women IPL
-
వచ్చే ఏడాదైనా.. మహిళల ఐపీఎల్ మొదలు పెట్టండి!
న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్ గురించి పదే పదే చర్చ జరుగుతున్నా...దానిని పూర్తి స్థాయిలో నిర్వహించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. ఐపీఎల్ 2020 సందర్భంగా నాలుగు జట్లతో మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించాలని మాత్రం నిర్ణయించింది. అయితే పూర్తి స్థాయి ఐపీఎల్ గురించి బోర్డు ఇంకా ఎంత కాలం ఎదురు చూస్తుందని భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశ్నించింది. వచ్చే ఏడాదినుంచైనా దీనిని మొదలు పెడితే బాగుంటుందని ఆమె సూచించింది. ‘కనీసం 2021లోనైనా మహిళల ఐపీఎల్ నిర్వహించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరీ భారీ స్థాయిలో కాకపోయినా పురుషుల లీగ్‌తో పోలిస్తే స్వల్ప మార్పులతోనైనా ఇది మొదలు కావాలి. ఉదాహరణకు నలుగురు విదేశీ ఆటగాళ్లకు బదులుగా ఐదు లేదా ఆరుగురు ఆడవచ్చనే నిబంధన పెట్టవచ్చు’ అని మిథాలీ వ్యాఖ్యానించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ...‘కనీసం ఏడు జట్ల మహిళల ఐపీఎల్ నిర్వహించాలంటే వాస్తవికంగా ఆలోచించాలి. మన దగ్గర అంత మంది నాణ్యమైన క్రికెటర్లు అందుబాటులో లేరు. అందుకు కనీసం నాలుగేళ్లు పడుతుంది’ అని వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచిన నేపథ్యంలో మహిళల ఐపీఎల్‌పై డిమాండ్ పెరిగింది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా దీనికి మద్దతునిచ్చారు. మహిళల ఐపీఎల్ వస్తే అప్పుడు ఆటగాళ్ల సంఖ్య ఎలాగూ పెరుగుతుందని, ఇప్పుడు ఉన్న ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు మహిళల టీమ్‌లను నిర్వహించగలవని మిథాలీ చెప్పింది. ‘దేశవాళీలో ఎక్కువ మంది ప్రతిభావంతులైన అమ్మాయిలు లేరనే విషయాన్ని నేనూ అంగీకరిస్తా. అయితే ఇప్పుడున్న ఫ్రాంచైజీలే మహిళా జట్లను తీసుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బోర్డు ఎప్పటికీ వేచి చూస్తామంటే ఎలా. ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా. ఒక్కో ఏడాది మెల్లగా స్థాయి పెంచుకుంటూ పోవచ్చు. అప్పుడు నలుగురు విదేశీ ఆటగాళ్లకే పరిమితం చేయవచ్చు’ అని మిథాలీ అభిప్రాయ పడింది. -
'మాకూ ఐపీఎల్ ఏర్పాటు చేయండి'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. క్రికెటర్ల జీవితాల్లో పెద్దన్న పోషిస్తూ తనదైన ముద్రతో ముందుకు సాగుతోంది ఐపీఎల్. అయితే దీన్ని కేవలం పురుషులకు మాత్రమే పరిమితం చేయకుండా, మహిళా విభాగంలో కూడా ప్రవేశపెట్టాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళా క్రికెట్ కెప్టెన్లు మెగ్ లాన్నింగ్, చార్లోట్ ఎడ్వర్డ్స్ లు కోరుతున్నారు. ఈ మేరకు మహిళా ఐపీఎల్ ను ప్రవేశపెట్టడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) దృష్టి సారించాలని వారు విన్నవించారు. ఇప్పటికే మహిళా క్రికెటర్లకు ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ లీగ్ ఉండగా, ఇంగ్లండ్ లో సూపర్ లీగ్ ను ఈ ఏడాది ఆరంభిస్తున్న సంగతిని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళా క్రికెట్ అభ్యున్నతికి ఈ తరహా లీగ్ లో ఎంతో ఉపకరిస్తాయని ఇంగ్లండ్ కెప్టెన్ ఎడ్వర్డ్స్ అభిప్రాయపడగా, ఈ లీగ్ ల వల్ల మహిళలు క్రికెట్ పై మరింత ఆసక్తిని పెంచుకుంటారని ఆస్ట్రేలియా కెప్టెన్ లాన్నింగ్ పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు ఏ రకంగా మహిళా క్రికెట్ లీగ్ ను చేపట్టడానికి ఆసక్తి కనబరచాయో, అదే విధంగా బీసీసీఐ కూడా మహిళా ఐపీఎల్ ఏర్పాటుకు నడుంబిగించాలన్నారు.