మన దేశంలో ఆటకూ, వివాదానికీ ఏదో అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా జన సమ్మో హన క్రీడగా పేరున్న క్రికెట్ చుట్టూ ఎప్పుడూ వివాదాలే ముసిరి ఉంటాయి. ఈ విషయంలో పురుషుల క్రికెట్‌కి చాలా చరిత్రే ఉంది. కానీ మహిళా క్రికెట్‌ను కూడా ఈ జాడ్యం పట్టి పీడిస్తున్నదని తాజాగా స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌కు జరిగిన అన్యాయం నిరూపిస్తోంది. మిథాలీ ఆట సాటిలేనిది. నిరుడు వన్డే ప్రపంచ కప్‌లో మన జట్టును ఫైనల్‌కు చేర్చి, అత్యధిక పరుగుల రికార్డు సృష్టించడానికి చాలాముందే ఆమె ఖాతాలో ఎన్నో రికార్డులు, రివార్డులు ఉన్నాయి. రెండు దశాబ్దాల కెరీర్‌లో 6,000 పరుగులు దాటిన తొలి క్రీడాకారిణిగా, వన్డేల్లో యాభై అర్ధ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా, రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గ్రహీతగా మిథాలీ ఖ్యాతి అసాధారణమైనది.
అలాంటి క్రీడాకారిణికి సైతం ఇంగ్లండ్‌తో జరిగిన టీ–20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో చోటు దొరక్కపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమిపాలయ్యాక చాలామంది మిథాలీరాజ్ టీంలో లేకపోబట్టే ఈ దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారంటేనే ఆమె విలువేమిటో అర్ధమవుతుంది. ఆమెను టీం నుంచి మినహాయించడానికి కారణాలేమిటన్న ప్రశ్నకు టీ–20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇచ్చిన అరకొర వివరణ, మిథాలీ మౌనం అయోమయం కలగజేశాయి. అయితే మిథాలీ మాజీ మేనేజర్ అనిషా గుప్తా ఇచ్చిన ట్వీట్ చూశాక విషయమేమిటో అందరికీ బోధపడింది.
అనంతరం అటు మిథాలీ, ఇటు ఆమె వ్యతిరేక వర్గం తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఓడిన జట్టు అందుకు గల కారణాలేమిటని ఆత్మ పరిశీలన చేసుకుని ఏ నిర్ణయాలు ఆ పరిస్థితిని తీసుకొచ్చాయో నిర్ధారిం చుకోవాలి. కానీ అందుకు భిన్నంగా ‘ఆస్ట్రేలియాపై గెలిచిన జట్టును మార్చదల్చుకోలేదు గనుకే మిథాలీని తీసుకోలేదు. ఏం చేసినా జట్టు కోసమే’ అని హర్మన్‌ప్రీత్ జవాబిచ్చారు. క్రీడాకారిణిగా హర్మన్‌ప్రీత్‌కు మంచి రికార్డే ఉంది. కానీ ఆమె కెప్టెన్సీని ప్రశ్నార్థకం చేసే జవాబిది. ఇందులో పశ్చాత్తాపం లేదు. కనీసం తన నిర్ణయంలో పొరపాటు జరిగిందన్న ధ్వని లేదు.
వ్యక్తుల మధ్య వచ్చే స్పర్థలు, అభిప్రాయభేదాలు జట్టు ఎంపికపైనా, దాని ఆటతీరుపైనా ప్రభావం చూపకూడదు. అందరూ సమష్టిగా పనిచేసి దేశానికి విజయం సాధించిపెట్టాలను కోవడానికి బదులు, ఎవరికి వారు తమ అహంభావాన్ని సంతృప్తి పరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి. జట్టు సభ్యుల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు వారిని పిలిచి మాట్లాడటం, సయోధ్య కుదర్చడం బీసీసీఐ పెద్దలు చేయాల్సిన పని. జట్టులో హేమా హేమీలున్నప్పుడు...వారిలో ఒకరు కెప్టెన్‌గా పనిచేస్తున్నప్పుడు స్ఫర్థలు వింతేమీ కాదు.
గతంలో కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌ల మధ్య అలాంటి విభేదాలు తలెత్తాయి. అయితే అప్పటి బీసీసీఐ చైర్మన్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుత బీసీసీఐ నిర్వాహకులు ఆ పని చేయ లేకపోతున్నారు. ఇప్పుడు దీనికి తోడు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) ఉంది. జట్టు కోచ్ రమేశ్ పొవార్ చెబుతున్నదాన్నిబట్టి మిథాలీరాజ్‌తో ఆయనకు చాన్నా ళ్లుగా విభేదాలున్నాయని వెల్లడైంది. ఓపెనర్‌గా తననే పంపాలని, లేనట్టయితే ప్రపంచకప్ నుంచి తప్పుకుంటానని ఆమె బెదిరించిందంటున్నారు. అటు హర్మన్‌ప్రీత్‌కు సైతం మిథాలీతో పడటం లేదు. మరోపక్క తనకు ఆదినుంచీ పొవార్‌తోనూ, సీఓఏ సభ్యురాలు ఎదుల్జీతోనూ సమస్య లున్నాయని మిథాలీ చెబుతున్నారు. వీటిపై ఆమె బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీకి వివరంగానే మెయిల్ చేశారు. ఈ అంశాలనే బీసీసీఐ మేనేజర్ తృప్తి భట్టాచార్య దృష్టికి తీసుకెళ్లినా ఆచరణలో జరిగిందేమీ లేదు.
ఈ తీరు క్రికెట్‌లో మాత్రమే కాదు...అన్ని ఆటల్లోకీ వ్యాపించింది. మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వారికి మెరికల్లా తయారు చేయాల్సిన సంఘాలు, వాటి నిర్వాహకులు తాము ఆడిందే ఆటన్నట్టు వ్యవహరిస్తున్నా పట్టించుకునేవారు ఉండటం లేదు. అయోగ్యులకు అందలం, ప్రతిభకు పాతర అన్నిచోట్లా రివాజుగా మారింది. ఒలింపిక్ సంఘం మొదలుకొని బీసీసీఐ వరకూ పలు సంస్థల్లో అనేకమంది పాతుకుపోయి శాసిస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా రంగంలో దేశాన్ని ఉన్న తంగా నిలపాలన్న ధ్యాస లేకుండా ప్రవర్తిస్తున్నారు.
తమను అడిగేవారు లేరన్నట్టు వ్యవహ రిస్తున్నారు. ఇప్పుడు మిథాలీ ఎదుర్కొంటున్న సమస్యలాంటిదే తనకూ గతంలో ఎదురైందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెబుతున్నాడు. 15 నెలలపాటు తనకు ఛాన్సి వ్వకుండా కూర్చోబెట్టారని గుర్తు చేస్తున్నాడు. క్రికెట్ ఆట రాజకీయ నాయకుల వల్ల భ్రష్టు పడుతున్న తీరు గమనించి వారిని దూరం పెట్టమని సుప్రీంకోర్టు గతంలో హితవు చెప్పింది. సీఓఏ ఏర్పాటైతే సమస్యలు తగ్గుముఖం పడతాయని కూడా భావించింది. కానీ ఇప్పుడు మిథాలీ సీఓఏ సభ్యురాలి ధోరణిని ప్రస్తావించడం చూస్తే ప్రతిభకు పట్టంగట్టే వ్యవస్థ ఏర్పడాలనుకుంటున్న సర్వోన్నత న్యాయస్థానం ఆశ నెరవేరుతుందా అన్న అనుమానం కలుగుతుంది. మిథాలీని తప్పిం చడం గురించి సునీల్ గావస్కర్ ప్రస్తావించి, విరాట్ కోహ్లీకి కూడా ఇలాగే చేస్తారా అని ప్రశ్నిం చాడు.
హర్మన్‌ప్రీత్ కౌర్ కాకపోయినా కనీసం బీసీసీఐ, సీఓఏ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఒక్క క్రికెట్ రంగంలో మాత్రమే కాదు... మొత్తంగా క్రీడల్లో తలెత్తుతున్న ఇలాంటి ధోరణులను అరి కట్టడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. అంతర్జాతీయ క్రీడారంగంలో మన దేశ ప్రతిష్ట పెరగాలంటే ఇది తప్పనిసరి. జాతీయ క్రికెట్ జట్టులో పాలుపంచుకోవడం గొప్ప గౌరవంగా భావించి, దాని గెలుపుకోసం వ్యూహరచన చేయాల్సినవారు తమకు నచ్చనివారిని దెబ్బతీసేందుకు చవకబారు ఎత్తుగడలకు దిగడం దిగ్భ్రాంతికరం. ఈ ధోరణులు మరింత ముద రక ముందే చర్యలకు ఉపక్రమించడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment