తెర పడినట్లేనా! | IPL 2020 postponed indefinitely due to COVID-19 | Sakshi
Sakshi News home page

తెర పడినట్లేనా!

Published Thu, Apr 16 2020 12:17 AM | Last Updated on Thu, Apr 16 2020 4:46 AM

IPL 2020 postponed indefinitely due to COVID-19 - Sakshi

ఐపీఎల్‌ ట్రోఫీ

ప్రపంచంలో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగినా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై నిర్ణయం ప్రకటించే విషయంలో సాగతీత వైఖరిని అవలంబించిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు వాస్తవంలోకి వచ్చింది. దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది ‘వేసవి వినోదానికి’ చెల్లుచీటీ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కరోనా కారణంగా 2020 ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించిన బోర్డు... ఈ ఏడాది ముగిసేలోగా టోర్నీని నిర్వహించే విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. రాబోయే రోజుల్లో అంతా చక్కబడినా కూడా... బిజీ షెడ్యూల్‌లో లీగ్‌కు చోటు కల్పించడం కష్టంగా మారుతుండటమే కారణం.  

ముంబై: కోవిడ్‌–19 నేపథ్యంలో ఒలింపిక్స్‌ నుంచి టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వరకు ఎన్నో ప్రతిష్టాత్మక ఈవెంట్స్‌ రద్దు కావడమో, వాయిదా పడటమో జరిగాయి. కానీ బీసీసీఐ మాత్రం ఐపీఎల్‌ విషయంలో చాలా వరకు ఆశతోనే ఉంది. షెడ్యూల్‌ ప్రకారం టోర్నీ మార్చి 29 నుంచి జరగాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్‌ ప్రకటించకముందే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగిపోవడంతో ఏప్రిల్‌ 15 తర్వాత అంతా కుదురుకోవచ్చని, ఆ తర్వాత లీగ్‌ నిర్వహించుకోవచ్చని ఆశించింది. అయితే ఆపై దేశం మొత్తం స్తంభించిపోయింది.

టోర్నీని నెల రోజులకు కుదించి జూన్‌ మొదటి వారంలో ఫైనల్‌ జరిగేలా చూడవచ్చని కూడా కొందరు పెద్దలు వ్యాఖ్యానించారు. ఒకదశలో ప్రేక్షకులు లేకుండా ఒకటి, రెండు నగరాలకే పరిమితం చేసి టీవీ రేటింగ్స్‌ కోసమైనా ఆడించవచ్చని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇప్పుడు కథంతా మారిపోయింది. మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించగా... ఆ తర్వాత వెంటనే ఏం జరుగుతుందో తెలీని అనిశ్చిత స్థితిలో ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించాల్సి వచ్చింది. బుధవారం ఉదయం అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలకు ఐపీఎల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ హేమంగ్‌ అమీన్‌ సమాచారం అందించారు.  

ఇతర బోర్డులు అంగీకరిస్తాయా?
ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌ను సరైన సన్నాహకంగా చాలామంది భావించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇక ఈ సంవత్సరం లీగ్‌ నిర్వహించడం చాలా కష్టంగానే అనిపిస్తోంది. ఐపీఎల్‌ వాయిదా గురించి వెల్లడిస్తూ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘పరిస్థితి మెరుగైతే సెప్టెంబర్‌–అక్టోబర్‌ మధ్య లీగ్‌ నిర్వహించేందుకు ఆలోచిస్తున్నాం’ అని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్య కూడా కాస్త అతిశయంగానే కనిపిస్తోంది.

నిజానికి బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకే లీగ్‌ జరుగుతుందన్న ఆశ లేదు. ప్రపంచ క్రికెట్‌కు సంబంధించి అన్ని జట్ల భవిష్యత్‌ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ) ఎప్పుడో ఖరారైపోయింది కాబట్టి వాటిని మార్చడం కష్టమంటూ అతను ఇటీవల చేసిన వ్యాఖ్యనే వాస్తవానికి దగ్గరగా ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ ముగిసిన తర్వాత భారత జట్టు శ్రీలంక, జింబాబ్వేలతో సిరీస్‌లు, ఆసియా కప్‌లతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. తొలి రెండింటిని ఎలాగోలా సర్దుబాటు చేయగలిగినా... ఆసియా కప్‌ విషయంలో వెనక్కి తగ్గమని ఆతిథ్య పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.

ఈ టోర్నీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆసియాలోని చిన్న జట్లకు పంచాల్సి ఉంటుంది కాబట్టి అంతా బాగుంటే షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌లోనే టోర్నీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇక టెస్టు క్రికెట్‌కు అమిత ప్రాధాన్యతనిచ్చే ఇంగ్లండ్‌ బోర్డు కూడా ఇప్పటికే భారత్‌కు సిరీస్‌కు సంబంధించి వాణిజ్యపరమైన ఒప్పందాలు పూర్తి చేసుకొని ఉంటుంది కాబట్టి అదీ అంగీకరించకపోవచ్చు. లీగ్‌ కోసం ప్రపంచకప్‌ను వాయిదా వేయించడం భారత్‌ చేతుల్లో లేని పని. కాబట్టి ఎలా చూసినా ఐపీఎల్‌ కథ ఈ ఏడాదికి ముగిసినట్లే అనిపిస్తోంది. బుధవారం ఒక బోర్డు ఉన్నతాధికారి చెప్పినదాని ప్రకారం... ఇప్పుడు లీగ్‌ గురించి అసలు మాట్లాడటమే అనవసరం. ప్రపంచంలో పరిస్థితి అంతా మెరుగుపడ్డాకే అసలు ఏం చేయాలో ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు.  

‘స్టార్‌’ ఏం చేస్తుందో...
ఒకవేళ ఐపీఎల్‌ జరగకపోతే ఆటగాళ్లతో సహా అనేక మంది నష్టపోతారు. వేలంలో రూ. 15 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయిన ప్యాట్‌ కమిన్స్‌ వేదన చెప్పలేనిది. లీగ్‌ నిబంధనల ప్రకారం టోర్నమెంట్‌ ప్రారంభమయితే తప్ప ఆటగాళ్లకు ఫ్రాంచైజీ డబ్బులు చెల్లించదు. మూడు వాయిదాల్లో వారు సొమ్ము చెల్లిస్తారు. కాబట్టి టోర్నీ జరగకపోతే ఒక్క రూపాయి కూడా దక్కదు. ఇక సత్తా చాటాలనుకున్న కుర్రాళ్ల సంగతి సరేసరి. ఫ్రాంచైజీలకు కూడా నష్టం తప్పదు. 2017లో స్టార్‌ స్పోర్ట్స్‌ భారీ మొత్తానికి ప్రసార హక్కులు కొనుగోలు చేసిన తర్వాత బోర్డు ఒక్కో ఫ్రాంచైజీకి కనీసం రూ.150 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పుడు ఆ డబ్బులు రానట్లే. అయితే ఓవరాల్‌గా లీగ్‌ ద్వారా రూ. 3,800 కోట్ల నష్టం జరుగుతుందని భావిస్తుండగా ఇందులో సింహభాగం ‘స్టార్‌’దే. బోర్డుతో ఒప్పందంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో బయటకు తెలీదు కానీ లీగ్‌ అసలు జరగకపోతే ముందే అంగీకరించిన ఒప్పందం ప్రకారం ‘స్టార్‌’ ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వకపోవచ్చు.

నాకు తెలిసి ప్రతీ క్రికెట్‌ బోర్డు దృష్టిలో ఐపీఎల్‌ ఒక పెద్ద టోర్నమెంట్‌. దీనిని అందరూ గుర్తించారు. సరిగ్గా ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి టోర్నీ ఉంటే మంచి ఊపు వస్తుంది. అయితే అంతా బాగుండి, ఎవరూ ప్రమాదంలో పడే అవకాశం లేదనుకుంటే లీగ్‌ను నిర్వహించుకోవచ్చు.
    –వీవీఎస్‌ లక్ష్మణ్, భారత మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement