women giving birth
-
ఆస్పత్రికి వెళ్లినా.. ఆటోలోనే ప్రసవం!
రాయ్‌పూర్: పురిటినొప్పులతో బాధపడుతూనే అతి కష్టం మీద ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళ చేదు అనుభవాన్ని చవిచూడాల్సివచ్చింది. ఆస్పత్రిలో డాక్టర్ లేరు, కనీసం కాంపౌండర్ జాడకూడా లేదు. దిక్కుతోచని స్థితిలో పక్కనున్న ఆటోలో ఒరిగిపోయింది. మనసున్న అమ్మలు కొందరు ఆటో చుట్టూ అడ్డంగా నిలబడి, పురుడుపోశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో సోమవారం చోటుచేసుకుందీ ఘటన. మారుమూల గ్రామంలో నివసించే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు ఆమెను కోరియాలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తీరా అక్కడ వైద్యులు లేకపోవడంతో వెనుదిరిగేప్రయత్నం చేశారు. అంతలోనే నొప్పులు అధికం కావడం, ఆటోలోనే ప్రసవించడం జరిగింది. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తలెత్తే ఇబ్బందుల కారణంగా భారత్‌లో ఏటా 45వేల మంది మహిళలు చనిపోతున్నారు. అదృష్టవశాత్తూ ఈ మహిళ, ఆమె పాపాయికి ప్రాణాలతో గట్టెక్కారు. -
నడిరోడ్డుపై మహిళ ప్రసవం
రాయగడ(ఒడిశా): పేదల వైద్యానికి రూ.వేల కోట్లు మంజూరు చేస్తూ ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో గర్భిణుల ప్రసవానికి అందుబాటులో అంబులెన్సులను ఏర్పాటు చేయలేకపోతోంది. అంబులెన్సులను ప్రైవేట్ సంస్థ ద్వారా నిర్వహించడం వల్ల వైద్యాధికారుల ఆధీనంలో ఈ సేవలు ప్రజలకు సక్రమంగా అందడం లేదు. ఫలితంగా పేదప్రజలు అత్యవసర సమాయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశాలోని రాయగడ జిల్లాలోని శిఖరపాయి గ్రామ పంచాయతీలో ఓ మహిళ నడిరోడ్డుపై శుక్రవారం ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కల్యాణ సింగుపురం సమితిలో శిఖరపాయి గ్రామ పంచాయతీ ఉపొరొసజి గ్రామానికి చెందిన రమేష్ భార్య లిసిక నిండు గర్భిణి. అర్ధరాత్రి దాటిన తరువాత ఆమెకు పురిటినొప్పులు ఎక్కువవడంతో శుక్రవారం వేకువజామున 3గంటల నుంచి శిఖరపాయి ఆస్పత్రికి అంబులెన్సు కోసం ఫోన్ చేయగా ఎంతకీ స్పందన లభించలేదు. ఉదయం 10గంటల వరకు అంబులెన్స్ చేరకపోవడంతో నొప్పులు తీవ్రవైన గర్భిణిని బంధువులు తీసుకుని ఉపొరొసజి నుంచి శిఖరపాయికి వస్తుండగా గొడొగాం గ్రామంలో (శిఖరపాయికి 5కిలోమీటర్ల దూరం) ఒక మామిడి చెట్టు కింద ఆమె ప్రసవించింది. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తూ వైద్యవిభాగానికి కోట్లాది రూపాయలు మంజురు చేసినప్పటికీ గర్భిణులకు గ్రామీణ ప్రజలకు ఈపథకాలు చేరడం లేదని ఈ ఘటనతో రుజువవుతోంది.