Women Cricket World Cup
-
కొత్త పొద్దుపొడుపు
అవును... భారత క్రికెట్లో ఇది కొత్త పొద్దుపొడుపు. దక్షిణాఫ్రికాలో మహిళల తొలి అండర్–19 టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం సాయంత్రం భారతీయ బాలికలు ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించి, ప్రపంచ విజేతలుగా నిలిచిన క్షణాలు అలాంటివి. షఫాలీ వర్మ సారథ్యంలో తెలుగమ్మాయి సునీత గొంగడి సహా 15 మంది సభ్యుల టీనేజ్ బాలికల జట్టు తమ విజయంతో దేశ మహిళా క్రికెట్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్వయంగా దక్షిణాఫ్రికాకు వచ్చి ఫైనల్‌కు ముందు స్ఫూర్తి నింపిన ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఛాంపియన్ నీరజ్ చోప్రా సహా అందరి ఆశలనూ, అంచనాలనూ నిజం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పురుషులకు సమానంగా మహిళలకూ వేతనమివ్వాలని గత అక్టోబర్ చివరలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించిన వేళ... తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఏర్పాటైన క్షణాన... వీస్తున్న మార్పు పవనాలకు ప్రపంచ కప్ సాధన ఓ కొత్త జోడింపు. సరిగ్గా 40 ఏళ్ళ క్రితం 1983లో పురుషుల ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత భారత క్రికెట్ మరింత మెరుగైన రీతిలో సమూలంగా మారిపోయింది. తాజాగా మన బాలికలు సాధించిన విజయం మన మహిళా క్రికెట్‌కు సరిగ్గా అలాంటి ఉత్ప్రేరకమే. గతంలో మన మహిళా క్రికెట్ జట్టు ఒకటి కన్నా ఎక్కువ సార్లే ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరింది. అయితే, ఏ ఫార్మట్‌లోనైనా మన మహిళా క్రికెటర్లు వరల్డ్ కప్ సాధించడం ఇదే తొలిసారి. బీసీసీఐ మహిళా క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సమయంలో ఈ విజయం ఒక కొత్త ఉత్సాహం, ఊపునిచ్చాయి. విరాట్ కోహ్లీ తదితరులది ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తరం కాగా, షఫాలీ వర్మ సారథ్యంలోని అండర్–19 వరల్డ్ ఛాంపియన్ బాలికలను రానున్న డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్) తరం అనుకోవచ్చు. 2008 బాలుర అండర్–19 వరల్డ్ కప్‌లో కోహ్లీ బృందం ఇలాగే విజయం అందుకుంది. అదే సమయంలో ఐపీఎల్ రావడంతో రాత్రికి రాత్రి పలువురు లక్షాధికారులయ్యారు. ఆటకు అవతార మూర్తులై, ఇంటింటా పాపులర్ అయ్యారు. భారత క్రికెట్ స్వరూప స్వభావాలే మారిపోయాయి. ఇప్పుడు మన బాలికల జట్టు ప్రపంచ ఛాంపి యన్లుగా అవతరించిన సమయానికి డబ్ల్యూపీఎల్ కొత్తగా వచ్చింది. త్వరలో తొలి డబ్ల్యూపీఎల్ వేలంతో ఈ క్రికెటర్లలో కొందరు లక్షాధికారులు కానున్నారు. కష్టాలు కడతేరి, ఆర్థిక, సామాజిక హోదా మారిపోనుంది. ఈ మ్యాచ్‌ల ప్రసార హక్కులు, పలు ఫ్రాంఛైజీల బిడ్లు దాదాపు రూ. 5.5 వేల కోట్ల పైగా పలికినట్టు వార్త. మహిళా క్రికెట్‌కు ఇవి బంగారు క్షణాలంటున్నది అందుకే. అయితే, ఎన్ని లీగ్‌లు వచ్చినా అంతిమంగా అగ్రభాగాన నిలిపేది ప్రతిభే. భారత అండర్–19 బాలికల క్రికెట్ జట్టు ఈ ఐసీసీ వరల్డ్ కప్‌లో మొదటి నుంచి తన సత్తా చాటుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ఆట మెరుగుపరుచుకుంటూ ఆస్ట్రేలియా (ప్రాక్టీస్ మ్యాచ్‌లో) సహా అనేక జట్లను అధిగమించి, ఫైనల్స్‌కు చేరింది. కప్ సాధించింది. మన బాలికల క్రికెట్ ఈ వరల్డ్ కప్ ఘనత సాధించడం వెనుక ఆటగాళ్ళతో పాటు పలువురి పాత్ర ఉంది. జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ) శ్రద్ధ, మహిళా కోచ్ నూషిన్ అల్ ఖదీర్ అసాధారణ అంకితభావం లాంటివి అండగా నిలిచాయి. పద్ధెనిమిదేళ్ళ క్రితం వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత సీనియర్ మహిళా జట్టులో సభ్యురాలైన నూషిన్ ఆకలిగొన్న పులిలా బరిలోకి దిగి, ఈ టీనేజ్ బాలికలను తీర్చిదిద్దారు. పోటీలోని వివిధ జట్ల క్రికెటర్ల కన్నా ప్రతిభావంతులుగా నిలిపారు. ఈ ప్రతిభాపాటవాలు భారత మహిళా క్రికెట్ భవిష్యత్తుకు బలమైన పునాది. కాలగతిలో సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యంతో బాలికలు ఉరకలెత్తుతున్నారు. దేశంలో మహిళా క్రికెట్ ప్రమాణాలు మెరుగవుతున్నాయనడానికి ఇది ఓ సూచన. నిజానికి, అర్ధశతాబ్ద కాలంలో మన మహిళా క్రికెట్ అనేక శృంఖలాలు తెంచుకొంది. పంజరాలను దాటింది. సామాన్య స్థాయి నుంచి అసామాన్యతకు ఎదిగింది. గడచిన రెండు సీనియర్ల టీ20 వరల్డ్ కప్‌లలో మన మహిళా జట్టు సెమీ ఫైనలిస్టుగా, ఫైనలిస్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో ఈ తొలి అండర్–19 టీ20 కప్‌లో బాలికలు ఏకంగా విజేతలయ్యారు. ఇది వారి జీవితాల్లోనే కాదు... మొత్తం భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే కీలక మలుపు. దేశంలో ఆడపిల్లలకు ప్రత్యేక క్రికెట్ అకాడెమీలు వెలుస్తున్న రోజులివి. ఈ విజయం వాటికి కొత్త ఉత్తేజం. విజేతలకు ఆత్మవిశ్వాసం పెంచే ఔషధం. పురుషులకు భిన్నంగా తగిన పారితోషికం లేకున్నా, ఇంటా బయటా అవమానాలు ఎదురైనా, ఆర్థిక – సామాజిక అవరోధాలున్నా – అవన్నీ దాటుకొని వచ్చిన స్త్రీలు కాబట్టి తాజా విజయం మరింత గొప్పది. ఇది... కూతురు సోనా యాదవ్ క్రికెట్ షూస్ కోసం అదనపు షిఫ్ట్‌లు పనిచేసిన గ్లాస్ ఫ్యాక్టరీ కార్మికుడు, ఆడబిడ్డ త్రిష శిక్షణ కోసం ఉద్యోగం వదిలి భద్రాచలం నుంచి హైదరాబాద్ మారిన తండ్రి... ఇలా ఎందరో తల్లితండ్రుల త్యాగఫలం. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు కుటుంబానికే కాదు... దేశానికీ ఎంతటి పేరు తెస్తారో చెప్పడానికి ఇది తాజా దర్పణం. బ్యాడ్మింటన్ తర్వాత భారత మహిళా క్రీడాంగణంలో ఇక క్రికెట్ కొత్త దీపశిఖ. దీన్ని మరింత ప్రజ్వరిల్లేలా చేయాల్సింది ఆటల సంఘాలు, అధికారంలోని పెద్దలే. -
దేశ ప్రతిష్టతో ఆటలా?!
మన దేశంలో ఆటకూ, వివాదానికీ ఏదో అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా జన సమ్మో హన క్రీడగా పేరున్న క్రికెట్ చుట్టూ ఎప్పుడూ వివాదాలే ముసిరి ఉంటాయి. ఈ విషయంలో పురుషుల క్రికెట్‌కి చాలా చరిత్రే ఉంది. కానీ మహిళా క్రికెట్‌ను కూడా ఈ జాడ్యం పట్టి పీడిస్తున్నదని తాజాగా స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌కు జరిగిన అన్యాయం నిరూపిస్తోంది. మిథాలీ ఆట సాటిలేనిది. నిరుడు వన్డే ప్రపంచ కప్‌లో మన జట్టును ఫైనల్‌కు చేర్చి, అత్యధిక పరుగుల రికార్డు సృష్టించడానికి చాలాముందే ఆమె ఖాతాలో ఎన్నో రికార్డులు, రివార్డులు ఉన్నాయి. రెండు దశాబ్దాల కెరీర్లో 6,000 పరుగులు దాటిన తొలి క్రీడాకారిణిగా, వన్డేల్లో యాభై అర్ధ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా, రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గ్రహీతగా మిథాలీ ఖ్యాతి అసాధారణమైనది. అలాంటి క్రీడాకారిణికి సైతం ఇంగ్లండ్‌తో జరిగిన టీ–20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో చోటు దొరక్కపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమిపాలయ్యాక చాలామంది మిథాలీరాజ్ టీంలో లేకపోబట్టే ఈ దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారంటేనే ఆమె విలువేమిటో అర్ధమవుతుంది. ఆమెను టీం నుంచి మినహాయించడానికి కారణాలేమిటన్న ప్రశ్నకు టీ–20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇచ్చిన అరకొర వివరణ, మిథాలీ మౌనం అయోమయం కలగజేశాయి. అయితే మిథాలీ మాజీ మేనేజర్ అనిషా గుప్తా ఇచ్చిన ట్వీట్ చూశాక విషయమేమిటో అందరికీ బోధపడింది. అనంతరం అటు మిథాలీ, ఇటు ఆమె వ్యతిరేక వర్గం తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఓడిన జట్టు అందుకు గల కారణాలేమిటని ఆత్మ పరిశీలన చేసుకుని ఏ నిర్ణయాలు ఆ పరిస్థితిని తీసుకొచ్చాయో నిర్ధారిం చుకోవాలి. కానీ అందుకు భిన్నంగా ‘ఆస్ట్రేలియాపై గెలిచిన జట్టును మార్చదల్చుకోలేదు గనుకే మిథాలీని తీసుకోలేదు. ఏం చేసినా జట్టు కోసమే’ అని హర్మన్‌ప్రీత్ జవాబిచ్చారు. క్రీడాకారిణిగా హర్మన్‌ప్రీత్‌కు మంచి రికార్డే ఉంది. కానీ ఆమె కెప్టెన్సీని ప్రశ్నార్థకం చేసే జవాబిది. ఇందులో పశ్చాత్తాపం లేదు. కనీసం తన నిర్ణయంలో పొరపాటు జరిగిందన్న ధ్వని లేదు. వ్యక్తుల మధ్య వచ్చే స్పర్థలు, అభిప్రాయభేదాలు జట్టు ఎంపికపైనా, దాని ఆటతీరుపైనా ప్రభావం చూపకూడదు. అందరూ సమష్టిగా పనిచేసి దేశానికి విజయం సాధించిపెట్టాలను కోవడానికి బదులు, ఎవరికి వారు తమ అహంభావాన్ని సంతృప్తి పరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి. జట్టు సభ్యుల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు వారిని పిలిచి మాట్లాడటం, సయోధ్య కుదర్చడం బీసీసీఐ పెద్దలు చేయాల్సిన పని. జట్టులో హేమా హేమీలున్నప్పుడు...వారిలో ఒకరు కెప్టెన్‌గా పనిచేస్తున్నప్పుడు స్ఫర్థలు వింతేమీ కాదు. గతంలో కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌ల మధ్య అలాంటి విభేదాలు తలెత్తాయి. అయితే అప్పటి బీసీసీఐ చైర్మన్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుత బీసీసీఐ నిర్వాహకులు ఆ పని చేయ లేకపోతున్నారు. ఇప్పుడు దీనికి తోడు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) ఉంది. జట్టు కోచ్ రమేశ్ పొవార్ చెబుతున్నదాన్నిబట్టి మిథాలీరాజ్‌తో ఆయనకు చాన్నా ళ్లుగా విభేదాలున్నాయని వెల్లడైంది. ఓపెనర్‌గా తననే పంపాలని, లేనట్టయితే ప్రపంచకప్ నుంచి తప్పుకుంటానని ఆమె బెదిరించిందంటున్నారు. అటు హర్మన్‌ప్రీత్‌కు సైతం మిథాలీతో పడటం లేదు. మరోపక్క తనకు ఆదినుంచీ పొవార్తోనూ, సీఓఏ సభ్యురాలు ఎదుల్జీతోనూ సమస్య లున్నాయని మిథాలీ చెబుతున్నారు. వీటిపై ఆమె బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీకి వివరంగానే మెయిల్ చేశారు. ఈ అంశాలనే బీసీసీఐ మేనేజర్ తృప్తి భట్టాచార్య దృష్టికి తీసుకెళ్లినా ఆచరణలో జరిగిందేమీ లేదు. ఈ తీరు క్రికెట్లో మాత్రమే కాదు...అన్ని ఆటల్లోకీ వ్యాపించింది. మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వారికి మెరికల్లా తయారు చేయాల్సిన సంఘాలు, వాటి నిర్వాహకులు తాము ఆడిందే ఆటన్నట్టు వ్యవహరిస్తున్నా పట్టించుకునేవారు ఉండటం లేదు. అయోగ్యులకు అందలం, ప్రతిభకు పాతర అన్నిచోట్లా రివాజుగా మారింది. ఒలింపిక్ సంఘం మొదలుకొని బీసీసీఐ వరకూ పలు సంస్థల్లో అనేకమంది పాతుకుపోయి శాసిస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా రంగంలో దేశాన్ని ఉన్న తంగా నిలపాలన్న ధ్యాస లేకుండా ప్రవర్తిస్తున్నారు. తమను అడిగేవారు లేరన్నట్టు వ్యవహ రిస్తున్నారు. ఇప్పుడు మిథాలీ ఎదుర్కొంటున్న సమస్యలాంటిదే తనకూ గతంలో ఎదురైందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెబుతున్నాడు. 15 నెలలపాటు తనకు ఛాన్సి వ్వకుండా కూర్చోబెట్టారని గుర్తు చేస్తున్నాడు. క్రికెట్ ఆట రాజకీయ నాయకుల వల్ల భ్రష్టు పడుతున్న తీరు గమనించి వారిని దూరం పెట్టమని సుప్రీంకోర్టు గతంలో హితవు చెప్పింది. సీఓఏ ఏర్పాటైతే సమస్యలు తగ్గుముఖం పడతాయని కూడా భావించింది. కానీ ఇప్పుడు మిథాలీ సీఓఏ సభ్యురాలి ధోరణిని ప్రస్తావించడం చూస్తే ప్రతిభకు పట్టంగట్టే వ్యవస్థ ఏర్పడాలనుకుంటున్న సర్వోన్నత న్యాయస్థానం ఆశ నెరవేరుతుందా అన్న అనుమానం కలుగుతుంది. మిథాలీని తప్పిం చడం గురించి సునీల్ గావస్కర్ ప్రస్తావించి, విరాట్ కోహ్లీకి కూడా ఇలాగే చేస్తారా అని ప్రశ్నిం చాడు. హర్మన్‌ప్రీత్ కౌర్ కాకపోయినా కనీసం బీసీసీఐ, సీఓఏ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఒక్క క్రికెట్ రంగంలో మాత్రమే కాదు... మొత్తంగా క్రీడల్లో తలెత్తుతున్న ఇలాంటి ధోరణులను అరి కట్టడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. అంతర్జాతీయ క్రీడారంగంలో మన దేశ ప్రతిష్ట పెరగాలంటే ఇది తప్పనిసరి. జాతీయ క్రికెట్ జట్టులో పాలుపంచుకోవడం గొప్ప గౌరవంగా భావించి, దాని గెలుపుకోసం వ్యూహరచన చేయాల్సినవారు తమకు నచ్చనివారిని దెబ్బతీసేందుకు చవకబారు ఎత్తుగడలకు దిగడం దిగ్భ్రాంతికరం. ఈ ధోరణులు మరింత ముద రక ముందే చర్యలకు ఉపక్రమించడం ఉత్తమం. -
మార్చిలో మహిళల ముక్కోణపు టోర్నీ
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టు గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుండటంతో... ఎనిమిది నెలల తర్వాత భారత జ ట్టు అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ (2017–2020)లో భాగంగా మార్చి 12–18 మధ్య బరోడాలో జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా పాల్గొననుంది. అనంతరం మార్చి 22 నుంచి ముంబైలో జరిగే ముక్కోణపు టి20 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలతో పాటు ఇంగ్లండ్ జట్లు పాల్గొంటాయని బీసీసీఐ శుక్రవారం తెలిపింది. -
కౌర్ ఇన్నింగ్స్:'నాతో పోల్చకండి ప్లీజ్!'
మహిళా ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగి ఆడిన సునామీ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె చేసిన 171 పరుగుల ఇన్నింగ్స్‌ను 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ చేసిన 175 పరుగులతో పోలుస్తున్నారు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి.. కపిల్, హర్మన్‌ప్రీత్ ఇద్దరి ఫొటోలు పెట్టి ఆనాటి ఇన్నింగ్స్‌ను గుర్తుకుతెచ్చిందంటూ కామెంట్ చేశాడు. ఇక కామెంటేటర్లు హర్ష భోగ్లే, అలాన్ విల్కిన్స్ తదితరులు కపిల్-హర్మన్ ఇన్నింగ్స్‌లను పోలుస్తూ కొనియాడారు. అయితే, ఇలా పోల్చడంపై తాజాగా లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. హర్మన్ కౌర్ ఇన్నింగ్స్‌ను సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా పోల్చకూడదని ఆయన కామెంట్ చేశారు. 'ఇప్పటికే భారత్ వరల్కప్ గెలిచిన భావన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇంగ్లండ్‌తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందుకే ఫైనల్లో వారికి శుభాభివందనలు తెలుపుతున్నా' అని కపిల్ మీడియాతో అన్నారు. ఇక హర్మన్ 171 పరుగులను తన ఇన్నింగ్స్‌తో పోల్చడంపై స్పందిస్తూ 'ఇలా పోల్చడం న్యాయం కాదు. ఆ రెండింటినీ పోల్చలేం. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు తెరపైకి తీసుకురాకూడదు. ఇప్పుడు మనమందరం హర్మన్ ఇన్నింగ్స్ ను సెలబ్రేట్ చేయాలి' అని కపిల్ సూచించారు. ఇక, 'మహిళా క్రికెటర్ల ఆటతీరు చూస్తుంటే గర్వంగా ఉందని, అద్భుతమైన విజయాన్ని సాధించిన వారికి అభినందనలు' అని కపిల్ శుక్రవారం ట్వీట్ చేశారు. చిరస్మరణనీయమైన ఆటతీరును హర్మన్ ప్రదర్శరించిందని కపిల్ కొనియాడారు. మహిళల ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ అద్వితీయమై బ్యాటింగ్‌తో చెలరేగిన సంగతి తెలిసిందే. 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171 పరుగులు చేసిన హర్మన్ ఫైనల్లోనూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.