ఐపీఎల్ 2023లో రూ.5,120 కోట్లు లాభం
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దాదాపు గల్లీల్లో ఎక్కడోచోట క్రికెట్ ఆడుతుండడం గమనిస్తాం. ఇంతలా ఆదరణ పొందిన క్రికెట్‌ను నిర్వహిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా రూ.5,120 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2022లో పొందిన రూ.2,367 కోట్లు కంటే ఇది 116 శాతం అధికం.
బీసీసీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2023లో ఐపీఎల్ ద్వారా వచ్చిన వార్షిక ఆదాయం రూ.11,769 కోట్లుగా ఉంది. వ్యయం గతంలో కంటే 66% పెరిగి రూ.6,648 కోట్లకు చేరుకుంది. దాంతో మొత్తంగా రూ.5,120 కోట్లు లాభం వచ్చింది. కొత్త మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్ ఒప్పందాల వల్ల ఈ డబ్బు సమకూరిందని బీసీసీఐ పేర్కొంది.
2023-27 సీజన్‌కుగాను బీసీసీఐ గతంలో వేలం నిర్వహించింది. అందులో కంపెనీలు పోటీపడి రూ.48,390 కోట్ల విలువైన మీడియా హక్కులను చేజిక్కించుకున్నాయి. దాంతో బీసీసీఐ ఖజానా నిండింది. డిస్నీ స్టార్ రూ.23,575 కోట్లు బిడ్ వేసి 2023-27 ఐపీఎల్ టీవీ హక్కులను పొందగా, వయాకామ్ 18 యాజమాన్యంలోని జియో సినిమా రూ.23,758 కోట్ల బిడ్‌తో డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకు ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.3,780 కోట్ల ఆదాయం సమకూరింది. 2023లో అది 131 శాతం పెరిగి రూ.8,744 కోట్లకు చేరుకుంది.
ఐదేళ్ల కాలానికిగాను ఐపీఎల్ టైటిల్ హక్కులను టాటా సన్స్ రూ.2,500 కోట్లకు చేజిక్కించుకుంది. మైసర్కిల్11, రూపే, ఏంజిల్‌వన్, సీయెట్ సంస్థలకు అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌లను విక్రయించడం ద్వారా బీసీసీఐ మరో రూ.1,485 కోట్లను సంపాదించింది. ఫ్రాంచైజీ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాలు గతంలో కంటే 2023లో 22 శాతం పెరిగి రూ.2,117 కోట్లకు చేరుకున్నాయి. స్పాన్సర్‌షిప్ ఆదాయం రూ.828 కోట్ల నుంచి 2 శాతం పెరిగి రూ.847 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షలు వేతనం!
ఇదిలాఉండగా, 2023లో అరంగేట్రం చేసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నుంచి క్రికెట్ బోర్డ్ రూ.377 కోట్ల లాభం సంపాదించింది. మీడియా హక్కులు, ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా రూ.636 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. వీటంతటికి రూ.259 కోట్లు ఖర్చు చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ.2,038 కోట్ల జీఎస్టీను చెల్లించిందని రాజ్యసభకు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment