Women laborers
-
తీరిన కోరిక: ప్రతి పైసా కూడగట్టి విమానం ఎక్కారు
అమ్మ విమానం ఎక్కి ఉండదు ఒక్కసారైనా. మనకు తీసుకెళ్లే వీలు ఉన్నా ఇంట్లోని ఆడవాళ్లను విమానం ఎక్కించడానికి ఖర్చు కారణం చూపుతాము. కేరళలో కూలి పని చేసే 24 మంది స్త్రీలు తాము జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని నిశ్చయించుకున్నారు. పైసా పైసా కూడగట్టారు. టికెట్లు బుక్ చేశారు. చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ కొచ్చి నుంచి బెంగళూరుకు ఆకాశంలో ఎగిరారు. ఎంత మంది స్త్రీలకో ఇలాంటి కోరిక ఉండొచ్చు. ప్రయత్నిస్తే సాధ్యమని వీరు అంటున్నారు. ‘మాకు రెండు కోరికలు. ఒకటి విమానం ఎక్కాలి. రెండు ఏసీ ట్రైన్లో ప్రయాణించాలి. ఆ రెండు కోరికలూ ఇప్పుడు తీర్చుకుంటున్నాం’ అంది 55 ఏళ్ల గీతా ఉన్నికృష్ణన్. మొన్నటి జనవరి 26న కొచ్చి నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించిన బృందంలో ఈమె కాకుండా ఇంకో 23 మంది మహిళలు ఉన్నారు. వీరంతా కేరళలోని కొట్టాయం జిల్లాలో పనాచ్చికాడ్ అనే చిన్న పంచాయతీకి చెందినవారు. అందరూ గ్రామీణ ఉపాధిలో భాగంగా పంచాయితీ కింద పని చేసేవారే. రోజు కూలీలు అనుకోవచ్చు. చెత్త ఎత్తేవారు, రోడ్లు ఊడ్చేవారు, పంచాయితీ చేసే నిర్మాణాల్లో రాళ్లు ఎత్తేవారు ఈ మహిళలు. ‘అయితే ఏమిటి? మేము విమానం ఎక్కకూడదా?’ అనుకున్నారు. కాని వీరు యువతులో, చిన్నపిల్లలో కాదు. ఈ బృందంలో తక్కువ వయసు 55 అయితే అందరికంటే ఎక్కువ వయసు 77. ‘మా రోజు కూలీ రోజుకు 311 రూపాయలు. అయితే అందులో నుంచే పైసా పైసా దాచిపెట్టి టికెట్ డబ్బు చేయాలనుకున్నాం. ఒక మొత్తం అయ్యాక మా పంచాయతీ మెంబర్ అబ్రహంను కలిశాం. ఆయన మాకు అండగా నిలిచి టికెట్లు బుక్ చేయడమే కాకుండా మా ప్రయాణంలో భాగమయ్యాడు’ అన్నారు వాళ్లు. కొచ్చి నుంచి తెల్లవారుజాము విమానం ఎక్కేటప్పుడు వీరి సంబరం అంతా ఇంతా కాదు. బెంగళూరులో దిగాక ఒక ఎం.ఎల్.ఏ సాయంతో వీరు విధాన సభ చూసే అవకాశం పొందారు. ‘మేము మెట్రో రైలు కూడా ఎక్కాం తెలుసా?’ అన్నారు వాళ్లు. 77 ఏళ్ల చెల్లమ్మ అయితే ఎంతో మురిసిపోయింది. ‘ఇలా జరుగుతుందని నిజంగా అనుకోలేదు’ అందామె. వీరంతా బెంగళూరు నుంచి కొచ్చికి తాము కోరుకున్నట్టు ఏసి ట్రైన్లో తిరుగు ప్రయాణం చేయనున్నారు. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ముచ్చట్లు తీర్చుకునే హక్కు ఉంది. స్త్రీలు తమ ముచ్చట్లను అనేక కారణాల రీత్యా బయటకు చెప్పరు. కుటుంబంలోని మగవారు అడిగి వాటిని తీర్చరు. కాని ఆ ముచ్చట తీరితే వారికి కలిగే ఆనందం ఎంతటితో ఈ బృందాన్ని చూస్తే తెలుస్తుంది. అమ్మనో, అత్తగారినో, అంతగా జరుగుబాటులేని మేనత్తనో, పిన్నినో విమానం ఎక్కించి సంతోషపడాలని ఎవరికైనా అనిపిస్తే సంతోషం. ఎవరికీ అనిపించకపోయినా ఈ కథనం చదివి అలా స్ఫూర్తి పొందితే మరీ సంతోషం. -
Singer Parvathy: నా అదృష్టం.. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి: పార్వతి
వసంతకాలం అనగానే విరబూసిన పూలు, లేలేత మావి చిగుళ్లు కోయిలమ్మల రాగాలు మదిలో మెదులుతాయి. అలాగే, ఈ సీజన్లో తమ గానామృతంతో మనల్ని అలరిస్తూ సందడి చేస్తున్నారు దాసరి పార్వతి, దివ్యజ్యోతి, దుర్గవ్వలు. టాలెంట్ ఉంటే ఏ మూలన ఉన్నా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. పని కష్టం మర్చిపోవడానికి నోటినుండి వెలువడే పదాలే పాటలుగా ఆకట్టుకుంటాయి. అవే జానపదాలై గ్రామీణుల గొంతుల్లో విరాజిల్లుతాయి. అలా మట్టిపరిమళం నుంచి వచ్చిన గొంతుక దుర్గవ్వది. తను పాట పాడితే వెన్నెల చల్లదనమంతా కురుస్తుందా అనిపించే గొంతుక పార్వతిది. అలసిన వేళ పాటే తోడు అంటూ విరిసిన గొంతుక జ్యోతి ది. తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈ కోయిలమ్మలు తమ కమ్మటి రాగాల వెనక దాగి ఉన్న కష్టాన్ని, తమ పాట తమను నిలబెట్టిన తీరును సాక్షితో పంచుకున్నారు. ఊరంతా వెన్నెల... పార్వతి ఓ టీవీ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి...’ పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగునాట నెట్టింట పార్వతి పాడిన పాటను సెర్చ్ చేయని వాళ్లు లేరు అనేంతగా గుర్తింపు పొందింది. పార్వతి స్వస్థలం కర్నూల్ జిల్లా, లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. ‘చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేదాన్ని. ఊళ్లో అందరూ గొంతు కోయిలలా ఉందని మెచ్చుకుంటుండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్లేదాన్ని. పొలం పనులకు వచ్చేవాళ్లు కూడా నా చేత పాటలు పాడించుకునేవారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా అన్నయ్యల స్నేహితులు మ్యూజిక్ కాలేజీలో చేరమన్నారు. అలా ఇప్పుడు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో ఎం.ఎ చేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్ వాళ్లు పెట్టిన ఆడిషన్స్‌లో సెలక్ట్ అయ్యాను. ఆ సందర్భంగా పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి. ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకుంది పార్వతి. మట్టిగొంతుక... దుర్గవ్వ పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ. కూలిపనులు చేసుకుని, జీవనం సాగించే దుర్గవ్వకు ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆమె పాడిన ‘అడవి తల్లి..’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన ఈ సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొడుకు, కూతురు ఉన్న దుర్గవ్వ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కాయకష్టంలో వచ్చే పల్లె పదాలు ఎన్నో. ‘‘చిన్నతనం నుంచి పాటెన్నడూ నన్ను వీడలేదు. ఓ రోజు నా బిడ్డ నా చేత నాలుగు పాటలు పాడించి చానళ్లలో పెట్టింది. ముందు వద్దన్న. కానీ, పిల్లలు వినలేదు. ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మా దగ్గర కొంతమంది జానపద కళాకారులు నా చేత ఇంకొన్ని పాటలు పాడించారు. అక్కడి నుంచి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎక్కడో కూలి చేసుకుని బతికే నేను ఇలా అందరి ముందు పాటలు పాడటం, పేరు రావడం ఆనందంగా ఉంది’ అని వివరిస్తుంది దుర్గవ్వ. ప్రైవేట్ ఆల్బమ్‌లలో దుర్గవ్వ పాడిన పాటల్లో ‘సిరిసిల్ల చిన్నది..’, ‘నాయితల్లే.., ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఊరటనిచ్చిన పాట.. అనుకోకుండా ఎగిసిన గొంతుకలా నెట్టింట వైరల్ అయ్యింది దివ్యజ్యోతి. కరీంనగర్ జిల్లా నర్సింగపురం నుంచి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ చేరిన కుటుంబం జ్యోతిది. భర్త కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. జ్యోతి ప్రైవేట్ కంపెనీలలో హౌస్ కీపర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి భర్త కాలు తీసేయడంతో కుటుబానికి జ్యోతి సంపాదనే ఆదరవు అవుతోంది. ‘‘కష్టంలో నాతో పాటు ఎప్పుడూ తోడుండేది పాటనే. ఆనందమేసినా నోటికొచ్చిన పాటలు పాడుకునేదాన్ని. చాలాసార్లు మాటలే పాటలవుతుంటాయి. నేను పనిచేసే చోట నాగవల్లి మేడం నాచేత పాట పాడించింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టడంతో నా గొంతుకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లలో పాటలు పాడుతున్నాను. ఉదయం పూట డ్యూటీ చేస్తున్నాను. రాత్రిపూట పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నీ గొంతు చాలా బాగుంది. సినిమాల్లోనూ నీ చేత పాటలు పాడిస్తామని పెద్దోళ్లు చెబుతున్నరు’’ అని ఆనందంగా వివరిస్తుంది జ్యోతి. మనసు పెట్టి వినాలే కానీ, మన ఇరుగు పొరుగు, మనతోపాటు పని చేసేవారి గొంతుకలలో గమకాలు పలుకుతుంటాయి. గుర్తించి ఆస్వాదించాలి. పదిమందికీ వినిపించాలి. అప్పుడే పాటకు పట్టాభిషేకం జరుగుతుంది. – నిర్మలారెడ్డి -
కర్నూలు జిల్లాలో మహిళా కూలీకి వజ్రం లభ్యం
తుగ్గలి: పొలం పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీకి వజ్రం లభ్యమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం పొలంలో కూలి పనులకు వెళ్లింది. అక్కడ పనులు చేస్తుండగా వజ్రం లభ్యమైనట్లు సమాచారం. నాలుగున్నర క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6.50 లక్షలు, 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు లభ్యమవడం సహజం. (చదవండి: 41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు) -
‘కూలి’న బతుకులు
ధన్వాడ / కోస్గి, న్యూస్‌లైన్ : వారంతా పేదలు.. రెక్కాడితేగాని డొక్కాడని ప రిస్థితి... వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ పొట్టపోసుకుంటున్నారు.. వా రిని విధి వెక్కిరించడంతో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మొత్తం 38 మం ది ఓ డీసీఎంలో బయలుదేరగా మార్గమధ్యంలోనే బోల్తా పడటంతో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం పాల య్యారు. ఈ సంఘటనలో మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... బుధవారం ఉదయం కోస్గి మండలం గుండుమాల్‌కు చెం దిన లక్ష్మి, అదే గ్రామానికి చెందిన 38 మంది కూలీలను ధన్వాడ మండలం మణిపూర్ తండాలోని రైతు దీప్లానాయక్ తోట నుంచి బత్తాయిపండ్లు తీ సుకెళ్లడానికి ఓ డీసీఎంలో తరలిం చింది. వాటిని వాహనంలో లోడ్ చేశాక సాయంత్రం అందరూ తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యం లోని రాంకిష్టాయపల్లి సమీపంలోకి చే రుకోగానే అదుపుతప్పి బోల్తా పడటం తో గుడిసె రాములమ్మ (49), పుల మొళ్ల వెంకటమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కూలీలు రాధ మ్మ, సాయమ్మ, మాణిక్యమ్మ, అంజిలయ్య, మరో వెంకటమ్మ, అంజిలమ్మ, ఆశమ్మ, మొగులమ్మ, రాజమ్మ, లక్ష్మి, సురేష్, సుజాత, శాంత, రాములమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే మరికల్ పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ లక్ష్మీనారాయణ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగ్రాతులను హుటాహుటిన ధన్వాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిలో ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను ఆర్డీఓ షేక్‌యాస్మిన్‌బాషా, స్థానిక తహశీల్దార్ మురళీకృష్ణ పరామర్శించారు. ఈ సంఘటనలో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.