Womens World Boxing Championship
-
ఫైనల్లో నీతూ, నిఖత్.. భారత్‌కు కనీసం 2 సిల్వర్ మెడల్స్ ఖాయం
మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2023లో భారత్‌కు కనీసం రెండు రజత పతకాలు ఖాయమయ్యాయి. ఇవాళ (మార్చి 23) జరిగిన సెమీ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు), ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) ప్రత్యర్ధులపై విజయాలు సాధించి ఫైనల్‌కు చేరారు. నీతూ.. కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాపై విజయం సాధించగా, తెలంగాణ అమ్మాయి నిఖత్.. కొలంబియా బాక్సర్ ఇంగ్రిడ్ వెలెన్సియాను మట్టికరిపించింది. ఈ పోటీల్లో భారత్‌కు మరో 2 పతకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగిన క్వార్టర్స్‌లో లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) విజయాలు సాధించి కనీసం కాంస్యం పతాకన్ని ఖరారు చేశారు. ఇవాళ రాత్రి 8:15 గంటలకు జరిగే సెమీఫైనల్లో లవ్లీనా.. లీ కియాన్ (చైనా)ను, రాత్రి 8: 30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సావీటీ.. సూ ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)తో తలపడనున్నారు. ఈ బౌట్లలో వీరిరువురు విజయాలు సాధిస్తే, భారత్‌కు మరో 2 రజత పతకాలు ఖాయమవుతాయి. -
కేవలం 12 సెకెన్లలో ప్రత్యర్ధిని మట్టికరిపించిన భారత బాక్సర్
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు జాస్మిన్ లంబోరియా, శశి చోప్రా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన తొలి పోరులో జాస్మిన్ (60 కేజీల విభాగం) రిఫరీ స్టాపింగ్ ద కాంటెస్ట్ (ఆర్ఎస్సీ) ద్వారా ఎన్యాంబెగా ఆంబ్రోస్ (టాంజానియా)ను చిత్తు చేసింది. బౌట్ మొదలైన 12 సెకన్లలోనే జాస్మిన్ విసిరిన పంచ్‌లకు ఆంబ్రోస్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ ఆటను ఆపివేసి జాస్మిన్ను విజేతగా ప్రకటించారు. 63 కేజీల కేటగిరీలో శశి చోప్రా 5–0 స్కోరుతో ఎంవాంగీ టెరిసియా (కెన్యా)పై ఘన విజయం సాధించింది. తర్వాతి రౌండ్లో సమడోవా (తజికిస్తాన్)తో జాస్మిన్... కిటో మై (జపాన్)తో శశి తలపడతారు. అయితే 70 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత బాక్సర్ శ్రుతి యాదవ్ 0–5తో జో పాన్ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. నేడు భారత బాక్సర్లు నీతూ ఘంఘాస్, మంజు బంబోరియా తొలి రౌండ్లో ఆడతారు. -
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ( ఫోటోలు)
-
Nikhat Zareen: జగజ్జేత జరీన్
న్యూఢిల్లీ: తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. 52 కేజీల ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో నిఖత్ ‘పంచ్’కు ఎదురే లేకుండా పోయింది. గురువారం థాయ్‌లాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌తో జరిగిన టైటిల్ పోరులో తెలంగాణ తేజం జరీన్ 5–0తో జయభేరి మోగించిది. తనపై భారతావని పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా ‘పసిడి’పతకం తెచ్చింది. ఒక్క ఫైనల్లోనే కాదు... ప్రతీ బౌట్లోనూ నిఖత్ పట్టుదలగా ఆడింది. తనకెదురైన ప్రత్యర్థులపై కచ్చితమైన పంచ్‌లు విసురుతూ పాయింట్లను సాధించింది. ఫైనల్లోనూ ఆమె పంచ్‌లకే జడ్జీలంతా జై కొట్టారు. మూడు రౌండ్లపాటు జరిగిన ఈ బౌట్లో జరీన్ ఆధిపత్యమే కొనసాగింది. దీంతో జడ్జీలు 30–27, 29–28, 29–28, 30–27, 29–28లతో తెలంగాణ అమ్మాయికి అనుకూలంగా పాయింట్లు ఇచ్చారు. భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్ జరీన్ రికార్డులకెక్కింది. మేరీకోమ్ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది. 🚨 BREAKING: @nikhat_zareen wins gold at the Women's Boxing World Championships in Turkey. She becomes India's fifth gold medallist in the history of the tournament, joining a club featuring Mary Kom, Sarita Devi, Jenny RL and Lekha KC. #IBAWWC2022 | #BoxingNews pic.twitter.com/hljjcAaUKR — Sportstar (@sportstarweb) May 19, 2022 -
మేరీకోమ్‌పైనే దృష్టి
ఉలాన్ ఉడె (రష్యా): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఏడో స్వర్ణమే లక్ష్యంగా భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ బరిలోకి దిగనుంది. నేడు మొదలయ్యే ఈ మెగా ఈవెంట్లో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో మూడో సీడ్‌గా పోటీపడనుంది. తొలి రౌండ్లో బై పొందిన ఈ మణిపూర్ బాక్సర్ మంగళవారం నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో తలపడుతుంది. మేరీకోమ్‌తోపాటు మరో నలుగురికి కూడా తొలి రౌండ్లో బై లభించింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ 2006లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. స్వదేశంలో జరిగిన ఆ ఈవెంట్లో భారత్ రెండు స్వర్ణాలు సహా ఎనిమిది పతకాలు గెల్చుకుంది. భారత జట్టు: మంజు రాణి (48 కేజీలు), మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), నీరజ్ (57 కేజీలు), సరిత (60 కేజీలు), మంజు (64 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), సవీటి (75 కేజీలు), నందిని (81 కేజీలు), కవిత(ప్లస్ 81 కేజీలు). -
మేరీ మెరిసె...
న్యూఢిల్లీ: పట్టుదల ఉండాలే కాని వయసనేది ఒక అంకె మాత్రమేనని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ నిరూపించింది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో సెమీస్ చేరడం ద్వారా ఈ మణిపూర్ మెరిక కొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధికంగా ఏడు పతకాలు గెలిచిన తొలి బాక్సర్‌గా మేరీకోమ్ ఘనత వహించింది. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, రజతంతో కలిపి ఆరు పతకాలు నెగ్గిన మేరీకోమ్ తాజా ప్రదర్శనతో తన ఖాతాలో ఏడో పతకాన్ని జమ చేసుకుంది. ఈ టోర్నీకి ముందు ఈ రికార్డు కేటీ టేలర్ (ఐర్లాండ్–6 పతకాలు), మేరీకోమ్ పేరిట సంయుక్తంగా ఉండేది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 35 ఏళ్ల మేరీకోమ్ 5–0తో వు యు (చైనా)పై ఘనవిజయం సాధించింది. మేరీకోమ్‌తోపాటు లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), సోనియా చహల్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మరో మూడు పతకాలను ఖాయం చేశారు. అయితే భారత్‌కే చెందిన పింకీ రాణి (51 కేజీలు), కచారి భాగ్యవతి (81 కేజీలు), మనీషా (64 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 21 ఏళ్ల లవ్లీనా 5–0తో స్కాట్ కయి ఫ్రాన్సెస్ (ఆస్ట్రేలియా)పై; 21 ఏళ్ల సోనియా 4–1తో మెసెలా యెని కాస్టెనాడ (కొలంబియా)పై; 23 ఏళ్ల సిమ్రన్‌జిత్ 3–1తో అమీ సారా (ఐర్లాండ్)పై విజయం సాధించారు. పింకీ 0–5తో పాంగ్ చోల్ మి (ఉత్తర కొరియా) చేతిలో... మనీషా 1–4తో స్టొయికా పెట్రోవా (బల్గేరియా) చేతిలో... భాగ్య వతి 2–3తో జెస్సికా (కొలంబియా) చేతిలో... సీమా 0–5తో జియోలి (చైనా) చేతిలో ఓడారు. బుధవారం విశ్రాంతి దినం. గురు, శుక్రవారాల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా) తో మేరీకోమ్; చెన్ నియెన్ చిన్ (చైనీస్ తైపీ)తో లవ్లీనా... శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జో సన్ హవా (ఉత్తర కొరియా)తో సోనియా; డాన్ డుయు (చైనా)తో సిమ్రన్‌జిత్ తలపడతారు. -
అయ్యో అమ్మాయ్!
మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం సెర్బియా. గావ్రిలో ప్రిన్సిప్ అనే సెర్బియన్ పౌరుడు ఆస్ట్రియా రాజకుటుంబ వారసుడిని కాల్చి చంపడంతో యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ముగిసిన వందేళ్ల తర్వాత ఇప్పుడు.. అదే సెర్బియా నుంచి.. పదేళ్ల క్రితం విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన కొసావోలోని డాంజ్ సడికు అనే ఒక బాక్సింగ్ క్రీడాకారిణిని బరిలోకి రానివ్వని కారణంగా ప్రపంచ క్రీడా ఈవెంట్ల నిర్వహణలో భారతదేశానికి స్థానం లేకుండా పోయే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి! ఢిల్లీలో ఇవాళ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి 24 వరకు. కొసావో దేశ బాక్సింగ్ క్రీడాకారిణి డాంజ్ సడికు కూడా ఈ పోటీలకు సిద్ధం అయింది. పందొమ్మిదేళ్లు ఆ అమ్మాయికి. తన పదిహేడవ యేటే.. టర్కీలో జరిగిన ఐరోపా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో గోల్డ్‌మెడల్ కొట్టింది. అయితే ఆ అమ్మాయికి ఇప్పుడు ఇండియా వీసా ఇవ్వలేదు! కొసావోను ఇండియా ఒక దేశంగా గుర్తించకపోవడమే డాంజ్కు వీసా ఇవ్వకపోవడానికి కారణం. గతేడాది డిసెంబర్లో గౌహతిలో జరిగిన వరల్డ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా ఇండియా డాంజ్ని రానివ్వలేదు. కొసావోలో భారత రాయబార కార్యాలయం లేదు కాబట్టి, సెర్బియా వెళ్లి అక్కడి ఇండియన్ ఎంబసీలో వీసాకు దరఖాస్తు చేసుకుంది డాంజ్. బుధవారం సాయంత్రం వరకు డాంజ్కి వీసా రాలేదు. గురువారం నుంచి పోటీలు.ఒలింపిక్ కమిటీ 2012లో ఒలింపిక్స్‌లోకి మహిళల బాక్సింగ్‌ని కూడా చేర్చాక బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బి.ఎఫ్.ఐ.) తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలివి.వీటిల్లో కనుక డాంజ్ని ఆడనివ్వకపోతే ఏ ఆటలోనైనా ప్రపంచకప్పు నిర్వహించేందుకు వీల్లేకుండా ఇండియాను బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని ఐ.ఒ.సి. (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ఇప్పటికే హెచ్చరించింది కూడా. కానీ బి.ఎఫ్.ఐ. ఏమీ చేయలేని పరిస్థితి! వీసా ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించవలసింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ. నిజానికి ఆ శాఖ కూడా చేయగలిగిందేమీ లేదు. కొసావోను ఒక దేశంగానే ఇండియానే గుర్తించనప్పుడు, మంత్రిత్వశాఖ మాత్రం ఏం చేస్తుంది? అప్పటికీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐ.ఓ.ఎ.) డాంజ్కు వీసా ఇచ్చే విషయాన్ని క్రీడల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లింది. విదేశీ వ్యవహారాల శాఖలానే అదీ ఒక మంత్రిత్వ శాఖ కనుక ఈ విషయంలో క్రీడల శాఖ కూడా చేయగలిగిందీ ఏమీ లేదు. ప్రతి దేశంలోనూ క్రీడలకు అంతర్జాతీయ ఫెడరేషన్లు ఉంటాయి. బాక్సింగ్ ఫెడరేషన్, హాకీ ఫెడరేషన్, వాలీబాల్ ఫెడరేషన్.. ఇలా. ఇప్పుడు ఆ ఫెడరేషన్లన్నింటికీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఒక లెటర్ పంపించబోతోంది.. ఇండియాను ఏ చాంపియన్‌షిప్‌లకు కూడా హోస్ట్‌ను కానివ్వొద్దని! డాంజ్ని మొదటిసారి నిరుత్సాహపరిచినప్పుడే ఐ.ఒ.సి. ఇండియాకు వార్న్ చేసింది. ఇప్పుడిక బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం ఒక్కటే మిగిలింది. ‘మిడిల్ ఈస్ట్ దేశాలు ఇజ్రాయిల్ అథ్లెట్స్‌ని ఆహ్వానిస్తున్నప్పుడు కొసావోకు ఎంట్రీ ఇవ్వడానికి ఇండియాకు ఏమైంది?’ అని ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ అధ్యక్షుడు నరీందర్ బాత్రా అడుగుతున్నారు.రాజకీయాల్నీ, క్రీడల్నీ ముడిపెట్టడం ఏమిటన్నది ఆయన ప్రశ్న. బుధవారం నాడు బాత్రా.. స్పోర్ట్స్ మినిస్ట్రీకి ఘాటైన పదజాలంతో ఉత్తరం రాస్తూ, డాంజ కనుక ఈ పోటీల్లో లేకపోతే, ఇండియా ఐ.ఒ.సి. లిస్ట్‌లోనే లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్నేయ ఐరోపాలో మధ్యదరా సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్య ఉన్న దేశాలను బాల్కన్ రాజ్యాలు అంటారు. అక్కడి బాల్కన్ పర్వతాల నుంచి బాల్కన్ అనే పేరు వచ్చింది. అల్బేనియా, బోస్నియా హెర్జెగొవీనా, బల్గేరియా, క్రొయేషియా, గ్రీస్, మాసిడోనియా, మాంటెనిగ్రో, రొమేనియా, సెర్బియా, స్లొవేనియా.. ఇవన్నీ బాల్కన్ దేశాలు. వీటిల్లో ఒకటైన సెర్బియా నుంచి విడిపోయి, కొసావో 2008లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు మన బాక్సింగ్ క్వీన్ డాంజ్కి తొమ్మిదేళ్లు. సెర్బియాకు ఒక సరిహద్దు అల్బేనియా. అందులోని వివాదాస్పద భౌగోళిక ప్రదేశమే కొసావో. సెర్బియా నుంచి విడిపోయి, స్వతంత్రాన్ని ప్రకటించుకున్న కొసావోను ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాలలో 113 దేశాలు మాత్రమే ఒక దేశంగా గుర్తించాయి. గుర్తించని వాటిలో ఇండియా, రష్యా, చైనా వంటివి ఉన్నాయి. ‘దేనికదే విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకుంటే దేశ సార్వభౌమత్వం బలహీనపడుతుందని, ఒక దాన్ని చూసి ఒకటి నేర్చుకుంటే ప్రపంచమే ముక్కలుచెక్కలైపోతుందని’ ఇండియా వాదన. అందుకే కొసావోను గుర్తించలేదు. ఆ దేశం నుంచి వచ్చిన క్రీడాకారిణినీ గుర్తించడం లేదు. ‘అయ్యో అమ్మాయ్’ అనిపించవచ్చు. ప్రతిభ గల క్రీడాకారిణికి ఈ దేశం కాకుంటే మరో దేశం. ఈ ఈవెంట్ కాకుంటే మరో ఈవెంట్. దౌత్య పరిమితుల్ని దాటలేక ప్రతిభను. ఈవెంట్లను చేజార్చుకుంటే.. అప్పుడు మన దేశం ‘అయ్యో భారత్’ అనిపించుకుంటుంది. -
మహిళా బాక్సర్లకు ఇదేం నిబంధన?!
ఆటలు అబ్బాయిలకు, పాటలు అమ్మాయిలకు అనే సంప్రదాయ ఆలోచనా ధోరణి నుంచి మన సమాజం పూర్తిగా బయటపడలేదు. అందుకే శారీరకంగా కష్టమైన వృత్తులు, ఉద్యోగాలు, క్రీడలలో మహిళలకు ఈనాటికీ సరైన ప్రోత్సాహం లభించడం లేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ‘కష్టమైన’ రంగాలలోకి ఇష్టపడి వెళ్లాలనుకున్నా... వారి గౌరవాన్ని, పరువును దెబ్బతీసి, వారిని వెనక్కి లాగే అవరోధాలు ఏదో ఒక దశలో మహిళలకు ఎదురవుతూనే ఉన్నాయి. ఇందుకు తాజా నిదర్శనం... దక్షిణ కొరియాలోని జెజు నగరంలో రేపటి నుండి నవంబర్ 25 వరకు జరుగనున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు భారతదేశం నుండి ప్రయాణమైన ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (శాయ్) గర్భనిర్థారణ పరీక్షలు నిర్వహించడం! ‘అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం’ నిబంధనల మేరకే, కొరియా వెళుతున్న భారత జట్టులో గర్భిణులు ఎవరూ లేరని నిర్థారించేందుకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు ‘శాయ్’ చెబుతున్నప్పటికీ ఈ వ్యవహారంపై సహజంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భనిర్థారణ పరీక్షలు ఎవరిపైనైతే జరిపారో ఆ ఎనిమిది మందీ అవివాహితులు, జూనియర్లు కావడం మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. ‘‘ఇలా పరీక్షలు నిర్వహించడం కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే’’ అని డాక్టర్ పి.ఎస్.ఎం. చంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈయన ఎవరో కాదు, క్రీడాకారుల ఫిట్నెస్కోసం ‘శాయ్’ తరచు సంప్రదించే వైద్యుడే. ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’ అధ్యక్షుడు కూడా అయిన చంద్రన్ ఈ ధోరణిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘‘పెళ్లికాని పిల్లలకు, పెళ్లీడు లేని జూనియర్లకు గర్భనిర్థారణ పరీక్షలు చేయడం అంటే, వారి శీల ప్రతిష్టను భంగపరచడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిబంధనల మాటేమిటి? ఆ మాటలో నిజం లేదంటారు చంద్రన్. అంటే, అసలు అలాంటి నిబంధనే లేదన్నది ఆయన వాదన. 2014 ఆగస్టు 31 నుంచి అమలులోకి వచ్చిన బాక్సింగ్ సంఘం నియమాలలో ప్రపంచ పోటీలకు వెళుతున్న బాక్సర్లకు గర్భనిర్థారణ పరీక్షలు జరిపి తీరాలన్న నిబంధన ఏదీ లేదని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ‘‘మహిళా బాక్సర్లు మెడికల్ సర్టిఫికెట్తో పాటు, అదనంగా నాన్-ప్రెగ్నెన్సీ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని మాత్రమే అసోసియేషన్ టెక్నికల్ రూల్స్ 2.1.4.2. లో ఉందనీ, దీనర్థం వారికి గర్భనిర్థారణ పరీక్షలు జరుపమని కాదనీ’’ చంద్రన్ అంటున్నారు. ఆ స్టేట్మెంట్ మీద కూడా తల్లిదండ్రులలో ఒకరు సంతకం చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ‘‘పాపం, ఆ అమ్మాయిలు బాక్సింగ్‌లో విజయం సాధించి మాతృదేశానికి పేరుతేవాలన్న తపనలో ఇలాంటి వాటికి తలవొగ్గవలసి వస్తోంది’’ అని చంద్రన్ ఆవేదన చెందారు. మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఇప్పుడిప్పుడే చంద్రన్‌తో గొంతు కలపడం మొదలు పెట్టాయి కనుక ఇటువంటి అర్థరహితమైన, మహిళలను కించపరిచే నిబంధనలపై క్రీడా సంఘాలు గానీ, ఇతర రంగాల సంస్థలు కానీ పునరాలోచిస్తాయనే అనుకోవాలి.