60 లక్షలు పడిపోనున్న కరెన్సీ ప్రింటింగ్!
పెద్ద నోట్లు రద్దైనప్పటి నుంచి ఇటు సాధారణ ప్రజానీకమే కాదు, అటు బ్యాంకు ఉద్యోగులు, ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సరిపడ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం అదనపు సమయాలు వెచ్చించి మరీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు కరెన్సీని ముద్రిస్తున్నారు. కానీ ఇక తమ వల్ల కాదంటూ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు. తొమ్మిది గంటల సిఫ్ట్ను పన్నెండు గంటల మేర పనిచేస్తుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సాల్బోని(పశ్చిమబెంగాల్) ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు అదనపు సమయాలను పనిచేయకూడదని నిర్ణయించారు. ఈ మేరకు అభిప్రాయాన్ని మేనేజ్మెంట్కు తెలిపారు. ఉద్యోగుల ఈ నిర్ణయం నోట్ల ముద్రణపై పడనుందని తెలుస్తోంది.
12 గంటల సిఫ్ట్లో రోజుకు 460 లక్షల కరెన్సీ నోట్లు ప్రింట్ చేస్తున్న ఈ ప్రెస్, ఉద్యోగుల నిర్ణయంతో రోజుకు ప్రింట్ చేయనున్న కరెన్సీ నోట్లు 60 లక్షలు పడిపోనున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. 12 గంటల సిఫ్ట్లో ఉద్యోగులు పనిచేసి ప్రజల అవసరార్థం ఎక్కువ నగదును అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఈ అదనపు పనిగంటలతో ఉద్యోగులకు వెన్నునొప్పి, నిద్రలేమి, శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ప్రబలుతున్నాయని తెలిసింది. దేశ ప్రజల కోసం ఇన్ని రోజులు 12 గంటల సిఫ్ట్లో పనిచేశామని, మరింత కాలం తాము పనిచేయలేకపోతున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు చెప్పారు. మేనేజ్మెంట్తో డిసెంబర్ 14న కుదుర్చుకున్న అగ్రిమెంట్ కూడా డిసెంబర్ 27తో ముగిసిందన్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో కొత్త రూ.2000, రూ.500 నోట్లతో పాటు అన్ని కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తున్నారు.