ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కరోనా సంక్షోభం ప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది ‘‘మహిళా నాయకత్వం, కోవిడ్–19 ప్రపంచంలో స్త్రీ, పురుషులు సమానంగా భవిష్యత్ నిర్మించుకోవడం’’అన్న థీమ్‌తో ఉత్సవాలు నిర్వహిస్తూ స్ఫూర్తి నింపుతోంది. కరోనా మహమ్మారిపైన యుద్ధం చేయడమే కాదు, తన జీవితాన్నే ఒక పోరాటంగా మలచుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సారి మహిళా దినోత్సవం థీమ్‌కి అసలు సిసలు ప్రతీకగా నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైనే ఉంది.
నిరసనల నిప్పు కణిక
పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో సింగిల్ ఉమన్‌గా నెగ్గుకు రావడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆమె ఏ రోజూ అదరలేదు. బెదరలేదు. పదిహేనేళ్ల వయసులోనే కాంగ్రెస్ విద్యార్థి సంఘంలో చేరిన ఆమె నిరసనలే ఆయుధంగా చేసుకున్నారు. దీదీ : ది అన్‌టోల్డ్ మమతా బెనర్జీ అనే పుస్తకంలో మమత ధైర్య సాహసాల గురించి రచయిత సుతాపా పాల్ రాస్తూ ‘‘1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ విస్తృతంగా ప్రచారం చేసే రోజుల్లో జేపీకి ఎదురొడ్డి నిలబడిన ఏకైక మహిళా నాయకురాలు మమతా బెనర్జీయే. కోల్‌కతాలో జేపీ ర్యాలీ తీసినప్పుడు మమత ఆయన కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డం పడ్డారు. అప్పుడే బెంగాల్ ఆమెలో ఒక నిప్పు కణిక దాగుందని తెలుసుకుంది’’అంటూ మమతని ప్రశంసించారు. 1998లో సొంత పార్టీ పెట్టాక సుదీర్ఘ కాలం ఆమె పోరాటాల్లోనే గడిపారు.
మమత చేసేవన్నీ వీధిపోరాటాలని ప్రత్యర్థులు ఎద్దేవా చేసినా ఆ పోరాట స్ఫూర్తే ఆమెకు అధికారానికి దగ్గర చేసింది. సింగూరు, నందిగ్రామ్ ఉద్యమాలతో రాష్ట్ర వ్యాప్తంగా మమత దీదీ పేరు మారుమోగిపోయింది. 2011లో ఎన్నికల్లో కమ్యూనిస్టుల కంచుకోటని బద్దలు కొట్టి మమత మహారాణిలా సీఎం సీట్లో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆమె అదే పంథాలోనే నడుస్తున్నారు. కేంద్రాన్ని లెక్క చేయకుండా తన సొంత దారిలో నడవడం ముఖ్యమం త్రుల్లో మమత ఒక్కరికే చెల్లింది. పెద్ద నోట్ల రద్దుని మొదటి సారి గట్టిగా వ్యతిరేకించింది మమతయే. జాతీయ పౌర రిజిస్టర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కేంద్ర పథకాలు, తెచ్చే చట్టాలు తనకు నచ్చకపోతే అమ లు చేయడం లేదని బహిరంగంగానే చెప్పే దమ్మున్న నాయకురాలు. శారదా చిట్‌ఫండ్ కేసు తన మెడకు చుట్టుకున్నా 2019లో అప్పటి కోల్‌కతా కమిషనర్ రాజీవ్‌కుమార్‌ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారుల్ని తన సొంత పోలీç Üు బలగాలతో అరెస్ట్ చేసిన సాహసవంతురాలు.
విభిన్న వ్యక్తిత్వం
మమత బెంగాలీల కూతురు, అభిమానులకు అక్క, నేటి తరం రాజకీయ వేత్తలకి అమ్మ. ప్రత్యర్థులకు కలకత్తా కాళిక. ఆమె రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే ఒకే స్త్రీ మూర్తిలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. గత ఏడాది మార్చిలో ప్రభుత్వం అమ్మాయిల పెళ్లి కోసం రూ.25 వేలు ఇచ్చే పథకం రూపాశ్రీలో భాగంగా మమత ఒక పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి వెళ్లడం సాధారణమైనా ఆ వేడుకల్లో ఇతర మహిళలతో కలిసి చీర కొంగు చుట్టి డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఏప్రిల్ 21, 2020.. అది కరోనా కాలం, లాక్‌డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లల్లోనే బందీలై విసుగెత్తిపోయిన రోజులు. అలాంటి సమయంలో కోల్‌కతా వీధుల్లోని లౌడ్ స్పీకర్లలో ఆమె స్వరం మారు మోగుతూ ఉండేది.
‘‘నేను మీ మమతా బెనర్జీ. మిమ్మల్ని నేరుగా కలవలేకపోయినందుకు మన్నించండి. మరికొద్ది రోజులు ఓపిక పట్టండి. ఇళ్లల్లోనే క్షేమంగా ఉండండి. మహమ్మారిని తరిమి కొడితే స్వేచ్ఛగా మీరు బయటకి రావొచ్చు’’అంటూ ఆమె అనునయంతో నచ్చచెప్పారు. ఆ క్షణంలో బెంగాలీలకు తమకు ఓ అమ్మ తోడు ఉందన్న భరోసా కలిగింది. అంతకు ముందు రోజే బెంగాల్‌లో కరోనా కేసులు పెరిగిపోయాయంటూ పరిస్థితుల్ని సమీక్షించడానికి కేంద్ర బృందం కోల్‌కతాకి వచ్చింది. కానీ మమత వారిని క్షేత్రస్థాయిలో పర్యటించకుండా అడ్డుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎ లా వస్తారంటూ వారిని ఎక్కడా తిరగనివ్వలేదు. నా రాష్ట్ర ప్రజల బాగోగులు గురించి నేను చూసుకుంటానని వారిని వెనక్కి పం పేశారు. అప్పు డు ప్రత్యర్థుల్లో ఆమెకు కలకత్తా కాళిక కనిపించింది.
బెంగాల్ కూతురినే కోరుకుంటోందా ?
బెంగాల్ నిజెర్ మెయేకీ చాయ్ (బెంగాల్ తమ కూతురినే కావాలనుకుంటోంది) అన్న నినాదంతో ఈ సారి ఎన్నికల బరిలోకి దిగారు. ఒక మహిళగా రాజకీయాల్లోకి మహిళలు రావాల ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ బరి లో 50 మంది మహిళల్ని నిల్చోబెట్టారు. బెంగాల్ ఆత్మగౌరవ నినాదంతో దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఢీ కొడుతున్నారు. ప్రతీ రోజూ ట్రెడ్‌మిల్లుపై అయిదారు కిలోమీటర్లు పరుగులు తీసే ఆమె ఎన్నికల పరుగు పందెంలో ఎంత దూరం వెళ్లగలరో మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment