women leadership
-
మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు భారత్
న్యూఢిల్లీ: భారతదేశం గత 9 ఏళ్లలో మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి వైపు పయనించిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళాస్వయం సహాయక బృందా(ఎస్‌హెచ్‌జీ)లను యూనికార్న్‌ల స్థాయికి తీసుకెళతామని చెప్పారు. మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. ‘ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మేథ్స్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 43%కి చేరుకుంది. స్వయం సహాయ సంఘాలను కూడా ఈ ఏడాది యూనికార్న్‌లుగా మార్చాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం ఎస్‌హెచ్‌జీలకు మద్దతుగా నిలుస్తాం. గత 9 ఏళ్లలో ఎస్‌హెచ్‌జీల్లో 7 కోట్ల మంది మహిళలు చేరారు. ఎస్‌హెచ్‌జీల ద్వారా అందించిన రుణాలు రూ.6.25 లక్షల కోట్లకు చేరాయి. వ్యవసాయేతర ప్రతి ఐదు వ్యాపారాల్లో ఒకటి మహిళే నడుపుతున్నారు’అని ఆయన చెప్పారు. స్టాక్ మార్కెట్లో నమోదు కాకుండానే 1 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగిన కంపెనీలనే యూనికార్న్‌లంటారు. ‘ముద్రా రుణ గ్రహీతల్లో 70% మంది మహిళలే. వీరు తమ కుటుంబ సంపాదనను పెంచడంతోపాటు దేశానికి నూతన ఆర్థిక మార్గాలను తెరుస్తున్నారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వ భావన స్థాయిలను పెంచడం ద్వారా మాత్రమే దేశం ముందుకు సాగుతుంది’అని ప్రధాని చెప్పారు. విపత్తులొస్తే నష్టాన్ని తగ్గించుకోగలగాలి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారం తీసుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. విపత్తు ముంచుకొచ్చాక స్పందించడం కంటే, ముందుగానే ఫ్యూచర్ టెక్నాలజీస్‌ని వినియోగించుకొని జరిగే నష్టాన్ని తగ్గించుకోవాలన్నారు. నేషనల్ ప్లాట్‌ఫారమ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్పీడీఆర్ఆర్) మూడో సదస్సును శుక్రవారం ప్రారంభించి ప్రధాని మాట్లాడారు. -
ఉద్యమ వేదికల వద్ద మహిళా దినోత్సవం
న్యూఢిల్లీ/భోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ వేదికల వద్ద సోమవారం అన్ని కార్యక్రమాలు మహిళల ఆధ్వర్యంలో జరగనున్నాయి. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ ఉద్యమ కేంద్రాల వద్ద వేదిక ఏర్పాటు, ప్రసంగాలు, కార్యక్రమాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల నుంచి ఆహార పంపిణీ వరకు అన్ని కార్యక్రమాలను మహిళలే నిర్వహించనున్నారు. వేలాదిగా మహిళా రైతులు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు. వ్యవసాయ రంగంలో మహిళలు గణనీయ పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లభించడం లేదనే ఉద్దేశంతో, వారికి సముచిత గుర్తింపు, గౌరవం అందించే లక్ష్యంతో మహిళా దినోత్సవం రోజు పూర్తిగా వారి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో పాలు పంచుకోవడం కోసం పంజాబ్, హరియాణాల నుంచి వేల సంఖ్యలో మహిళలు వస్తున్నారని రైతు ఉద్యమ నేతలు తెలిపారు. సింఘు సరిహద్దు వద్ద ర్యాలీని సైతం నిర్వహించనున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ సింగ్ తికాయత్ మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న పలు రైతు సభల్లో పాల్గొననున్నారు. మార్చి 8న షోపూర్లో, మార్చి 14న రేవాలో, మార్చ్ 15న జబల్పూర్లో జరిగే సభల్లో ఆయన పాల్గొని, రైతు ఉద్యమానికి మద్దతు కూడగడ్తారని బీకేయూ ప్రతినిధి వెల్లడించారు. ఉత్తరాఖండ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణల్లోనూ పర్యటిస్తారన్నారు. కాగా, తికాయత్‌పై మధ్య ప్రదేశ్‌లో 2012 నాటి ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ వారంట్ పెండింగ్‌లో ఉంది. ఆ సమయంలో జైతారిలో పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తికాయత్ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి తికాయత్ అరెస్టయ్యారు. బెయిల్‌పై విడుదలైన తికాయత్ ఆ తర్వాత కోర్టుకు హాజరుకాలేదు. దాంతో, వారంట్ జారీ అయింది. -
West Bengal Elections 2021: సివంగి సింగిల్‌గానే వస్తుంది
ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కరోనా సంక్షోభం ప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది ‘‘మహిళా నాయకత్వం, కోవిడ్–19 ప్రపంచంలో స్త్రీ, పురుషులు సమానంగా భవిష్యత్ నిర్మించుకోవడం’’అన్న థీమ్‌తో ఉత్సవాలు నిర్వహిస్తూ స్ఫూర్తి నింపుతోంది. కరోనా మహమ్మారిపైన యుద్ధం చేయడమే కాదు, తన జీవితాన్నే ఒక పోరాటంగా మలచుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సారి మహిళా దినోత్సవం థీమ్‌కి అసలు సిసలు ప్రతీకగా నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైనే ఉంది. నిరసనల నిప్పు కణిక పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో సింగిల్ ఉమన్‌గా నెగ్గుకు రావడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆమె ఏ రోజూ అదరలేదు. బెదరలేదు. పదిహేనేళ్ల వయసులోనే కాంగ్రెస్ విద్యార్థి సంఘంలో చేరిన ఆమె నిరసనలే ఆయుధంగా చేసుకున్నారు. దీదీ : ది అన్‌టోల్డ్ మమతా బెనర్జీ అనే పుస్తకంలో మమత ధైర్య సాహసాల గురించి రచయిత సుతాపా పాల్ రాస్తూ ‘‘1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ విస్తృతంగా ప్రచారం చేసే రోజుల్లో జేపీకి ఎదురొడ్డి నిలబడిన ఏకైక మహిళా నాయకురాలు మమతా బెనర్జీయే. కోల్‌కతాలో జేపీ ర్యాలీ తీసినప్పుడు మమత ఆయన కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డం పడ్డారు. అప్పుడే బెంగాల్ ఆమెలో ఒక నిప్పు కణిక దాగుందని తెలుసుకుంది’’అంటూ మమతని ప్రశంసించారు. 1998లో సొంత పార్టీ పెట్టాక సుదీర్ఘ కాలం ఆమె పోరాటాల్లోనే గడిపారు. మమత చేసేవన్నీ వీధిపోరాటాలని ప్రత్యర్థులు ఎద్దేవా చేసినా ఆ పోరాట స్ఫూర్తే ఆమెకు అధికారానికి దగ్గర చేసింది. సింగూరు, నందిగ్రామ్ ఉద్యమాలతో రాష్ట్ర వ్యాప్తంగా మమత దీదీ పేరు మారుమోగిపోయింది. 2011లో ఎన్నికల్లో కమ్యూనిస్టుల కంచుకోటని బద్దలు కొట్టి మమత మహారాణిలా సీఎం సీట్లో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆమె అదే పంథాలోనే నడుస్తున్నారు. కేంద్రాన్ని లెక్క చేయకుండా తన సొంత దారిలో నడవడం ముఖ్యమం త్రుల్లో మమత ఒక్కరికే చెల్లింది. పెద్ద నోట్ల రద్దుని మొదటి సారి గట్టిగా వ్యతిరేకించింది మమతయే. జాతీయ పౌర రిజిస్టర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కేంద్ర పథకాలు, తెచ్చే చట్టాలు తనకు నచ్చకపోతే అమ లు చేయడం లేదని బహిరంగంగానే చెప్పే దమ్మున్న నాయకురాలు. శారదా చిట్‌ఫండ్ కేసు తన మెడకు చుట్టుకున్నా 2019లో అప్పటి కోల్‌కతా కమిషనర్ రాజీవ్కుమార్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారుల్ని తన సొంత పోలీç Üు బలగాలతో అరెస్ట్ చేసిన సాహసవంతురాలు. విభిన్న వ్యక్తిత్వం మమత బెంగాలీల కూతురు, అభిమానులకు అక్క, నేటి తరం రాజకీయ వేత్తలకి అమ్మ. ప్రత్యర్థులకు కలకత్తా కాళిక. ఆమె రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే ఒకే స్త్రీ మూర్తిలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. గత ఏడాది మార్చిలో ప్రభుత్వం అమ్మాయిల పెళ్లి కోసం రూ.25 వేలు ఇచ్చే పథకం రూపాశ్రీలో భాగంగా మమత ఒక పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి వెళ్లడం సాధారణమైనా ఆ వేడుకల్లో ఇతర మహిళలతో కలిసి చీర కొంగు చుట్టి డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఏప్రిల్ 21, 2020.. అది కరోనా కాలం, లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లల్లోనే బందీలై విసుగెత్తిపోయిన రోజులు. అలాంటి సమయంలో కోల్‌కతా వీధుల్లోని లౌడ్ స్పీకర్లలో ఆమె స్వరం మారు మోగుతూ ఉండేది. ‘‘నేను మీ మమతా బెనర్జీ. మిమ్మల్ని నేరుగా కలవలేకపోయినందుకు మన్నించండి. మరికొద్ది రోజులు ఓపిక పట్టండి. ఇళ్లల్లోనే క్షేమంగా ఉండండి. మహమ్మారిని తరిమి కొడితే స్వేచ్ఛగా మీరు బయటకి రావొచ్చు’’అంటూ ఆమె అనునయంతో నచ్చచెప్పారు. ఆ క్షణంలో బెంగాలీలకు తమకు ఓ అమ్మ తోడు ఉందన్న భరోసా కలిగింది. అంతకు ముందు రోజే బెంగాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయంటూ పరిస్థితుల్ని సమీక్షించడానికి కేంద్ర బృందం కోల్‌కతాకి వచ్చింది. కానీ మమత వారిని క్షేత్రస్థాయిలో పర్యటించకుండా అడ్డుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఎ లా వస్తారంటూ వారిని ఎక్కడా తిరగనివ్వలేదు. నా రాష్ట్ర ప్రజల బాగోగులు గురించి నేను చూసుకుంటానని వారిని వెనక్కి పం పేశారు. అప్పు డు ప్రత్యర్థుల్లో ఆమెకు కలకత్తా కాళిక కనిపించింది. బెంగాల్ కూతురినే కోరుకుంటోందా ? బెంగాల్ నిజెర్ మెయేకీ చాయ్ (బెంగాల్ తమ కూతురినే కావాలనుకుంటోంది) అన్న నినాదంతో ఈ సారి ఎన్నికల బరిలోకి దిగారు. ఒక మహిళగా రాజకీయాల్లోకి మహిళలు రావాల ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ బరి లో 50 మంది మహిళల్ని నిల్చోబెట్టారు. బెంగాల్ ఆత్మగౌరవ నినాదంతో దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఢీ కొడుతున్నారు. ప్రతీ రోజూ ట్రెడ్‌మిల్లుపై అయిదారు కిలోమీటర్లు పరుగులు తీసే ఆమె ఎన్నికల పరుగు పందెంలో ఎంత దూరం వెళ్లగలరో మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. -
2020లో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీ మూర్తులు
ఊరి మీదకు రాక్షసుడొచ్చి పడ్డాడు. కొత్త ముఖం రాక్షసుడు. బండెడన్నం కాదు వాడి డిష్. రోజుకు బండెడు మనుషులు. ఊరు ఇంట్లోకి పరుగులు తీసి తలుపేసుకుంది. దబా.. దబా.. దబా.. దబా.. రాక్షసుడు తలుపు తడుతున్నాడు. తడుతూనే ఉన్నాడు. ధడేల్మని తలుపులు తెరుచుకున్నాయి. ఆ ఇంటి మహిళ బయటికి వచ్చింది. చేతుల్లో పది కత్తులు ఉన్నాయి! పది కత్తులకు పది రూపాలు. గృహిణి, ఉద్యోగి, డాక్టర్, నర్స్, యాక్టివిస్ట్..పరిశోధకురాలు, పారిశుధ్య కార్మికురాలు..ఆశా వర్కర్.. ఆన్లైన్ టీచర్, అంబులెన్స్ డ్రైవర్! రాక్షసుడి అడుగు తడబడింది. ఊరు ధైర్యంగా తొంగి చూసింది. కరోనాపై యుద్ధంలోనే కాదు.. సకల రంగాలలోనూ స్త్రీ శక్తి విజేతగా నిలిచింది. జాతీయంగా, అంతర్జాతీయంగా అన్ని రంగాలలోనూ మహిళలు ఈ ఏడాది అసమాన ప్రతిభను చాటారు. అద్భుత విజయాలు సాధించారు. అవార్డులు పొందారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేశారు. సంపన్నులుగా చరిత్రను సృష్టించారు. మన దేశంలో పది మంది ప్రముఖ మహిళల పేరిట వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాపీఠాలను నెలకొల్పనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులుంటాయని తేల్చి చెప్పింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్ లవ్లీ’గా మారుస్తూ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) హెచ్‌యూఎల్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం–2019 అమలు కోసం ఐఎఎస్ కృతికా శుక్లా, ఐపీఎస్ దీపిక దిశ స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. అంతర్జాతీయంగా కమలా హ్యారిస్, జాతీయంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి పాలనలో, ప్రణాళికలో తమ ముద్రను వేశారు. ఈ వివరాలు సంక్షిప్తంగా మీ కోసం. అక్కడ కమలపాలన ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవి బరిలో నిలిచి గెలిచిన భారత సంతతి మహిళ కమలా దేవి హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా జనవరిలో పగ్గాలు చేపట్టబోతున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా, తొలి నల్లజాతి అమెరికన్‌గా, తొలి ఇండో–అమెరికన్‌గా, తొలి ఆసియా–అమెరికన్ మహిళగా కమల రికార్డు నెలకొల్పారు. కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు డొనాల్డ్ హ్యారిస్. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో కమల చదువుకున్నారు. యూసీ హేస్టింగ్స కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు. ప్రధానం గా చిన్నారులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. ఇక్కడ శైలప్రణాళిక కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ ‘టాప్ థింకర్ 2020’ గా ఎంపికయ్యారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా యు.కె.లోని ప్రతిష్టాత్మక పత్రిక ‘ప్రాస్పెక్ట్’ ఆమెను ఈ టైటిల్‌తో గౌరవించింది. తత్వవేత్తలు, మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలను యేటా ‘ప్రాస్పెక్ట్’ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. పాఠకులు, నిపుణులు, సంపాదక బృందం ఇచ్చే రేటింగ్‌ని అనుసరించి జాబితాను ప్రకటిస్తుంది. సకాలంలో చర్యలు తీసుకుని తన రాష్ట్రంలో కరోనా విస్తృతిని కట్టడిని చేసిన శైలజకు గుర్తింపు లభించింది. ఈ సమర్థతను కారణంగానే ఆమెకు ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడే ఘనతను సాధించారు. గతంలో నిఫా వైరస్ కేరళను ఆవరించినప్పుడు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా శైలజే సమర్థంగా ఎదుర్కొన్నారు. ‘నిఫా యువరాణి’, ‘కోవిడ్ రారాణి’ అంటూ విపక్షాలు వ్యంగ్యంగా మాట్లాడినా, తన పనితీరుతో గట్టి సమాధానం చెప్పారు. శైలజ విధి నిర్వహణ చురుగ్గా, ముందుచూపుతో ఉంటుంది. కేరళలో కరోనా కేసులు బయటపడగానే ఆమె ప్రణాళికలు సిద్ధంగా చేశారు. ఆరోగ్యశాఖ యంత్రాంగాన్ని పూర్తిగా మేల్కొలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి టెస్టింగ్ కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారెంటైన్ విధానాన్ని కఠినంగా అమలు పరిచారు. ►బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఎండీ కిరణ్ మజుందార్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ లభించింది. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపర సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకుగాను కిరణ్‌కు ఈ అవార్డు దక్కింది. ►అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్(87) కన్నుమూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన రూత్ అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. ►దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్ మల్హోత్ర నియమితులయ్యారు. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఏకైక సంతానం అయిన రోష్ని దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా హురున్ సంస్థ తాజా కుబేరుల జాబితాలో ఉన్నారు. ►అమెరికాకు చెందిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి, కెరీర్ ఆరంభం నుంచి సమానత్వ హక్కుల కోసం పోరాడిన బిల్లీ జీన్ కింగ్ (76)ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అరుదైన రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీఎఫ్ టీమ్ ఈవెంట్ ఫెడ్ కప్ పేరు మారుస్తూ ఇకపై దీనిని ‘బిల్లీ జీన్ కింగ్ కప్’గా వ్యహరిస్తామని ప్రకటించింది. ఒక టీమ్ ఈవెంట్ టోర్నీని మహిళ పేరుతో వ్యవహరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ►తమిళనాడులోని మదురైకి చెందిన 9వ తరగతి విద్యార్థిని నేత్ర ఐక్యరాజ్యసమితి ‘గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’గా నేత్ర నియమితురాలైంది. క్షౌరశాల నడుపుతున్న తండ్రి తన పెళ్లి కోసం దాచిన 5లక్షల రూపాయలను నేత్ర పేదల సంక్షేమం కోసం ఖర్చుచేసింది. ►ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన ‘బీబీసీ 100 మహిళలు–2020’ జాబితాలో భారత్ నుంచి బిల్కిస్ దాదీ (82), గానా ఇసైవాణి (23), మానసీ జోషీ (31), రిధిమా పాండే(12) చోటు దక్కించుకున్నారు. ►ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారిణిగా జపాన్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ నయోమి ఒసాకా గుర్తింపు పొందింది. ‘ఫోర్బ్స్ పత్రిక మే వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 ఏళ్ల ఒసాకా ప్రైజ్‌మనీ, ఎండార్స్మెంట్ల ద్వారా మొత్తం 3కోట్ల 74 లక్షల డాలర్లు (రూ. 284 కోట్లు) సంపాదించింది. ►నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీని పూర్తి చేసినందుకు చాలా సంతోషం గా ఉన్నానని ఆడపిల్లల విద్యకోసం పాటు పడుతున్న ఈ ఉద్యమ కారిణి అన్నారు. ►ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకుకు చేరుకున్న మూడోమహిళగా మాధురీ కనిట్కర్ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో రెండవ అత్యున్నతస్థాయిలోని ఈ ర్యాంకును పొందిన తొలి పీడియాట్రీషియన్‌గా కూడా కనిట్కర్ గుర్తింపు పొందారు. ►బాలీవుడ్ మెగాస్టార్ ప్రియాంక చోప్రా ‘ఫార్చూన్’ వారి భారతదేశపు అతి శక్తిమంతమైన బిజినెస్ ఉమన్ జాబితాలో స్థానం పొందారు. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ ఆమె నటించారు. ►అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన భారత గణిత మేధావి శకుంతలాదేవికి దాదాపు 4 దశాబ్దాల తర్వాత గిన్నిస్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించిన శకుంతలాదేవి ప్రపంచ రికార్డు నెలకొల్పినప్పటికీ అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు గిన్నిస్ సంస్థ ధ్రువీకరణ పత్రం అందజేయలేదు. ►దివ్యా గోకుల్ నాథ్ ‘ఫోర్బ్స్’ ఏషియా పవర్ఫుల్ బిజినెస్‌ఉమన్ లిస్ట్–2020లో స్థానం సంపాదించారు. ఆమె, ఆమె భర్త వ్యవస్థాపకులుగా ఉన్న ‘బైజూస్’ కంపెనీ విలువ 300 కోట్ల డాలర్లు! ఈ స్టార్టప్ ఆలోచన దివ్యదే. ►ముంబైలోని నావికాదళ స్కూల్ విద్యార్థిని 12 ఏళ్ల కామ్య కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని ఎత్తయిన పర్వతం మౌంట్ అకాంకాగ్వా (6,962మీ) విజయవంతంగా అధిరోహించింది. అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా కామ్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ►హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ప్రత్యూష పారెడ్డికి ‘నీతీ ఆయోగ్ మహిళా అవార్డు’ లభించింది. 2017లో నెమో కేర్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన ప్రత్యూష శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేయడంతోపాటు నవజాత శిశువుల ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే కార్యక్రమాలు చేపట్టారు. -
కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటివరకు నాలుగు జాతీయ స్థాయి అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. మరోసారి సీఎంఓ వరల్డ్ సంస్థ ద్వారా ‘ద వరల్డ్ ఉమేన్ లీడర్షిప్’ అవార్డును మంగళవారం ముంబైలో ఆ సంస్థ నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, పల్లెప్రగతి, గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలకు ఈ అవార్డు దక్కింది. పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించినందుకు మహిళ కలెక్టర్ల విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2018 సంవత్సరంలో పెద్దపల్లి జిల్లాలో 271 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం హైరిస్క్ డెంగీ జిల్లాగా ప్రకటించింది. ఉపాధిహామీ కింద ఉచితంగా ఇంకుడు గుంతలను నిర్మించడంతో దోమల నివారణ, వృథా నీరు పోకుండా భూగర్భజలాలు పెంపొందించేందుకు దోహదపడ్డాయని కలెక్టర్ తెలిపారు. కాగా 2019లో 85 శాతం కేసులు తగ్గాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని ప్రకటించినట్లు పేర్కొన్నారు. దేశంలోనే స్వచ్ఛత జిల్లాగా ప్రకటించారని గుర్తు చేశారు. కాగా అప్పట్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛభారత్, స్వచ్ఛదర్పణ్ పథకాల కింద నాలుగు జాతీయ అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతో స్వచ్ఛతలో జిల్లాను ముందుంచుతానన్నారు. -
మహిళా లీడర్‌షిప్‌లో చివరి మూడో స్థానంలో భారత్
న్యూఢిల్లీ: మహిళా లీడర్‌ఫిఫ్‌లో ప్రపంచంలో భారత్ చివరి నుంచి మూడో ర్యాంకు పొందింది. 47 శాతం మహిళలు ఉన్నత పదవులు నిర్వహిస్తుండటంతో రష్యా తొలి ర్యాంకు సాధించింది. గ్రాంట్ తోర్నటన్ సర్వే కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉండటాన్ని పరిగణలోకి తీసుకొని ర్యాంకులు ప్రకటించింది. రష్యా (47%), ఇండోనేషియా(46%), ఎస్టోనియా (40%)లు వరుసుగా మూడు ర్యాంకులు సాధించాయి. ర్యాంకుల్లో భారత్ ముందు అర్జెంటీనా (15%) తర్వాత జపాన్ (7%)లు ఉన్నాయి. ఈ సర్వేలో 5,500 వ్యాపారాలు, 36 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నత పదవుల్లో మహిళల పాత్రలను పరిశీలించారు. గత సంవత్సరం కన్నా 7 శాతం మహిళలు ఉన్నత పదువుల్లో ఉండటం పెరిగిందని సర్వేలో తేలిపారు. ఈ సర్వేలో భారత్‌లో కేవలం 7 శాతం మహిళలే ఉన్నత పదవుల్లో పనిచేస్తున్నారని, ఎక్కువ శాతం హెచ్ఆర్, కార్పోరేట్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. లింగ వివక్ష లేనపుడే మహిళలు ఉన్నత పదవులు నిర్వహిస్తారనే విషయాన్ని తోర్నటన్ సర్వేకంపెనీ ప్రస్తావించింది. తూర్పు ఐరోపాలో 37 శాతం మహిళలు ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారని, కేవలం 9 శాతం మహిళలే ఉన్నత పదవుల్లో లేరని చెప్పారు. మెక్సికో, నైజీరియా, ఇండోనేషియా, టర్కీలు ఈ విషయంలో మెరుగుదల కనబర్చాయని సర్వేలో పేర్కొన్నారు. -
మహిళా నాయకత్వంతోనే సమాజ శాంతి
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నోబెల్ గ్రహీత దలైలామా - ప్రేమ, జాలిని ప్రోత్సహించడంలో మాతృమూర్తిని మించిన వారు లేరు - అలాంటి వారి పట్ల వివక్ష తగదు.. సమస్యలకు చర్చే పరిష్కారం - మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి - ప్రస్తుత విద్యా వ్యవస్థ అంతా వ్యాపారమయం - మనసు ప్రశాంతంగా ఉంటే బాహ్య ప్రపంచమూ బాగుంటుంది పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఈ ప్రపంచంలోని సగం దేశాలకైనా మహిళలు నాయకత్వం వహించినప్పుడే సమాజం శాంతియుతంగా ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నోబెల్ గ్రహీత దలైలామా హితవు పలికారు. వ్యథాభరిత సమాజం నుంచి విముక్తి కావాలని ఆకాంక్షించారు. మానవతా విలువల్ని ప్రోది చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 20వ శతాబ్దంలో తప్పు ఎక్కడ దొర్లిందో విశ్లేషించాల్సిన తరుణమిదేనన్నారు. వేదన, క్షోభ స్థానంలో జాలి, దయ వంటి లక్షణాలున్న సమాజ స్థాపన కోసం పాటుపడాలన్నారు. విజయవాడకు సమీపంలోని పవిత్ర సంగమంలో శుక్రవారం ప్రారంభమైన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన దలైలామా కీలకోపన్యాసం చేశారు. ‘నేను మామూలుగా సోదరీ సోదరులారా అని సమావేశాలను ప్రారంభిస్తుంటాను. కానీ ఈసారి ఓపక్క వేదికపై పెద్దక్కలు, సోదరీ మణులు, మరికొందరు సోదరులు ఉన్నందున ఎల్డర్ సిస్టర్స్, సిస్టర్స్, ఫ్యూ బ్రదర్స్ అంటూ ప్రారంభిస్తున్నా. ఏమైనా మనమందరం మానవులం. మనందరికీ మానసిక, భౌతిక, భావోద్వేగాలుంటాయి. మానవత్వమే మానవ సమాజ సందేశం. సమాజంలో చాలా సమస్యలుంటాయి. ఇవేవీ అప్పటికప్పుడు శైశవ దశలో సృష్టించినవి కావు. ఎదుగుతున్న క్రమంలో వచ్చినవే జాతి, మతం, విశ్వాసం, విరోధం, స్త్రీ, పురుష వివక్ష తదితరాలు. కానీ ప్రాథమికంగా మనమందరం ఒక్కటే. పటిష్టమైన విశ్వాసాలు, మానవులందరూ ఒక్కటేనన్న భావన ప్రాతిపదికన నిజమైన సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించాలన్నది నా అభిమతం. స్త్రీ కూడా మనిషే. సమాజ పరిణామ క్రమంలో కుటుంబాలతో పాటు జనసాంద్రత పెరిగింది. వ్యవసాయ వ్యవస్థలు వచ్చాయి. దాంతోపాటే సమాజంలో చోరీలు, దోపిడీలు వంటి అవలక్షణాలు అధికమయ్యాయి. వీటిని నియంత్రించేందుకు నాయకత్వం కావాల్సి వచ్చింది. అప్పుడు విద్య లేదు కనుక భౌతికంగా ఎవరు శక్తివంతులైతే వారి చేతికే నాయకత్వం దక్కేది. మతం పుట్టుక కూడా ఆ దశలో నుంచి వచ్చిందే. ఇప్పుడు వాటిని సమీక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’అన్నారు. ప్రేమ, జాలి, క్షమ గుణాలున్న విద్య అవసరం ప్రస్తుత విద్యా వ్యవస్థ వ్యాపారమయమై, భౌతిక అవసరాలే ప్రాతిపదికగా ఉందని దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. ‘మానవ విలువలకు స్థానం లేకుండా పోతోంది. ఎంతసేపూ ఆదాయం, డబ్బు చుట్టూనే తిరుగుతోంది. జాలి, దయ కలిగిన మానవ సమాజాన్ని సృష్టించాలి. ప్రేమ, జాలి, కనికరం, క్షమ వంటి విషయాలున్న విద్య నేటి అవసరం. ఇటువంటి విలువల్ని ప్రోత్సహించడంలో మాతృమూర్తిని మించిన వారు లేరు. అటువంటి వ్యక్తి పట్ల వివక్ష తగదు. గత శతాబ్దంలో జరిగిన హింస, వివక్షకు తావులేకుండా ప్రస్తుత 21వ శతాబ్దాన్ని నిర్మించుకోవాలి. చిన్న తనం నుంచే మానవతా విలువలు నేర్పాలి. మితిమీరిన హింసకు, మానవ హననానికీ తావు లేకుండా చూడాలి. జాతి, మతం, వర్ణం, వివక్ష పేరిట జరిగే హింసపై మనం ఆలోచించాల్సిన సమయం ఇది. 21వ శతాబ్దంలో శాంతియుత సమాజం కావాలి. దానికి మనశ్శాంతి అవసరం. అది ఉన్నప్పుడు సమాజ శాంతి కూడా సాధ్యమవుతుంది. ఈ శతాబ్దం కేంద్ర బింధువు చర్చ (డైలాగ్) కావాలి. తప్పుడు అభిప్రాయాలతో కాకుండా అవగాహనతో ముందుకు సాగాలి. చర్చలు, సంప్రదింపులే పరిష్కార మార్గాలు. ఆయుధం లేని సమాజం కావాలి. ఈ ప్రపంచం నిరాయుధ ప్రపంచంగా ఉండాలి. అది మన మనస్సుతోనే ప్రారంభం కావాలి. ఇతరుల బాధ, క్షోభను అర్థం చేసుకోవడంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూగోళంపై 200 దేశాలున్నాయి. మహిళా నేతలు మరింత మంది వస్తే ఈ ప్రపంచం అంత భద్రంగా ఉంటుంది. అందుకే మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద’న్నారు.