ఒళ్లంతా కప్పే దుస్తులు వేసుకుని రండి
ఐఐటీ ఢిల్లీలోని ఓ మహిళా హాస్టల్ వాళ్లు ఓ నోటీసు పంపారు. అందులో.. తమ హౌస్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి మహిళలు అంతా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే, శుభ్రమైన మంచి పాశ్చాత్య లేదా భారతీయ దుస్తులు ధరించి రావాలని తెలిపారు. హౌస్ డే అనేది ఢిల్లీ ఐఐటీలో ఏడాదికి ఒకసారి నిర్వహించే కార్యక్రమం. దానికి విద్యార్థినులు గంట పాటు అతిథులను హాస్టల్‌కు ఆహ్వానించవచ్చు. ఈ కార్యక్రమం ఈనెల 20వ తేదీన జరగాల్సి ఉంది. హిమాద్రి హాస్టల్ వద్ద వార్డెన్ సంతకంతో ఈ నోటీసు పెట్టారు. హాస్టళ్లు, యూనివర్సిటీలు, కాలేజీలలో మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడే పింజ్రా టాడ్ అనే సంస్థ ఈ నోటీసును వాట్సప్‌లో అందరికీ షేర్ చేసింది.
మహిళలు ధరించే దుస్తుల గురించి హాస్టల్ వార్డెన్లు ఎందుకంత కచ్చితంగా వ్యవహరించాలని సంస్థ సభ్యురాలు ఒకరు ప్రశ్నించారు. ఐఐటీ ఢిల్లీలో హిమాద్రి, కైలాష్ అనే రెండు అమ్మాయిల హాస్టళ్లున్నాయి. ఇలాంటి నోటీసు ఒకటి పెట్టడం ఇదే మొదటిసారి. గతంలో కూడా తమకు పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు వేసుకు రావాలని నోటి మాటగా చెప్పారని, అయితే ఇలా నోటీసు పెట్టడం మాత్రం ఇదే మొదటిసారని బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఒకరు చెప్పారు. ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే చెప్పేవారని, అయితే వాటిని ఎవరూ పాటించిన దాఖలాలూ లేవు, అలాగే పాటించకపోతే ఎవరినీ ఇంతవరకు శిక్షించిన పాపాన కూడా పోలేదని మరో మాజీ విద్యార్థిని తెలిపారు.