గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీ ప్రారంభం సందర్భంగా మిథాలీ, హర్మన్, స్మృతి
న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్ గురించి పదే పదే చర్చ జరుగుతున్నా...దానిని పూర్తి స్థాయిలో నిర్వహించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. ఐపీఎల్ 2020 సందర్భంగా నాలుగు జట్లతో మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించాలని మాత్రం నిర్ణయించింది. అయితే పూర్తి స్థాయి ఐపీఎల్ గురించి బోర్డు ఇంకా ఎంత కాలం ఎదురు చూస్తుందని భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశ్నించింది. వచ్చే ఏడాదినుంచైనా దీనిని మొదలు పెడితే బాగుంటుందని ఆమె సూచించింది.
‘కనీసం 2021లోనైనా మహిళల ఐపీఎల్ నిర్వహించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరీ భారీ స్థాయిలో కాకపోయినా పురుషుల లీగ్‌తో పోలిస్తే స్వల్ప మార్పులతోనైనా ఇది మొదలు కావాలి. ఉదాహరణకు నలుగురు విదేశీ ఆటగాళ్లకు బదులుగా ఐదు లేదా ఆరుగురు ఆడవచ్చనే నిబంధన పెట్టవచ్చు’ అని మిథాలీ వ్యాఖ్యానించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ...‘కనీసం ఏడు జట్ల మహిళల ఐపీఎల్ నిర్వహించాలంటే వాస్తవికంగా ఆలోచించాలి. మన దగ్గర అంత మంది నాణ్యమైన క్రికెటర్లు అందుబాటులో లేరు. అందుకు కనీసం నాలుగేళ్లు పడుతుంది’ అని వ్యాఖ్యానించాడు.
అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచిన నేపథ్యంలో మహిళల ఐపీఎల్‌పై డిమాండ్ పెరిగింది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా దీనికి మద్దతునిచ్చారు. మహిళల ఐపీఎల్ వస్తే అప్పుడు ఆటగాళ్ల సంఖ్య ఎలాగూ పెరుగుతుందని, ఇప్పుడు ఉన్న ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు మహిళల టీమ్‌లను నిర్వహించగలవని మిథాలీ చెప్పింది. ‘దేశవాళీలో ఎక్కువ మంది ప్రతిభావంతులైన అమ్మాయిలు లేరనే విషయాన్ని నేనూ అంగీకరిస్తా. అయితే ఇప్పుడున్న ఫ్రాంచైజీలే మహిళా జట్లను తీసుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బోర్డు ఎప్పటికీ వేచి చూస్తామంటే ఎలా. ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా. ఒక్కో ఏడాది మెల్లగా స్థాయి పెంచుకుంటూ పోవచ్చు. అప్పుడు నలుగురు విదేశీ ఆటగాళ్లకే పరిమితం చేయవచ్చు’ అని మిథాలీ అభిప్రాయ పడింది.
Comments
Please login to add a commentAdd a comment