక్ అనే వ్యక్తి తన అమ్మ వాళ్లది తెనాలి అని, ఉద్యోగం రీత్యా చెన్నైలో పనిచేస్తున్నానని, తనకు బాగా నచ్చావని మాటలు కలిపి రోజూ ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని భరోసా కల్పిచాడు. కొద్దిరోజుల తరువాత తన కుటుంబానికి చెందిన ఆస్తులు నోట్ల రద్దు సమయంలో విక్రయించామని, వచ్చిన కోట్ల రూపాయల నగదు బ్యాంకులో ఉందని నమ్మించాడు. పెద్ద మొత్తం కావడంతో లెక్కలు చెప్పాలంటూ ఆ నగదును ఐటీ అధికారులు నిలిపివేశారని, ప్రస్తుతం అది చెన్నై కోర్టులో ఉందన్నాడు. ఐటీ అధికారులకు కొంత నగదు చెల్లించాలని, నీవద్ద ఉంటే అప్పుగా ఇస్తే తిరిగి మళ్లీ ఇస్తానని చెప్పాడు. అది నమ్మి తెలిసిన వారి వద్ద నుంచి బ్యాంకు ఉద్యోగి రూ.32 లక్షలు కార్తీక్ మేనత్త బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసింది. రోజులు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోగా, సాకులు చెప్పి తప్పించుకుంటుండటంతో అనుమానం వచ్చిన బ్యాంకు ఉద్యోగి తెనాలి వెళ్లి విచారించగా అసలు విషయం బట్టబయలైంది. కార్తీక్ అసలు పేరు మహరాజ్ జానీరెక్స్ అని, అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలియడంతో మోసపోయానని గ్రహించింది. కార్తీక్ తన మేనత్త అని పరిచయం చేసి ఇచ్చిన బ్యాంక్ ఖాతా నంబరు అతని భార్యది కావడంతో ఆమె వెంటనే తెనాలి పోలీసులను ఆశ్రయించింది. తెనాలి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును సత్తెనపల్లి రూరల్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. నమ్మించి మోసం చేసిన కార్తీక్, అతని భార్య మహరాజ్ ప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్తీక్ పరారీలో ఉండగా, అతని భార్య మహరాజ్ ప్రియను అరెస్టు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు గతంలో కూడా అనేక మందిని మోసం చేసినట్లు సమాచారం. ఇదిలావుండగా ఇచ్చిన నగదు తిరిగి రాకపోతే తనకు చావే శరణ్యమంటూ బ్యాంకు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
చిత్రరంగంలో రాణించలేక మోసాలు..!
సాక్షి, చెన్నై : తాను చిత్రరంగంలో రాణించలేకనే మోసాలకు పాల్పడినట్లు ఫేస్‌బుక్‌తో పలువురు యువకులను మోసగించిన శ్రుతి శుక్రవారం వెల్లడించింది. ఫేస్ బుక్‌లో తన అందమైన ఫొటోలు పెట్టి పలువురి వద్ద శ్రుతి రూ.1.50 కోట్లు దోచుకున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ముగ్గురు సాప్ట్వేర్ ఇంజినీర్లను బురిడీ కొట్టించిన శ్రుతి అనే యువతి తన తల్లి, సోదరుడు, స్నేహితుడు సహా ఊచలు లెక్కపెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అందమైన ఫొటోలను ఎరవేసి.. సేలం జిల్లా ఎడపాడికి చెందిన బాలకృష్ణన్ (29) విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆన్లైన్లో పెళ్లి సంబంధాలు వెతుకుతున్న ఇతనికి కోయంబత్తూరు పాపనాయకన్‌పాళైకి చెందిన శ్రుతి (21) ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. సినిమా నటిలా ఫోజులిస్తూ ఫొటోలు పెట్టడం, ఇంగ్లిషులో మాట్లాడడంతో బాలకృష్ణన్ ప్రేమలో పడిపోయాడు. దీనిని అవకాశంగా తీసుకున్న శ్రుతి.. తన తల్లి చిత్ర మెదడులో గడ్డ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రుతి మాటలు నమ్మిన బాలకృష్ణన్ రూ.5 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో వేశాడు. కొన్ని రోజుల తరువాత ఇంటిపై అప్పు ఉందని, తీరిన తరువాతనే పెళ్లి అని చెప్పడంతో కాబోయే భార్యే కదాని మరో రూ.45 లక్షలు పంపాడు. ఈ నేపథ్యంలోనే శ్రుతి ఫొటోలను చెన్నైలోని తన ప్రాణస్నేహితునికి పంపి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. వెంటనే గుర్తించిన అతను ఆమె పెద్ద మోసగత్తెని తెలిపాడు. దీంతో బాలకృష్ణన్ వెంటనే శ్రుతికి ఫోన్ చేసి నిలదీయడంతో కట్ చేసి ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేసింది. తాను మోసపోయానని గ్రహించిన బాలకృష్ణన్ కోయంబత్తూరుకు చేరుకుని సైబర్ క్రైంబ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా శ్రుతి చిదంబరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరుళ్‌కుమార్ గురురాజా నుంచి రూ.50లక్షలు, నామక్కల్ జిల్లా పరమత్తివేలూరుకు చెందిన సంతోష్‌కుమార్ అనే సాప్ట్వేర్ ఇంజినీరు నుంచి రూ.43 లక్షలు.. దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రుతితో పాటు ఆమెకు సహకరించిన తల్లి చిత్ర (48), సోదరుడు సుభాష్ (18) బంధువు వెంకటేష్ (38), స్నేహితుడు శబరినా«థ్ (23)లను బుధవారం రాత్రి సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్రసీమలో రాణించలేకపోవడంతో .. శ్రుతి ఆడి పోనాల్ ఆవణి అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. అయితే ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. సినిమాలో రాణించలేకపోవడంతో నిరాశ చెందిన శ్రుతి తన తల్లి సహకారంతో ధనవంతులైన యువకులకు లోబరచుకుని కోట్లాది రూపాయలు మోసగించింది. విలాస జీవితానికి అలవాటు పడడమే దీనికి కారణం. శ్రుతి, ఆమె తల్లి సహకారంతో ఎనిమిది మంది యువకులను ప్రేమ వలతో మోసగించినట్లు తెలిసింది. దీంతో వారిద్దరూ ఈ విధంగానే చాలా మంది యువకులను మోసగించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా వీరి మోసంలో పలువురికి సంబంధం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం శ్రుతిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
1.30 కోట్లకు ముంచేసిన ఫేస్బుక్ ఫ్రెండ్
ఫేస్బుక్లో అకౌంట్ ఉంది కదాని ఎవరు పడితే వాళ్లు పంపిన ఫ్రెండ్ రిక్వెస్టులు ఓకే చేసేస్తే కొంప మునిగిపోతుంది జాగ్రత్త. డెహ్రాడూన్‌లో ఓ మహిళను ఆమె ఫేస్బుక్ స్నేహితుడు ఏకంగా కోటీ 30 లక్షల మేర ముంచేశాడు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు 9 కోట్ల రూపాయలు) సాయం చేస్తానంటూ చెప్పి చివరకు ఆమె వద్ద ఉన్న డబ్బులన్నీ లాగేసుకున్నాడు. డెహ్రాడూన్‌లోని రాం విహార్ ప్రాంతానికి చెందిన బీనా బోర్ ఠాకూర్ అనే మహిళకు అతడు ముందుగా తాను ఇవ్వాల్సిన మొత్తం కావాలంటే ఓ పన్ను చెల్లించాలని చెప్పాడు. ఆ ఉచ్చులో చిక్కుకున్న ఆమె, వివిధ బ్యాంకు ఖాతాలకు ఏకంగా రూ. 1.30 కోట్లు జమచేశారు. ఆ తర్వాత గానీ తాను మోసపోయినట్లు గుర్తించలేకపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓఎన్జీసీలో ఉద్యోగి భార్య అయిన ఠాకూర్ ఫేస్బుక్ వాడతారు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఆమెకు రిచర్డ్ ఆండర్సన్ అనే వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. వాళ్లిద్దరూ ఫోన్లో కూడా చాలాసార్లు చాటింగ్ చేసుకున్నారు. భారతదేశంలోని ప్రజలకు తాను సేవ చేయాలనుకుంటున్నానని చెబుతూ పలు రకాల ప్రతిపాదనలు తెచ్చాడు. చివరకు వృద్ధాశ్రమం ఏర్పాటుకు 9 కోట్లు ఇస్తానని చెప్పినట్లు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ రౌతెలా తెలిపారు. కొన్నాళ్ల తర్వాత రిజర్వు బ్యాంకులోని విదేశీ మారకద్రవ్య విభాగం నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. 9 కోట్లమొత్తం వచ్చిందని, అందుకు కొంత పన్ను చెల్లించి ఆ మొత్తం తీసుకోవాలని చెప్పాడు. ఆమె ఆ మొత్తాన్ని వేర్వేరు బ్యాంకుల్లో వేసిన తర్వాత విలియం జార్జి, కెవన్ బ్రౌన్ అనే మరో ఇద్దరు ఫోన్ చేసి, మరింత మొత్తం వేయాలన్నారు. అలా మొత్తం 25 ఖాతాల్లో 1.30 కోట్లను ఆమె డిపాజిట్ చేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆండర్సన్, జార్జి, బ్రౌన్‌లతో పాటు మరో వ్యక్తిపై 420 కేసు నమోదు చేశారు. ఆమె డిపాజిట్ చేసిన ఖాతాలు చాలావరకు కేరళ, తమిళనాడు, కర్ణాటకలలోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు.