'మాకూ ఐపీఎల్ ఏర్పాటు చేయండి'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. క్రికెటర్ల జీవితాల్లో పెద్దన్న పోషిస్తూ తనదైన ముద్రతో ముందుకు సాగుతోంది ఐపీఎల్. అయితే దీన్ని కేవలం పురుషులకు మాత్రమే పరిమితం చేయకుండా, మహిళా విభాగంలో కూడా ప్రవేశపెట్టాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళా క్రికెట్ కెప్టెన్లు మెగ్ లాన్నింగ్, చార్లోట్ ఎడ్వర్డ్స్ లు కోరుతున్నారు. ఈ మేరకు మహిళా ఐపీఎల్ ను ప్రవేశపెట్టడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) దృష్టి సారించాలని వారు విన్నవించారు.
ఇప్పటికే మహిళా క్రికెటర్లకు ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ లీగ్ ఉండగా, ఇంగ్లండ్ లో సూపర్ లీగ్ ను ఈ ఏడాది ఆరంభిస్తున్న సంగతిని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళా క్రికెట్ అభ్యున్నతికి ఈ తరహా లీగ్ లో ఎంతో ఉపకరిస్తాయని ఇంగ్లండ్ కెప్టెన్ ఎడ్వర్డ్స్ అభిప్రాయపడగా, ఈ లీగ్ ల వల్ల మహిళలు క్రికెట్ పై మరింత ఆసక్తిని పెంచుకుంటారని ఆస్ట్రేలియా కెప్టెన్ లాన్నింగ్ పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు ఏ రకంగా మహిళా క్రికెట్ లీగ్ ను చేపట్టడానికి ఆసక్తి కనబరచాయో, అదే విధంగా బీసీసీఐ కూడా మహిళా ఐపీఎల్ ఏర్పాటుకు నడుంబిగించాలన్నారు.