women students
-
విదేశాలకు విద్యార్థినుల క్యూ
‘ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం’ అనే నినాదాన్ని భారతీయ విద్యార్థినులు విదేశీ విద్యను అభ్యసించే విషయంలోనూ చాటుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధానంగా 2019 తరువాత ఉన్నత విద్య కోసం దేశంలోని విద్యార్థినులు విదేశాలకు వెళ్లడం దాదాపు 150 శాతం పెరగడం విశేషం. దేశంలోని నగరాల నుంచే కాకుండా.. చిన్న పట్టణాల నుంచి కూడా విద్యార్థినులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతుండటం పెరుగుతోందని ప్రపంచ బ్యాంక్ నివేదికను ఉటంకిస్తూ విద్యారంగంలోని ప్రముఖ కన్సల్టెన్సీ ప్రొడిగీ ఫైనాన్స్ నివేదిక వెల్లడించింది. అమెరికా, బ్రిటన్‌లతోపాటు యూరప్‌లోని పలుదేశాల్లో ఉన్నత విద్య పట్ల మన విద్యార్థినులు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశీ విద్య కన్సల్టెన్సీలను, విదేశీ విద్య రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. – సాక్షి, అమరావతి విద్యా రుణాల కోసం పోటీ విదేశీ విద్య కోసం బ్యాంకులకు వస్తున్న దరఖాస్తుల్లో కూడా పురుషులతోపాటు మహిళలు సమానంగా ఉంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019కి ముందు విదేశీ విద్య కోసం బ్యాంకులకు అందే దరఖాస్తుల్లో విద్యార్థినులు 10శాతం మంది మాత్రమే ఉండేవారు. కాగా.. 2022లో విదేశీ విద్యా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించే విద్యార్థినుల దరఖాస్తులు ఏకంగా 49 శాతానికి పెరగడం విశేషం. మేనేజ్మెంట్, మెడిసిన్ రంగాల్లో ఉన్నత విద్య కోసం బ్యాంకు రుణాల కోసం భారతీయ విద్యార్థినుల నుంచి 145 శాతం దరఖాస్తులు పెరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ ప్రొడిగీ ఫైనాన్స్ వెల్లడించింది. విదేశీ విద్యలోనూ సగం 2019కు ముందు దేశంలోని మెట్రో నగరాల నుంచి విదేశీ విద్య కోసం వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 70:30గా ఉండేది. అంటే విదేశాలకు వెళ్లేవారిలో పురుషులు 70 శాతం, మహిళలు 30 శాతం మంది ఉండేవారు. కానీ.. 2022లో మెట్రో నగరాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 50:50గా ఉండటం విశేషం. అంటే పురుషులు, మహిళలు సమానంగా ఉన్నారు. దేశంలోని చిన్న నగరాల నుంచి 2019కి ముందు విద్య కోసం విదేశాలకు వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 80:20గా ఉండేది. కానీ 2022లో దేశంలో చిన్న నగరాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 60:40గా ఉండటం విశేషం. 2019కి ముందు దేశంలోని చిన్న పట్టణాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 80:20గా ఉండేది. 2022లో చిన్న పట్టణాల విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 55:45గా ఉంది. ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే భారతీయ విద్యార్థినులు అత్యున్నత విద్యా ప్రమాణాలు సాధిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇటీవల ప్రశంసించడం విశేషం. భారత్‌లో సైన్స్–టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో మహిళలు 43 శాతంగా ఉన్నారని పేర్కొంది. విద్య, ఉపాధి రంగాల్లో ఆడ పిల్లలను ప్రోత్సహించే దృక్పథం భారతీయ తల్లిదండ్రుల్లో పెరుగుతుండటమే అందుకు కారణమని చెప్పింది. విద్యార్థినుల కోసం స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌లు పెరుగుతుండటం కూడా అందుకు దోహదపడుతోందని చెప్పింది. ఈ సానుకూల దృక్పథం రానున్న కాలంలో మరింతగా పెరుగుతుందని కూడా పేర్కొంది. -
ఆ ఘటన మహిళలకు తీవ్ర అవమానకరం.. ఎన్సీడబ్ల్యూ తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ: రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష సందర్భంగా బికనీర్ జిల్లాలోని ఓ కేంద్రం బయట మహిళా అభ్యర్థి ధరించిన టాప్ పొడుగు చేతులను పురుష సిబ్బంది ఒకరు కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు మహిళలను ఘోరంగా అవమానించడమేనని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల సోదా కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించకపోవడంపై వివరణ అడిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఒక అభ్యర్థిని ధరించిన పొడుగు చేతుల టాప్‌ను పురుష గార్డు కత్తెరతో కట్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. (చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు) -
Afghanistan Crisis: వాళ్లుంటే నరకమే!
భవిష్యత్తుపై ఆశలేదు. రేపటి కోసం ఆలోచన చెయ్యడం లేదు. బెంగంతా ఈ రోజు పైనే. మరుక్షణంలో ఏమి జరుగుతుందో! ఇదీ అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి. మనదేశానికి విద్యార్థులుగా వచ్చిన ముగ్గురు మహిళల మనోగతం. ‘‘అఫ్గానిస్తాన్‌లో సామాన్యుల జీవితం కకావికలమైపోయింది. ఉపాధి కరువైన బ్రతుకులు... మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని పాలకులు... ప్రాణాలకు విలువివ్వని ఆటవికరాజ్యంలో జీవనం దినదిన గండం కాదు, క్షణక్షణ గండం. సూక్ష్మంగా ఇవే అక్కడ ఉన్న మా వాళ్ల జీవితాలు’’ అంటూ అఫ్గానిస్తాన్ నుంచి విశాఖపట్నం, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరం చదువుకున్నాం! ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గానిస్తాన్‌కు వెళ్లే పరిస్థితి లేదని న్యాయ విద్య అభ్యసిస్తున్న అవాస్తా బకాష్ తెలిపారు. జూలై మాసంలో ఆమె కాబూల్‌లో తన కుటుంబంతో గడిపి వచ్చారు. గతంలో తాలిబాన్ల పాలను గుర్తుచేసుకుంటూ... తొమ్మిది సంవత్సరాల వయసులో పాఠశాలలో 4వ తరగతిలో చేరినట్లు తెలిపారు. ‘‘రెండు దశాబ్దాల క్రితం అప్పటి తాలిబాన్ పాలన ముగిసిన తరువాత ప్రాధమిక విద్య నుంచి న్యాయ విద్యలో డిగ్రీ వరకు కాబూల్‌లో పూర్తిచేశాను. మా నాన్న ఆర్మీ అధికారిగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మేము మొత్తం ఏడుగురు సంతానం. ఇద్దరమ్మాయిలం. మా సోదరులు కనస్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఎంబిఏ, బీటెక్, జర్నలిజం చేశారు. మా సోదరి వివాహం చేసుకుని నార్వేలో నివస్తోంది’’ అని చెప్పారు అవాస్తా బకాష్. రోజులు వెళ్లదీస్తున్నాం! ‘‘మా కుటుంబం కాబూల్‌లో నివసిస్తోంది. తాలిబాన్ల రాకతో అందరూ ఉపాధిని కోల్పోయారు. దాచుకున్న డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఆఫ్గనిస్తాన్ వెళ్తే వాళ్లకు భారం కావడం తప్ప ప్రయోజనం లేదు. గతంలో నేను డిగ్రీ పూర్తిచేసిన తరువాత అఫ్గానిస్తాన్ కార్మిక మంత్రిత్వ శాఖలో లెజిస్లేటర్‌గా, రెండేళ్లు జెండర్ ఆఫీసర్‌గా, ప్రధాని కార్యాలయంలో అవినీతి నిరోధక అధికారిగా రెండేళ్లు పనిచేశాను. న్యాయవిద్యపై ఆసక్తితో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం కోర్సులో చేరాను. ప్రసుతం ఎల్ఎల్ఎమ్ ఫైనల్లో ఉన్నాను. ఇప్పట్లో వెళ్లలేం! ప్రస్తుత తరుణంలో భారత్‌ను విడిచి అఫ్గానిస్తాన్‌కు వెళ్లలేను. అనుమతిస్తే భారత్‌లో శరణార్థిగా ఉండిపోతాను. తాలిబాన్లు ఇటీవల చంపేసిన వాళ్లలో అప్పట్లో నాతో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. మేము ఎవ్వరికీ హాని చేయమని చెబుతున్నప్పటికీ తాలిబన్ల ధోరణిలో మార్పు రావడం లేదు, పాత పంథాలోనే వెళుతున్నారు. ఇప్పటికే తాలిబాన్లు ప్రధాని కార్యాలయంలో పనిచేసిన వారిని వదిలి పెట్టమని, వారు అమెరికాకు బానిసలుగా పనిచేసిన వారని బహిరంగంగా ప్రకటించారు. మా దేశానికి వెళితే నా ప్రాణాలకు ముప్పు తప్పుదు. అవకాశం వచ్చినట్టే వచ్చి... అఫ్గానిస్తాన్‌లో 1990 నుంచి మోడరనైజేషన్ ప్రారంభం అయ్యింది. గత ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకమైన ఉద్యోగాలు కల్పించింది. మహిళలు విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో అడుగు పెట్టగలిగారు. రాజకీయరంగంలో సైతం రాణించారు. కొన్ని పరిమితులకు లోబడి పురుషులతో సమాన స్థాయిలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు వచ్చాయి. నేడు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఇప్పుడు అఫ్గాన్‌లో పురుషుడి సహాయం లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మూసివేత దిశగా బ్యాంకులు తాలిబాన్లు తమ హవాను కొనసాగించడం అంత సులభం కాదు. విదేశీ బ్యాంకులు ఇప్పటికే తమ శాఖలను మూసివేయాయి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ సైతం మూతబడింది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవు. సమాజం సైతం తాలిబాన్ పాలనను స్వాగతించడం లేదు. అంతర్గతంగా వీరిపై పోరు ప్రారంభమవుతోంది. ప్రపంచ దేశాల నుంచి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేప«థ్యంలో తాలిబాన్లు తాత్కాలికంగా కొంత సంయమనం పాటిస్తున్నారంతే. కోవిడ్ కంటే ప్రమాదకరం వైద్య రంగంలో పనిచేస్తున్న మహిళలు విధులకు హాజరు కావచ్చని తాలిబాన్లు చెప్పారు. అయినప్పటికీ వారు విధులకు వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కంటే తాలిబాన్లే ప్రమాదకరమని నమ్ముతున్నాను. గత 15 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి నేడు ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితి నెలకొంది. డాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్ వంటి కళారంగాలను పూర్తిగా నిషేధించారు. దీంతో ఆయా కళాకారులు తమ వృత్తిని మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రస్తుతం అఫ్గాన్‌లో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో వస్తాయని చెబుతున్నారు, కానీ ఆ మాటను నమ్మే పరిస్థితి మాత్రం లేదు’’ అని వివరించారు అవాస్తా బకాష్. ఒక్క రోజులో జీవితాలు మారిపోయాయి అఫ్గానిస్తాన్‌లో మా జీవితాలు కేవలం ఒక్క రోజులోనే తలకిందులయ్యాయి. తాలిబన్లు మొదటగా మహిళలపైనే ఉక్కుపాదం మోపారు. తాలిబాన్లను ఆణచివేస్తామన్న ప్రభుత్వం ఒక్కరోజులోనే వారికి సరెండర్ అవడం అంతా కలగా జరిగిపోయింది. అక్కడ మహిళలు మాత్రమే కాదు, పురుషుల జీవితాలు సైతం ప్రశ్నార్థకంగా మారాయి. గడ్డం పెంచడం, సంప్రదాయ వస్త్రధారణ, టోపీ పెట్టుకోవడం వంటి ఆచారాలను తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుంది. – ముబారకా, బీసీఏ స్టూడెంట్ ఇస్లాం పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారు... తాలిబాన్ల సంఖ్య పెరగడానికి కారణం నిరక్షరాస్యత, పేదరికమే. 14 సంవత్సరాల పిల్లలను మదర్సాలకు పంపిస్తారు. అక్కడ వారి మనసులను ముల్లాలు మార్చివేస్తారు. ముల్లాలు చెప్పిందే వేదంగా భావించిన పిల్లలు తాలిబాన్ వైపు అడుగులు వేస్తున్నారు. తాలిబన్ల విస్తరణ ఇస్లాం అనే పవిత్రమైన పదాన్ని దుర్వినియోగం చేస్తూనే జరిగింది. నిరక్షరాస్యులైన తాలిబాన్లు పరిపాలన చేయడం, విధులను ఎలా నిర్వహిస్తారు? – పేరు చెప్పడానికి ఇష్టపడలేదు – వేదుల వి.ఎస్.వి నరసింహం సాక్షి, విశాఖపట్నం -
ఒళ్లంతా కప్పే దుస్తులు వేసుకుని రండి
ఐఐటీ ఢిల్లీలోని ఓ మహిళా హాస్టల్ వాళ్లు ఓ నోటీసు పంపారు. అందులో.. తమ హౌస్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి మహిళలు అంతా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే, శుభ్రమైన మంచి పాశ్చాత్య లేదా భారతీయ దుస్తులు ధరించి రావాలని తెలిపారు. హౌస్ డే అనేది ఢిల్లీ ఐఐటీలో ఏడాదికి ఒకసారి నిర్వహించే కార్యక్రమం. దానికి విద్యార్థినులు గంట పాటు అతిథులను హాస్టల్‌కు ఆహ్వానించవచ్చు. ఈ కార్యక్రమం ఈనెల 20వ తేదీన జరగాల్సి ఉంది. హిమాద్రి హాస్టల్ వద్ద వార్డెన్ సంతకంతో ఈ నోటీసు పెట్టారు. హాస్టళ్లు, యూనివర్సిటీలు, కాలేజీలలో మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడే పింజ్రా టాడ్ అనే సంస్థ ఈ నోటీసును వాట్సప్‌లో అందరికీ షేర్ చేసింది. మహిళలు ధరించే దుస్తుల గురించి హాస్టల్ వార్డెన్లు ఎందుకంత కచ్చితంగా వ్యవహరించాలని సంస్థ సభ్యురాలు ఒకరు ప్రశ్నించారు. ఐఐటీ ఢిల్లీలో హిమాద్రి, కైలాష్ అనే రెండు అమ్మాయిల హాస్టళ్లున్నాయి. ఇలాంటి నోటీసు ఒకటి పెట్టడం ఇదే మొదటిసారి. గతంలో కూడా తమకు పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు వేసుకు రావాలని నోటి మాటగా చెప్పారని, అయితే ఇలా నోటీసు పెట్టడం మాత్రం ఇదే మొదటిసారని బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఒకరు చెప్పారు. ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే చెప్పేవారని, అయితే వాటిని ఎవరూ పాటించిన దాఖలాలూ లేవు, అలాగే పాటించకపోతే ఎవరినీ ఇంతవరకు శిక్షించిన పాపాన కూడా పోలేదని మరో మాజీ విద్యార్థిని తెలిపారు. -
ఆ లైబ్రరీలో అమ్మాయిలకు రాత్రిపూట కర్ఫ్యూ!
సాధారణంగా పీజీ వైద్యులు, ఇంటర్న్‌షిప్ చేసేవారు, యువ రెసిడెంట్ డాక్టర్లను అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఎప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే పిలవడం సర్వసాధారణం. పుణెలోని బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (బీజేఎంసీ) కూడా ఇలాగే చేస్తారు. కానీ, కాలేజి లైబ్రరీలో అర్ధరాత్రి చదువుకోవాలంటే మాత్రం.. అమ్మాయిలకు కర్ఫ్యూ విధిస్తున్నారు. బీజేఎంసీ డీన్ అజయ్ చందన్వాలే తీసుకున్నఈ నిర్ణయం పట్ల విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11.15 అయ్యేసరికల్లా కాలేజి గార్డులు లైబ్రరీకి వెళ్లి అక్కడున్న అమ్మాయిలందరినీ వాళ్ల వాళ్ల హాస్టళ్లకు పంపేస్తున్నారు. అబ్బాయిలు మాత్రం ఎంతసేపు కావాలన్నా ఉండి చదువుకోడానికి వీలుంటోంది. అయితే ఏ విద్యా సంస్థ అయినా విద్యార్థులకు ఆడ.. మగ తేడా ఆధారంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. మహిళల స్వేచ్ఛను హరించడానికి బదులు, వాళ్లకు తగిన రక్షణ కల్పించాలని అంటున్నారు. కానీ చందన్వాలే మాత్రం తమ కొత్త నిబంధనలను సమర్థించుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో కూడా అమ్మాయిలు చదువుకోడానికి లైబ్రరీకి వస్తున్నారని, ఇది వారికి ఏమాత్రం సురక్షితం కాదనే తాము ఈ నిబంధనలు విధించామని అన్నారు. మొదటి ఐదున్నరేళ్ల పాటు ఎంబీబీఎస్ చదివే అమ్మాయిలు రాత్రి 9.30 గంటలకల్లా తిరిగి హాస్టళ్లకు చేరుకోవాల్సిందే. ఇక్కడ కూడా అబ్బాయిలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కొంత క్రమశిక్షణ, నియమ నిబంధనలు ఉండాలని, అప్పుడే కాలేజి హాస్టళ్లలో అమ్మాయిలకు తగినంత భద్రత ఉంటుందని చందన్వాలే చెప్పారు. మరి అబ్బాయిలకు ఇవి వర్తించవా అంటే.. తాము మహిళల భద్రత గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నామని, త్వరలోనే అబ్బాయిలకు కూడా ఈ నిబంధనలు వర్తింపజేస్తామని ఆయన వివరించారు. విద్యార్థినుల వాదన వేరేలా ఉంది. తమకు ఒక నెలలో ఆలిండియా పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష ఉందని, పుస్తకాలు కొనాలంటే చాలా ఖరీదు అవుతున్నందున.. తప్పనిసరిగా లైబ్రరీలోనే చదువుకోవాలని.. ఎక్కువసేపు అక్కడ ఉంటే తప్ప తమకు పోర్షన్లు పూర్తికావని.. ఇలాంటి సమయంలో ఆంక్షలు పెట్టడం వల్ల ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకులు రావడం కష్టమవుతుందని వాపోయారు. ఒక్కొక్కళ్లు ఒక్కోలా చదువుతారని, కొందరు తెల్లవారుజామునే లేచి చదివితే మరికొందరికి అర్ధరాత్రి ఎంతసేపయినా మెలకువగా ఉండి చదవడం అలవాటు ఉంటుందని.. అలాంటప్పుడు తమపై ఆంక్షలు పెడితే ఎలాగని మరో ఇంటర్న్ విద్యార్థిని ప్రశ్నించింది.