బోల్తాపడిన కలప లారీ.
మంగపేట (ములుగు జిల్లా): నిండా కలప లోడుతో వెళ్తున్న లారీ.. అదుపు తప్పి రోడ్డు పక్కన వెళ్తున్న బాలురపై బోల్తా పడింది.. ఇద్దరు బాలురపై కలప దుంగలు పడగా.. మరో బాలుడు లారీ క్యాబిన్ కింద చిక్కు కుపోయాడు. సమీపంలోనే ఉన్నవారు పరుగెత్తు కొచ్చేటప్పటికి బాలురు బాధతో రోదిస్తున్నారు. కాసేపటికే లారీ క్యాబిన్ కింద చిక్కుకున్న బాలుడి తండ్రి అక్కడికి వచ్చాడు.
బాలుడు తండ్రిని చూసి ‘డా డీ.. నొప్పిగా ఉంది.. నన్ను బయటికి తియ్యండి డాడీ..’అంటూ ఏడ్చాడు. కొడుకును బయటికి తీయలేక.. అతడి బాధను చూడలేక తండ్రి కన్నీళ్లు పెడుతూ విలవిల్లాడిపోయాడు. అక్కడికి వచ్చిన వారంతా అది చూసి కన్నీళ్లు పెట్టారు. గురువారం సాయంత్రం ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి పీహెచ్‌సీ ఎదుట ఈ ఘటన జరిగింది.
మూల మలుపు వద్ద అదుపు తప్పి..
కలప లోడుతో మంగపేట వైపు నుంచి మణుగూరు వైపు వెళ్తున్న లారీ చుంచుపల్లి పీహెచ్‌సీ ముందు మలుపు వద్ద అదుపుతప్పింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గ్రామ బాలురు పోలెబోయిన సాయి, కల్తీ దిలీప్, చింతకుంటకు చెందిన కొమరం చందులపై బోల్తా పడింది. చందు, దిలీప్‌పై కలప దుంగలు పడగా.. సాయి లారీ క్యాబిన్ కింద ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కలప కింద ఉన్న ఇద్దరిని బయటికి తీశారు.
ఈ ఇద్దరికీ కాళ్లు విరగడం, ఇతర గాయాలూ కావడంతో 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక సాయికి కుడికాలు, కుడిచేయి ఓ కర్రకు, లారీ క్యాబిన్‌కు మధ్య ఇరుక్కుపోవడంతో అతడిని బయటికి లాగడం వీలుకాలేదు. పోలీసులు స్థానికుల సహకారంతో ప్రొక్లెయిన్, రెండు జేసీబీలను తెప్పించి బాలుడిని సుమారు గంటన్నర తర్వాత బయటికి తీశారు.
బాలుడు బాధను తట్టుకోలేక ఏడవడం, అక్కడికి చేరుకున్న తన తండ్రి ఆదినారాయణను చూసి ‘డాడీ నొప్పిగా ఉంది.. బయటికి తియ్యండి’అంటూ రోదించడం అందరినీ కలచివేసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య.. బాలుడిని వైద్యం కోసం తన వాహనంలో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment