BCCI Equal Pay Decision: మ్యాచ్ ఫీజుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత మహిళల క్రికెట్‌కు కొత్త ఊపు తెచ్చే చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్న రోజును అతి ప్రత్యేకమైన ‘రెడ్ లెటర్ డే’గా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభివర్ణించగా... ఇదో చారిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా మహిళల క్రికెట్‌లో కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నామని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘లింగ వివక్షను తొలగించి.. సమానత్వాన్ని పెంపొందించే క్రమంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. భారత క్రికెట్‌లో మరో ముందడుగు పడింది’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా బోర్డును అభినందించాడు.
ఇకపై ఇలా
మ్యాచ్ ఫీజుల విషయంలో టీమిండియా పురుష క్రికెటర్లు, మహిళా క్రికెటర్ల మధ్య ఎప్పటి నుంచో ఉన్న అంతరాన్ని తొలగించింది. ఇకపై భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఇక నుంచి మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున చెల్లిస్తారు.
ఇంతకు ముందు ఇలా ఉండేది
ఇప్పటి వరకు మహిళా క్రికెటర్లకు వన్డే, టి20లకు రూ.1 లక్ష లభిస్తుండగా, టెస్టు మ్యాచ్‌కు రూ. 2 లక్షల 50 వేలు ఇస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత క్రికెట్‌లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని, వివక్షను దూరం చేసే దిశగా తొలి అడుగు అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొనగా... తాజా నిర్ణయం మహిళల క్రికెట్ అభివృద్ధికి మరింతగా దోహదం చేస్తుందని అధ్యక్షుడు రోజర్ బిన్నీ వ్యాఖ్యానించారు.
కివీస్ తర్వాత మనమే
ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాత్రమే ఇలా పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా మ్యాచ్ ఫీజులు చెల్లిస్తోంది. భారత్ రెండో జట్టు కాగా... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కూడా వ్యత్యాసం కొనసాగుతోంది.
కాంట్రాక్ట్ విషయంలో మాత్రం
2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన నాటి నుంచి భారత మహిళల జట్టు ప్రదర్శన మరింతగా మెరుగవుతూ వస్తోంది. దీనిని మరింత ప్రోత్సాహించే దిశగా తాజా ప్రకటన వెలువడింది. అయితే బోర్డు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్‌కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్‌లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు చొప్పున బోర్డు ఇస్తోంది. అదే పురుష క్రికెటర్లకు మాత్రం ఎ, బి, సి గ్రేడ్‌లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు లభిస్తాయి.
చదవండి: T20 WC 2022: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి'
Comments
Please login to add a commentAdd a comment