నడిరోడ్డుపై మహిళ ప్రసవం
రాయగడ(ఒడిశా):
పేదల వైద్యానికి రూ.వేల కోట్లు మంజూరు చేస్తూ ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో గర్భిణుల ప్రసవానికి అందుబాటులో అంబులెన్సులను ఏర్పాటు చేయలేకపోతోంది. అంబులెన్సులను ప్రైవేట్ సంస్థ ద్వారా నిర్వహించడం వల్ల వైద్యాధికారుల ఆధీనంలో ఈ సేవలు ప్రజలకు సక్రమంగా అందడం లేదు. ఫలితంగా పేదప్రజలు అత్యవసర సమాయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశాలోని రాయగడ జిల్లాలోని శిఖరపాయి గ్రామ పంచాయతీలో ఓ మహిళ నడిరోడ్డుపై శుక్రవారం ప్రసవించింది.
వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కల్యాణ సింగుపురం సమితిలో శిఖరపాయి గ్రామ పంచాయతీ ఉపొరొసజి గ్రామానికి చెందిన రమేష్ భార్య లిసిక నిండు గర్భిణి. అర్ధరాత్రి దాటిన తరువాత ఆమెకు పురిటినొప్పులు ఎక్కువవడంతో శుక్రవారం వేకువజామున 3గంటల నుంచి శిఖరపాయి ఆస్పత్రికి అంబులెన్సు కోసం ఫోన్ చేయగా ఎంతకీ స్పందన లభించలేదు. ఉదయం 10గంటల వరకు అంబులెన్స్ చేరకపోవడంతో నొప్పులు తీవ్రవైన గర్భిణిని బంధువులు తీసుకుని ఉపొరొసజి నుంచి శిఖరపాయికి వస్తుండగా గొడొగాం గ్రామంలో (శిఖరపాయికి 5కిలోమీటర్ల దూరం) ఒక మామిడి చెట్టు కింద ఆమె ప్రసవించింది. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తూ వైద్యవిభాగానికి కోట్లాది రూపాయలు మంజురు చేసినప్పటికీ గర్భిణులకు గ్రామీణ ప్రజలకు ఈపథకాలు చేరడం లేదని ఈ ఘటనతో రుజువవుతోంది.