daily laborers
-
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో
ములుగు రూరల్(గోవిందరావుపేట)/ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్ వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనపై వివరాలివి. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 18 మంది రోజువారీ పనులకు ఆటోలో నార్లాపూర్ బయలుదేరారు. ఆటోలో పరిమితికి మించి కూలీలను ఎక్కించుకోవడం.. డ్రైవర్ నిర్లక్ష్యం.. అతి వేగంతో నడపడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆటో బోల్తాపడింది. దీంతో మల్లబోయిన సునీత (30) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీసీఎస్ సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షల అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న రుద్రారపు స్వర్ణలత, తొడుసు యాకమ్మ, మల్లబోయిన స్వాతి, బానోతు జ్యోతి, కామసాని బుగ్గమ్మ, రసపుత్ మల్లమ్మ, రసపుత్ విజయ, కుంట బుచ్చక్కలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బానోతు జ్యోతి (45)ని ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగితా వారికి స్వల్ప గాయాలు కావడంలో ములుగు ఆస్పత్రిలో చికిత్స అందించారు. క్షతగాత్రులను ములుగు ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. -
తీరిన కోరిక: ప్రతి పైసా కూడగట్టి విమానం ఎక్కారు
అమ్మ విమానం ఎక్కి ఉండదు ఒక్కసారైనా. మనకు తీసుకెళ్లే వీలు ఉన్నా ఇంట్లోని ఆడవాళ్లను విమానం ఎక్కించడానికి ఖర్చు కారణం చూపుతాము. కేరళలో కూలి పని చేసే 24 మంది స్త్రీలు తాము జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని నిశ్చయించుకున్నారు. పైసా పైసా కూడగట్టారు. టికెట్లు బుక్ చేశారు. చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ కొచ్చి నుంచి బెంగళూరుకు ఆకాశంలో ఎగిరారు. ఎంత మంది స్త్రీలకో ఇలాంటి కోరిక ఉండొచ్చు. ప్రయత్నిస్తే సాధ్యమని వీరు అంటున్నారు. ‘మాకు రెండు కోరికలు. ఒకటి విమానం ఎక్కాలి. రెండు ఏసీ ట్రైన్లో ప్రయాణించాలి. ఆ రెండు కోరికలూ ఇప్పుడు తీర్చుకుంటున్నాం’ అంది 55 ఏళ్ల గీతా ఉన్నికృష్ణన్. మొన్నటి జనవరి 26న కొచ్చి నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించిన బృందంలో ఈమె కాకుండా ఇంకో 23 మంది మహిళలు ఉన్నారు. వీరంతా కేరళలోని కొట్టాయం జిల్లాలో పనాచ్చికాడ్ అనే చిన్న పంచాయతీకి చెందినవారు. అందరూ గ్రామీణ ఉపాధిలో భాగంగా పంచాయితీ కింద పని చేసేవారే. రోజు కూలీలు అనుకోవచ్చు. చెత్త ఎత్తేవారు, రోడ్లు ఊడ్చేవారు, పంచాయితీ చేసే నిర్మాణాల్లో రాళ్లు ఎత్తేవారు ఈ మహిళలు. ‘అయితే ఏమిటి? మేము విమానం ఎక్కకూడదా?’ అనుకున్నారు. కాని వీరు యువతులో, చిన్నపిల్లలో కాదు. ఈ బృందంలో తక్కువ వయసు 55 అయితే అందరికంటే ఎక్కువ వయసు 77. ‘మా రోజు కూలీ రోజుకు 311 రూపాయలు. అయితే అందులో నుంచే పైసా పైసా దాచిపెట్టి టికెట్ డబ్బు చేయాలనుకున్నాం. ఒక మొత్తం అయ్యాక మా పంచాయతీ మెంబర్ అబ్రహంను కలిశాం. ఆయన మాకు అండగా నిలిచి టికెట్లు బుక్ చేయడమే కాకుండా మా ప్రయాణంలో భాగమయ్యాడు’ అన్నారు వాళ్లు. కొచ్చి నుంచి తెల్లవారుజాము విమానం ఎక్కేటప్పుడు వీరి సంబరం అంతా ఇంతా కాదు. బెంగళూరులో దిగాక ఒక ఎం.ఎల్.ఏ సాయంతో వీరు విధాన సభ చూసే అవకాశం పొందారు. ‘మేము మెట్రో రైలు కూడా ఎక్కాం తెలుసా?’ అన్నారు వాళ్లు. 77 ఏళ్ల చెల్లమ్మ అయితే ఎంతో మురిసిపోయింది. ‘ఇలా జరుగుతుందని నిజంగా అనుకోలేదు’ అందామె. వీరంతా బెంగళూరు నుంచి కొచ్చికి తాము కోరుకున్నట్టు ఏసి ట్రైన్లో తిరుగు ప్రయాణం చేయనున్నారు. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ముచ్చట్లు తీర్చుకునే హక్కు ఉంది. స్త్రీలు తమ ముచ్చట్లను అనేక కారణాల రీత్యా బయటకు చెప్పరు. కుటుంబంలోని మగవారు అడిగి వాటిని తీర్చరు. కాని ఆ ముచ్చట తీరితే వారికి కలిగే ఆనందం ఎంతటితో ఈ బృందాన్ని చూస్తే తెలుస్తుంది. అమ్మనో, అత్తగారినో, అంతగా జరుగుబాటులేని మేనత్తనో, పిన్నినో విమానం ఎక్కించి సంతోషపడాలని ఎవరికైనా అనిపిస్తే సంతోషం. ఎవరికీ అనిపించకపోయినా ఈ కథనం చదివి అలా స్ఫూర్తి పొందితే మరీ సంతోషం. -
దినసరి కూలీలుగా ఉపాధ్యాయులు..
రాజాం సిటీ: నిన్నమొన్నటి వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పిన గురువులు నేడు పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్నారు. ప్రైవేటు పాఠశాలలను నమ్ముకొని జీవనం సాగించిన వారంతా కరోనా ప్రభావంతో వచ్చిన లాక్‌డౌన్‌తో తమ వృత్తిని వదిలి జీవనోపాధికోసం దొరికిన పనులువైపు మళ్లి జీవనోపాధి వెతుక్కుంటున్నారు. అలవాటులేని పనులు చేస్తూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 536 ప్రైవేటు పాఠశాలలు, 165 జూనియర్ కళాశాలలు, 99 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 13వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల పూర్తిస్థాయిలో సిబ్బందికి జీతాలు చెల్లిస్తుండగా కొన్ని పాఠశాలు, కళాశాలల్లో సిబ్బందికి యాజమాన్యాలు సగం జీతాలు ఇస్తూ నెట్టుకొస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు జీతాలే ఇస్తున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో చాలామంది వేర్వేరు పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తప్పదుమరి.. ఎంఏ బీఈడీ చదివిన నేను పదిహేనేళ్లుగా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. వచ్చిన కాస్తో కూస్తో జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 23 నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో చేసేదేమీలేక గ్రామంలో ప్రభుత్వం కలి్పస్తున్న ఉపాధి పనులకు వెళ్తున్నాను. అలవాటులేని పనికావడంతో కాస్త కష్టంగా అనిపిస్తుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిందే. – వల్లె తవుడు, గురవాం, రాజాం మండలం మిల్లర్‌గా పనిచేస్తున్నాను.. విజయనగరం జిల్లా నుంచి బతుకు తెరువుకు రాజాం ప్రాంతానికి వచ్చాను. ఎంఏ బీఈడీ పూర్తిచేసి ప్రభుత్వ కొలువుకు ప్రయత్నించినా రాకపోవడంతో ప్రైవేటు ఉద్యోగంలో పదేళ్లుగా స్థిరపడ్డాను. కరోనా నేపథ్యంలో పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటున్నాను. జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడంలేదు. కుటుంబ పోషణ కోసం కాంక్రీట్ పనుల్లో మిల్లర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. ఈ పనులు కూడా రోజూ ఉండకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. – ఆర్.పరశునాయుడు, గోపన్నవలస, మెరకుముడిదాం మండలం విజయనగరం జిల్లా జీతాలు ఇవ్వలేదు.. నేను ఎమ్మెస్సీ బీఈడీ చదివి ప్రైవేటు పాఠశాలలో పదేళ్లుగా పనిచేస్తున్నాను. లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూసివేసినప్పటి నుంచి ఇంత వరకు జీతాలు అందించలేదు. లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత ఇళ్ల పనులు జరుగుతుండడంతో షీట్ సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాను, ఆ డబ్బులతో కుటుంబ పోషణ సాగిస్తున్నాను. – టి.నాగరాజు, గడిముడిదాం, రాజాం మండలం ఉపాధి పనుల్లో ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు -
‘టాప్ స్టార్లు వారిని ఆదుకోవాలి’
ముంబై : కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై పెనుప్రభావం చూపుతోంది. సినిమా షూటింగ్‌లు, రిలీజ్లు నిలిచిపోవడంతో పాటు థియేటర్లు మూతపడటం బాలీవుడ్‌కు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇటీవల విడుదలైన భాగీ 3, అంగ్రేజి మీడియం వంటి సినిమాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈనెల 31న థియేటర్లను తిరిగి తెరిచిన తర్వాత ఆయా సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలతో వినోద పరిశ్రమ ఈ నిర్ణయాలు తీసుకున్నా దినసరి కార్మికుల పరిస్థితిపై మాత్రం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనే కడుపు నింపుకునే సినీ కార్మికులకు ఇప్పుడు పూట గడవని పరిస్థితి. కరోనా దెబ్బకు స్పాట్ బాయ్‌లు, కార్పెంటర్లు, లైట్మెన్లు, స్టంట్మెన్లు, పెయింటర్లు వంటి దినసరి కార్మికులు విలవిలలాడుతున్నారు. సినీ పరిశ్రమలో దినసరి వేతనంతో పనిచేసే కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ నిధిని భారత నిర్మాతల మండలి ఏర్పాటు చేసినా కార్మికులకు తిరిగి పని దొరికేవరకూ వారికి కొంత డబ్బును అందించేందుకు దర్శక నిర్మాతలు ముందుకు రావాలని సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ కోరారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పడుకోన్, వరుణ్ ధావన్, విక్కీకౌశల్ వంటి అగ్ర తారలు సినీ పరిశ్రమలో పనిచేసే దినసరి కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సినీ విమర్శకులు కోమల్ నహతా పిలుపు ఇచ్చారు. కరోనా ప్రభావంతో బాలీవుడ్ రూ 800 కోట్ల వరకూ నష్టపోతుందని నహతా అంచనా వేశారు. మరోవైపు టాప్ స్టార్లు రూ కోటి నుంచి రూ 1.5 కోట్ల వరకూ విరాళాలుగా ఇస్తే సినీ కార్మికులకు ఊరటగా ఉంటుందని అన్నారు. కేవలం డబ్బు సాయమే కాకుండా నిత్యావసర సరుకులు కూడా వారికి పంపిణీ చేయాలని సినీ నిపుణులు అతుల్ మోహన్ ఆకాంక్షించారు. చదవండి : కరోనా దెబ్బ: సినిమా షూటింగ్‌లు బంద్ -
బాబు పాలనలో 'కూలి'న బతుకులు
సాక్షి, అమరావతి: రెక్కాడితే గాని డొక్కాడని వారి బతుకులు చంద్రబాబు హయాంలో ‘కూలి’పోయాయి. ఆయన జమానాలో జరిగిన ఆత్మహత్యల్లో అత్యధికులు రోజువారీ కూలీలేనని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో వెల్లడైంది. 2016లో జరిగిన ప్రమాద మరణాలు–ఆత్మహత్యలకు సంబంధించి ఎన్సీఆర్బీ విడుదల చేసిన నివేదిక అనేక చేదు సత్యాల్ని బయటపెట్టింది. 2016లో రాష్ట్రంలో 6,059 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో రోజువారీ కూలీలు 1,333 మంది ఉన్నారు. ఇక నేల తల్లిని నమ్ముకున్న రైతులు, రైతు కూలీలు అప్పుల పాలవడంతో బతికే దారి లేక, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో 804 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగం ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. సాగు పెట్టుబడులు పెరగడం, పంట నష్టాలు, గిట్టుబాటు ధర దక్కకపోవడం, అప్పుల బాధలు, పనులు లేకపోవడం వంటి కారణాలతో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి మరణాల్లో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆరో స్థానంలో ఉండగా మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అన్ని రంగాల్లో ఆత్మహత్యలను పరిశీలిస్తే దేశంలో ఏపీ తొమ్మిదో స్థానంలో ఉంది. 2016 గణాంకాల ప్రకారం.. - 2016లో దేశవ్యాప్తంగా మొత్తం 1,31,008 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 6,059 మంది(4.6 శాతం) ఏపీకి చెందినవారు. - దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన 11,379 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో ఏపీకి చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు 804 మంది ఉన్నారు. వారిలో పురుషులు 730 మంది కాగా, మహిళలు 74 మంది ఉన్నారు. - ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు 239 మంది కాగా వారిలో భూమి కలిగిన వారు 115 మంది, కౌలుకు చేస్తున్నవారు 124 మంది. వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలు 565 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంలోని ఆత్మహత్యల్లో ఏకంగా 70 శాతానికి పైగా కూలీలే కావడం గమనార్హం. ప్రమాద మరణాలు 2016లో రాష్ట్రంలో 25,050 ప్రమాదాలు నమోదయ్యాయి. 30,052 మంది క్షతగాత్రులు కాగా 9,937 మంది మృతి చెందారు. వీటిలో రోడ్డు ప్రమాదాలు 23,658 కాగా.. రైలు నుంచి జారిపడటం, ప్రమాదవశాత్తు రైలు కింద పడటం వంటివి 1203, రైల్వే లైన్ క్రాస్ చేస్తుండగా 189 ఘటనలు జరిగాయి. -
నగరంలో అల్ప, మధ్యాదాయ వర్గాలే అధికం...
రూ.5 వేల లోపు... 34.3% రూ.5-10 వేలు 37.1% రూ.10-15 వేలు 12.5% రూ.15-20 వేలు 7.3% రూ.20-40 వేలు 7% రూ.40-60 వేలు 1.2% రూ.60వేలు - లక్ష 0.4% రూ. లక్షకుపైగా 0.1% మహానగరం పరిధిలో అల్పాదాయ, మధ్యాదాయం పొందేవారే అత్యధికంగా ఉన్నారు. నెలకు రూ.5 వేల లోపు సంపాదించే వారు 34.3 శాతం మంది ఉన్నారు. ఇక 5 నుంచి 10 వేల లోపు ఆదాయం పొందేవారు 37.1 శాతం, 15-20 వేల లోపు ఆర్జించేవారు 7.3 శాతం మంది ఉన్నారు. నెలకు లక్షకు పైగా సంపాదించేవారు కేవలం 0.1 శాతం మాత్రమే. అంటే నగరంలో అల్పాదాయ, మధ్యాదాయ వేతన జీవులు, దినసరి కూలీలు, శ్రామికులే అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు సగటున నెలకు సుమారు రూ.20,200 ఆర్జిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న వారి కుటుంబ ఆదాయం నెలకు సగటున రూ.13,600 ఉన్నట్లు లెక్కగట్టారు. మురికివాడల్లో నివసించేవారి కుటుంబ ఆదాయం నెలకు రూ.9800 మాత్రమే.