బెంగళూరు విధాన సౌధ ముందు కేరళ ఉపాధి కూలీల బృందం
అమ్మ విమానం ఎక్కి ఉండదు ఒక్కసారైనా. మనకు తీసుకెళ్లే వీలు ఉన్నా ఇంట్లోని ఆడవాళ్లను విమానం ఎక్కించడానికి ఖర్చు కారణం చూపుతాము. కేరళలో కూలి పని చేసే 24 మంది స్త్రీలు తాము జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని నిశ్చయించుకున్నారు. పైసా పైసా కూడగట్టారు. టికెట్లు బుక్ చేశారు. చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ కొచ్చి నుంచి బెంగళూరుకు ఆకాశంలో ఎగిరారు. ఎంత మంది స్త్రీలకో ఇలాంటి కోరిక ఉండొచ్చు. ప్రయత్నిస్తే సాధ్యమని వీరు అంటున్నారు.
‘మాకు రెండు కోరికలు. ఒకటి విమానం ఎక్కాలి. రెండు ఏసీ ట్రైన్‌లో ప్రయాణించాలి. ఆ రెండు కోరికలూ ఇప్పుడు తీర్చుకుంటున్నాం’ అంది 55 ఏళ్ల గీతా ఉన్నికృష్ణన్. మొన్నటి జనవరి 26న కొచ్చి నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించిన బృందంలో ఈమె కాకుండా ఇంకో 23 మంది మహిళలు ఉన్నారు. వీరంతా కేరళలోని కొట్టాయం జిల్లాలో పనాచ్చికాడ్ అనే చిన్న పంచాయతీకి చెందినవారు. అందరూ గ్రామీణ ఉపాధిలో భాగంగా పంచాయితీ కింద పని చేసేవారే. రోజు కూలీలు అనుకోవచ్చు. చెత్త ఎత్తేవారు, రోడ్లు ఊడ్చేవారు, పంచాయితీ చేసే నిర్మాణాల్లో రాళ్లు ఎత్తేవారు ఈ మహిళలు.
‘అయితే ఏమిటి? మేము విమానం ఎక్కకూడదా?’ అనుకున్నారు. కాని వీరు యువతులో, చిన్నపిల్లలో కాదు. ఈ బృందంలో తక్కువ వయసు 55 అయితే అందరికంటే ఎక్కువ వయసు 77. ‘మా రోజు కూలీ రోజుకు 311 రూపాయలు. అయితే అందులో నుంచే పైసా పైసా దాచిపెట్టి టికెట్ డబ్బు చేయాలనుకున్నాం. ఒక మొత్తం అయ్యాక మా పంచాయతీ మెంబర్ అబ్రహంను కలిశాం. ఆయన మాకు అండగా నిలిచి టికెట్లు బుక్ చేయడమే కాకుండా మా ప్రయాణంలో భాగమయ్యాడు’ అన్నారు వాళ్లు.
కొచ్చి నుంచి తెల్లవారుజాము విమానం ఎక్కేటప్పుడు వీరి సంబరం అంతా ఇంతా కాదు. బెంగళూరులో దిగాక ఒక ఎం.ఎల్.ఏ సాయంతో వీరు విధాన సభ చూసే అవకాశం పొందారు. ‘మేము మెట్రో రైలు కూడా ఎక్కాం తెలుసా?’ అన్నారు వాళ్లు. 77 ఏళ్ల చెల్లమ్మ అయితే ఎంతో మురిసిపోయింది. ‘ఇలా జరుగుతుందని నిజంగా అనుకోలేదు’ అందామె.
వీరంతా బెంగళూరు నుంచి కొచ్చికి తాము కోరుకున్నట్టు ఏసి ట్రైన్‌లో తిరుగు ప్రయాణం చేయనున్నారు.
ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ముచ్చట్లు తీర్చుకునే హక్కు ఉంది. స్త్రీలు తమ ముచ్చట్లను అనేక కారణాల రీత్యా బయటకు చెప్పరు. కుటుంబంలోని మగవారు అడిగి వాటిని తీర్చరు. కాని ఆ ముచ్చట తీరితే వారికి కలిగే ఆనందం ఎంతటితో ఈ బృందాన్ని చూస్తే తెలుస్తుంది. అమ్మనో, అత్తగారినో, అంతగా జరుగుబాటులేని మేనత్తనో, పిన్నినో విమానం ఎక్కించి సంతోషపడాలని ఎవరికైనా అనిపిస్తే సంతోషం. ఎవరికీ అనిపించకపోయినా ఈ కథనం చదివి అలా స్ఫూర్తి పొందితే మరీ సంతోషం.
Comments
Please login to add a commentAdd a comment