ఉత్సాహం..విషాదం కావద్దు
నూతన సంవత్సర వేళ అప్రమత్తం
మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత
100 బృందాలతో తనిఖీలు
కమిషనర్ సీవీ ఆనంద్
మాదాపూర్: నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతులకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ముఖ్యంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయడాన్ని నివారించేందుకు 100 బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘నూతన సంవత్సర వేడుకలను భాధ్యతాయుతంగా నిర్వహించాల’నే అంశంపై మాదాపూర్‌లోని ఎన్‌కన్వెషన్‌లో గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ భద్రంగా, ప్రమాదాలకు తావులేకుండా పార్టీలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. గత ఏడాది నూతన సంవత్సర వేడుకల సమయంలో ప్రమాదాలను తగ్గించగలిగామని, ఎటువంటి ప్రాణనష్టం కలుగలేదని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా ప్రమాదాలకు తావు లేకుండా చూస్తామని తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళల భద్రత చాలా ముఖ్యమైన అంశమన్నారు. స్త్రీల కోసం తగిన సంఖ్యలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, ఆ ప్రదేశాల్లో అవాంఛనీయసంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ‘బ్యాడ్ న్యూస్ బ్యాగ్’ను ఆయన ఆవిష్కరించారు. 40వేల బ్యాడ్ న్యూస్ బ్యాగ్‌లను రిటైల్ దుకాణాలలో పంచనున్నట్టు తెలిపారు. ఈ బ్యాగ్‌లపై రోడ్డు ప్రమాదాల దృశ్యాలు, వార్తలు ముద్రించారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్స్ నౌ సంస్థ మేనేజర్ రాజ్ పాకాల, వెంకట్ రామన్, విపిన్ తదితరులు పాల్గొన్నారు.