మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం సెర్బియా. గావ్రిలో ప్రిన్సిప్ అనే సెర్బియన్ పౌరుడు ఆస్ట్రియా రాజకుటుంబ వారసుడిని కాల్చి చంపడంతో యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ముగిసిన వందేళ్ల తర్వాత ఇప్పుడు.. అదే సెర్బియా నుంచి.. పదేళ్ల క్రితం విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన కొసావోలోని డాంజ్ సడికు అనే ఒక బాక్సింగ్ క్రీడాకారిణిని బరిలోకి రానివ్వని కారణంగా ప్రపంచ క్రీడా ఈవెంట్ల నిర్వహణలో భారతదేశానికి స్థానం లేకుండా పోయే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి!
ఢిల్లీలో ఇవాళ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి 24 వరకు. కొసావో దేశ బాక్సింగ్ క్రీడాకారిణి డాంజ్ సడికు కూడా ఈ పోటీలకు సిద్ధం అయింది. పందొమ్మిదేళ్లు ఆ అమ్మాయికి. తన పదిహేడవ యేటే.. టర్కీలో జరిగిన ఐరోపా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో గోల్డ్‌మెడల్ కొట్టింది. అయితే ఆ అమ్మాయికి ఇప్పుడు ఇండియా వీసా ఇవ్వలేదు! కొసావోను ఇండియా ఒక దేశంగా గుర్తించకపోవడమే డాంజ్‌కు వీసా ఇవ్వకపోవడానికి కారణం.
గతేడాది డిసెంబర్‌లో గౌహతిలో జరిగిన వరల్డ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా ఇండియా డాంజ్‌ని రానివ్వలేదు. కొసావోలో భారత రాయబార కార్యాలయం లేదు కాబట్టి, సెర్బియా వెళ్లి అక్కడి ఇండియన్ ఎంబసీలో వీసాకు దరఖాస్తు చేసుకుంది డాంజ్. బుధవారం సాయంత్రం వరకు డాంజ్‌కి వీసా రాలేదు. గురువారం నుంచి పోటీలు.ఒలింపిక్ కమిటీ 2012లో ఒలింపిక్స్‌లోకి మహిళల బాక్సింగ్‌ని కూడా చేర్చాక బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బి.ఎఫ్.ఐ.) తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలివి.వీటిల్లో కనుక డాంజ్‌ని ఆడనివ్వకపోతే ఏ ఆటలోనైనా ప్రపంచకప్పు నిర్వహించేందుకు వీల్లేకుండా ఇండియాను బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని ఐ.ఒ.సి. (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ఇప్పటికే హెచ్చరించింది కూడా. కానీ బి.ఎఫ్.ఐ. ఏమీ చేయలేని పరిస్థితి! వీసా ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించవలసింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ. నిజానికి ఆ శాఖ కూడా చేయగలిగిందేమీ లేదు. కొసావోను ఒక దేశంగానే ఇండియానే గుర్తించనప్పుడు, మంత్రిత్వశాఖ మాత్రం ఏం చేస్తుంది? అప్పటికీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐ.ఓ.ఎ.) డాంజ్‌కు వీసా ఇచ్చే విషయాన్ని క్రీడల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లింది.
విదేశీ వ్యవహారాల శాఖలానే అదీ ఒక మంత్రిత్వ శాఖ కనుక ఈ విషయంలో క్రీడల శాఖ కూడా చేయగలిగిందీ ఏమీ లేదు. ప్రతి దేశంలోనూ క్రీడలకు అంతర్జాతీయ ఫెడరేషన్‌లు ఉంటాయి. బాక్సింగ్ ఫెడరేషన్, హాకీ ఫెడరేషన్, వాలీబాల్ ఫెడరేషన్.. ఇలా. ఇప్పుడు ఆ ఫెడరేషన్‌లన్నింటికీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఒక లెటర్ పంపించబోతోంది.. ఇండియాను ఏ చాంపియన్‌షిప్‌లకు కూడా హోస్ట్‌ను కానివ్వొద్దని! డాంజ్‌ని మొదటిసారి నిరుత్సాహపరిచినప్పుడే ఐ.ఒ.సి. ఇండియాకు వార్న్ చేసింది. ఇప్పుడిక బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం ఒక్కటే మిగిలింది. ‘మిడిల్ ఈస్ట్ దేశాలు ఇజ్రాయిల్ అథ్లెట్స్‌ని ఆహ్వానిస్తున్నప్పుడు కొసావోకు ఎంట్రీ ఇవ్వడానికి ఇండియాకు ఏమైంది?’ అని ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ అధ్యక్షుడు నరీందర్ బాత్రా అడుగుతున్నారు.రాజకీయాల్నీ, క్రీడల్నీ ముడిపెట్టడం ఏమిటన్నది ఆయన ప్రశ్న. బుధవారం నాడు బాత్రా.. స్పోర్ట్స్ మినిస్ట్రీకి ఘాటైన పదజాలంతో ఉత్తరం రాస్తూ, డాంజ కనుక ఈ పోటీల్లో లేకపోతే, ఇండియా ఐ.ఒ.సి. లిస్ట్‌లోనే లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్నేయ ఐరోపాలో మధ్యదరా సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్య ఉన్న దేశాలను బాల్కన్ రాజ్యాలు అంటారు. అక్కడి బాల్కన్ పర్వతాల నుంచి బాల్కన్ అనే పేరు వచ్చింది. అల్బేనియా, బోస్నియా హెర్జెగొవీనా, బల్గేరియా, క్రొయేషియా, గ్రీస్, మాసిడోనియా, మాంటెనిగ్రో, రొమేనియా, సెర్బియా, స్లొవేనియా.. ఇవన్నీ బాల్కన్ దేశాలు. వీటిల్లో ఒకటైన సెర్బియా నుంచి విడిపోయి, కొసావో 2008లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు మన బాక్సింగ్ క్వీన్ డాంజ్‌కి తొమ్మిదేళ్లు.
సెర్బియాకు ఒక సరిహద్దు అల్బేనియా. అందులోని వివాదాస్పద భౌగోళిక ప్రదేశమే కొసావో. సెర్బియా నుంచి విడిపోయి, స్వతంత్రాన్ని ప్రకటించుకున్న కొసావోను ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాలలో 113 దేశాలు మాత్రమే ఒక దేశంగా గుర్తించాయి. గుర్తించని వాటిలో ఇండియా, రష్యా, చైనా వంటివి ఉన్నాయి. ‘దేనికదే విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకుంటే దేశ సార్వభౌమత్వం బలహీనపడుతుందని, ఒక దాన్ని చూసి ఒకటి నేర్చుకుంటే ప్రపంచమే ముక్కలుచెక్కలైపోతుందని’ ఇండియా వాదన. అందుకే కొసావోను గుర్తించలేదు. ఆ దేశం నుంచి వచ్చిన క్రీడాకారిణినీ గుర్తించడం లేదు. ‘అయ్యో అమ్మాయ్’ అనిపించవచ్చు. ప్రతిభ గల క్రీడాకారిణికి ఈ దేశం కాకుంటే మరో దేశం. ఈ ఈవెంట్ కాకుంటే మరో ఈవెంట్. దౌత్య పరిమితుల్ని దాటలేక ప్రతిభను. ఈవెంట్‌లను చేజార్చుకుంటే.. అప్పుడు మన దేశం ‘అయ్యో భారత్’ అనిపించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment