సానియా ఫస్ట్.. హింగిస్ నెక్స్ట్!
న్యూఢిల్లీ: ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ లో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న సానియా మీర్జా(భారత్), మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ తమ తమ ర్యాంకులను నిలుపుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలోని వ్యక్తిగత రాంకింగ్స్ లో సానియా మీర్జా తన నంబర్ ర్యాంకును పదిలంగా ఉంచుకోగా, హింగిస్ రెండో స్థానాన్ని నిలుపుకుంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సానియా 11, 395 పాయింట్లతో అగ్రస్థానంలో, హింగిస్ 11, 355 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు.
వీరిద్దరు జోడి కట్టిన అనంతరం 10 టైటిల్స్ ను సొంతం చేసుకున్నారు. వీటిలో ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను కూడా ఈ వరల్డ్ నంబర్ వన్ జోడీ తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది కూడా బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ తో సానియా-హింగిస్ జోడీ శుభారంభం చేసింది. దీంతో తమ వరుస టైటిల్స్ సంఖ్యను ఆరుకు పెంచుకోగా, వారి వరుస విజయాల సంఖ్య 26కు చేరింది. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ లో భారత్ నుంచి రోహన్ బోపన్న ఒక్కడే టాప్-10లో స్థానం సంపాదించాడు.