ఆ లైబ్రరీలో అమ్మాయిలకు రాత్రిపూట కర్ఫ్యూ!
ఆ లైబ్రరీలో అమ్మాయిలకు రాత్రిపూట కర్ఫ్యూ!
Published Tue, Nov 8 2016 10:25 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM
సాధారణంగా పీజీ వైద్యులు, ఇంటర్న్‌షిప్ చేసేవారు, యువ రెసిడెంట్ డాక్టర్లను అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఎప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే పిలవడం సర్వసాధారణం. పుణెలోని బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (బీజేఎంసీ) కూడా ఇలాగే చేస్తారు. కానీ, కాలేజి లైబ్రరీలో అర్ధరాత్రి చదువుకోవాలంటే మాత్రం.. అమ్మాయిలకు కర్ఫ్యూ విధిస్తున్నారు. బీజేఎంసీ డీన్ అజయ్ చందన్‌వాలే తీసుకున్నఈ నిర్ణయం పట్ల విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11.15 అయ్యేసరికల్లా కాలేజి గార్డులు లైబ్రరీకి వెళ్లి అక్కడున్న అమ్మాయిలందరినీ వాళ్ల వాళ్ల హాస్టళ్లకు పంపేస్తున్నారు. అబ్బాయిలు మాత్రం ఎంతసేపు కావాలన్నా ఉండి చదువుకోడానికి వీలుంటోంది.
అయితే ఏ విద్యా సంస్థ అయినా విద్యార్థులకు ఆడ.. మగ తేడా ఆధారంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. మహిళల స్వేచ్ఛను హరించడానికి బదులు, వాళ్లకు తగిన రక్షణ కల్పించాలని అంటున్నారు. కానీ చందన్‌వాలే మాత్రం తమ కొత్త నిబంధనలను సమర్థించుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో కూడా అమ్మాయిలు చదువుకోడానికి లైబ్రరీకి వస్తున్నారని, ఇది వారికి ఏమాత్రం సురక్షితం కాదనే తాము ఈ నిబంధనలు విధించామని అన్నారు.
మొదటి ఐదున్నరేళ్ల పాటు ఎంబీబీఎస్ చదివే అమ్మాయిలు రాత్రి 9.30 గంటలకల్లా తిరిగి హాస్టళ్లకు చేరుకోవాల్సిందే. ఇక్కడ కూడా అబ్బాయిలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కొంత క్రమశిక్షణ, నియమ నిబంధనలు ఉండాలని, అప్పుడే కాలేజి హాస్టళ్లలో అమ్మాయిలకు తగినంత భద్రత ఉంటుందని చందన్‌వాలే చెప్పారు. మరి అబ్బాయిలకు ఇవి వర్తించవా అంటే.. తాము మహిళల భద్రత గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నామని, త్వరలోనే అబ్బాయిలకు కూడా ఈ నిబంధనలు వర్తింపజేస్తామని ఆయన వివరించారు.
విద్యార్థినుల వాదన వేరేలా ఉంది. తమకు ఒక నెలలో ఆలిండియా పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష ఉందని, పుస్తకాలు కొనాలంటే చాలా ఖరీదు అవుతున్నందున.. తప్పనిసరిగా లైబ్రరీలోనే చదువుకోవాలని.. ఎక్కువసేపు అక్కడ ఉంటే తప్ప తమకు పోర్షన్లు పూర్తికావని.. ఇలాంటి సమయంలో ఆంక్షలు పెట్టడం వల్ల ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకులు రావడం కష్టమవుతుందని వాపోయారు. ఒక్కొక్కళ్లు ఒక్కోలా చదువుతారని, కొందరు తెల్లవారుజామునే లేచి చదివితే మరికొందరికి అర్ధరాత్రి ఎంతసేపయినా మెలకువగా ఉండి చదవడం అలవాటు ఉంటుందని.. అలాంటప్పుడు తమపై ఆంక్షలు పెడితే ఎలాగని మరో ఇంటర్న్ విద్యార్థిని ప్రశ్నించింది.
Advertisement
Advertisement