మేరీ మెరిసె...  | Mary Kom, others enter semi-finals of Womens World Boxing | Sakshi
Sakshi News home page

మేరీ మెరిసె... 

Published Wed, Nov 21 2018 1:25 AM | Last Updated on Wed, Nov 21 2018 1:25 AM

Mary Kom, others enter semi-finals of Womens World Boxing - Sakshi

న్యూఢిల్లీ: పట్టుదల ఉండాలే కాని వయసనేది ఒక అంకె మాత్రమేనని భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ నిరూపించింది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో సెమీస్‌ చేరడం ద్వారా ఈ మణిపూర్‌ మెరిక కొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో అత్యధికంగా ఏడు పతకాలు గెలిచిన తొలి బాక్సర్‌గా మేరీకోమ్‌ ఘనత వహించింది. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, రజతంతో కలిపి ఆరు పతకాలు నెగ్గిన మేరీకోమ్‌ తాజా ప్రదర్శనతో తన ఖాతాలో ఏడో పతకాన్ని జమ చేసుకుంది. ఈ టోర్నీకి ముందు ఈ రికార్డు కేటీ టేలర్‌ (ఐర్లాండ్‌–6 పతకాలు), మేరీకోమ్‌ పేరిట సంయుక్తంగా ఉండేది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 35 ఏళ్ల మేరీకోమ్‌ 5–0తో వు యు (చైనా)పై ఘనవిజయం సాధించింది. మేరీకోమ్‌తోపాటు లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీలు), సోనియా చహల్‌ (57 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మరో మూడు పతకాలను ఖాయం చేశారు. అయితే భారత్‌కే చెందిన పింకీ రాణి (51 కేజీలు), కచారి భాగ్యవతి (81 కేజీలు), మనీషా (64 కేజీలు), సీమా పూనియా (ప్లస్‌ 81 కేజీలు) పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది.  

21 ఏళ్ల లవ్లీనా 5–0తో స్కాట్‌ కయి ఫ్రాన్సెస్‌ (ఆస్ట్రేలియా)పై; 21 ఏళ్ల సోనియా 4–1తో మెసెలా యెని కాస్టెనాడ (కొలంబియా)పై; 23 ఏళ్ల సిమ్రన్‌జిత్‌ 3–1తో అమీ సారా (ఐర్లాండ్‌)పై విజయం సాధించారు. పింకీ 0–5తో పాంగ్‌ చోల్‌ మి (ఉత్తర కొరియా) చేతిలో... మనీషా 1–4తో స్టొయికా పెట్రోవా (బల్గేరియా) చేతిలో... భాగ్య వతి 2–3తో జెస్సికా (కొలంబియా) చేతిలో... సీమా  0–5తో జియోలి (చైనా) చేతిలో ఓడారు.  బుధవారం విశ్రాంతి దినం. గురు, శుక్రవారాల్లో సెమీఫైనల్స్‌ జరుగుతాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో కిమ్‌ హ్యాంగ్‌ మి (ఉత్తర కొరియా) తో మేరీకోమ్‌; చెన్‌ నియెన్‌ చిన్‌ (చైనీస్‌ తైపీ)తో లవ్లీనా... శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జో సన్‌ హవా (ఉత్తర కొరియా)తో సోనియా; డాన్‌ డుయు (చైనా)తో సిమ్రన్‌జిత్‌ తలపడతారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement