ములుగు రూరల్(గోవిందరావుపేట)/ఎస్‌ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్ వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనపై వివరాలివి. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 18 మంది రోజువారీ పనులకు ఆటోలో నార్లాపూర్ బయలుదేరారు.
ఆటోలో పరిమితికి మించి కూలీలను ఎక్కించుకోవడం.. డ్రైవర్ నిర్లక్ష్యం.. అతి వేగంతో నడపడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆటో బోల్తాపడింది. దీంతో మల్లబోయిన సునీత (30) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీసీఎస్ సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్‌ఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
వైద్య పరీక్షల అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న రుద్రారపు స్వర్ణలత, తొడుసు యాకమ్మ, మల్లబోయిన స్వాతి, బానోతు జ్యోతి, కామసాని బుగ్గమ్మ, రసపుత్ మల్లమ్మ, రసపుత్ విజయ, కుంట బుచ్చక్కలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బానోతు జ్యోతి (45)ని ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగితా వారికి స్వల్ప గాయాలు కావడంలో ములుగు ఆస్పత్రిలో చికిత్స అందించారు. క్షతగాత్రులను ములుగు ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment