దినసరి కూలీలుగా ఉపాధ్యాయులు.. | Private Teachers Who Become Daily Laborers | Sakshi
Sakshi News home page

కూటి కోసం..కూలి కోసం! 

Published Fri, Jul 3 2020 11:18 AM | Last Updated on Fri, Jul 3 2020 11:18 AM

Private Teachers Who Become Daily Laborers - Sakshi

సెంట్రింగ్‌ పనుల్లో నిమగ్నమైన ప్రైవేటు ఉపాధ్యాయుడు- ఉపాధి పనుల్లో తవుడు- మిల్లర్‌ వద్ద కాంక్రీట్‌ కలుపుతున్న పరశునాయుడు

రాజాం సిటీ: నిన్నమొన్నటి వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పిన గురువులు నేడు పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్నారు. ప్రైవేటు పాఠశాలలను నమ్ముకొని జీవనం సాగించిన వారంతా  కరోనా ప్రభావంతో వచ్చిన లాక్‌డౌన్‌తో తమ వృత్తిని వదిలి జీవనోపాధికోసం దొరికిన పనులువైపు మళ్లి జీవనోపాధి వెతుక్కుంటున్నారు. అలవాటులేని పనులు చేస్తూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 536 ప్రైవేటు పాఠశాలలు, 165 జూనియర్‌ కళాశాలలు, 99 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 13వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల పూర్తిస్థాయిలో సిబ్బందికి జీతాలు చెల్లిస్తుండగా కొన్ని పాఠశాలు, కళాశాలల్లో సిబ్బందికి యాజమాన్యాలు సగం జీతాలు ఇస్తూ నెట్టుకొస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు జీతాలే ఇస్తున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో చాలామంది వేర్వేరు పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 

తప్పదుమరి..
ఎంఏ బీఈడీ చదివిన నేను పదిహేనేళ్లుగా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. వచ్చిన కాస్తో కూస్తో జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 23 నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో చేసేదేమీలేక గ్రామంలో ప్రభుత్వం కలి్పస్తున్న ఉపాధి పనులకు వెళ్తున్నాను.  అలవాటులేని పనికావడంతో కాస్త కష్టంగా అనిపిస్తుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిందే.
– వల్లె తవుడు, గురవాం, రాజాం మండలం 

మిల్లర్‌గా పనిచేస్తున్నాను..  
విజయనగరం జిల్లా నుంచి బతుకు తెరువుకు రాజాం ప్రాంతానికి వచ్చాను. ఎంఏ బీఈడీ పూర్తిచేసి ప్రభుత్వ కొలువుకు ప్రయత్నించినా రాకపోవడంతో ప్రైవేటు ఉద్యోగంలో పదేళ్లుగా స్థిరపడ్డాను. కరోనా నేపథ్యంలో పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటున్నాను. జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడంలేదు. కుటుంబ పోషణ కోసం కాంక్రీట్‌ పనుల్లో మిల్లర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. ఈ పనులు కూడా రోజూ ఉండకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు.   
– ఆర్‌.పరశునాయుడు, గోపన్నవలస, మెరకుముడిదాం మండలం విజయనగరం జిల్లా 

జీతాలు ఇవ్వలేదు..
నేను ఎమ్మెస్సీ బీఈడీ చదివి ప్రైవేటు పాఠశాలలో పదేళ్లుగా పనిచేస్తున్నాను. లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూసివేసినప్పటి నుంచి ఇంత వరకు జీతాలు అందించలేదు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన తరువాత ఇళ్ల పనులు జరుగుతుండడంతో షీట్‌ సెంట్రింగ్‌ పనులకు వెళ్తున్నాను, ఆ డబ్బులతో కుటుంబ పోషణ సాగిస్తున్నాను. 
– టి.నాగరాజు, గడిముడిదాం, రాజాం మండలం

ఉపాధి పనుల్లో ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు  
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement