పెట్రోల్ పోసి నిప్పటించారు.. పోరాడి ప్రాణాలొదిలిన అశ్విని!
సాక్షి, విజయనగరం: పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఈవెనింగ్ వాక్ కోసం వెళ్లిన యువతిపై ఇద్దరు యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న ఆమెను అక్కడ వదిలేసి ఆ ఆగంతకులు పరారయ్యారు. అటుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడి యువతి ప్రాణాలు వదిలింది. పట్టణంలోని శివారు ద్వారపూడి లే అవుట్లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
స్థానిక పోలయ్య పేటలో నివాసం ఉంటున్న ముదునూరు అశ్విని(25) స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ యత్నంలో ఉంది. శుక్రవారం సాయంత్రం ద్వారపూడి సమీపంలో రియల్ ఎస్టేట్ ప్రాంతం వద్దకు వాకింగ్‌కు వెళ్ళింది. తిరిగి ఆమె ఇంటి దారి పడుతుండగా ఇద్దరు యువకులు ఆమె పేరు అడిగారు. పేరు చెప్పగానే ఒకరు చేతులు పట్టుకోగా మరొకరు ఒంటిపై పెట్రోల్ కలిపిన కిరోసిన్ వేసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న ఆమెను వదిలేసి పరారయ్యారు. ఆమె 97 శాతం కాలిపోయింది.
స్థానికులు గుర్తించడంతో...
సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనలో అటుగా వెళ్తున్న స్థానికులు దాహం దాహం అంటున్న కేకలు విని ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి జిల్లా కేంద్రాస్పత్రికి బాధితురాలిని తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఏవీ రమణ అస్పత్రికి చేరుకుని బాధితురాలి బంధువుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు.
అన్నీ అనుమానాలే...
దాడిలో గాయపడ్డ అశ్విని తండ్రి వెంకట సాయిరామ్ విశాఖ రైల్వేలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. బాధితురాలికి తల్లి సుజాత, చెల్లెలు ఉన్నారు. ఇదిలా ఉంటే రెండేళ్లుగా కె.ఎల్.పురంలో నివాసం ఉంటున్న వీరు 4 నెలల కిందటే పోలయ్యపేట వచ్చారు. ఎప్పుడు చెల్లితో కలిసి వాకింగ్ వెళ్లే అమ్మాయి శుక్రవారం ఒంటరిగా వెళ్ళడం, మొబైల్ ఫోన్ కూడా లేకపోవడం, మరి కొన్ని నెలల్లో అమ్మాయికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నట్లు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. మేజిస్ట్రేట్ వచ్చి బాధితురాలితో మాట్లాడి వాంగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.