సర్కారుతో తాడో పేడో
రేపు వామ పక్షాలసమ్మె
11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు
జిల్లాలో 3 లక్షల మందికి పైగా కార్మికులు సమ్మెలోకి
నెల్లూరు(సెంట్రల్):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నాయి. కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారుతున్న ప్రభుత్వాలపై నిరసన బాణాన్ని సంధించనున్నాయి.
డిమాండ్ల సాధనే లక్ష్యం
చిన్న ప్రమాదం జరిగినా భారీ మొత్తంలో జరిమానా, జైలు శిక్ష విధించే విధంగా రూపొందించిన బిల్లును ఉపసంహరించాలి.
ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలను యజమాన్యాలకు అనుకూలంగా మార్చే ప్రక్రియను తొలగించాలని, 7వ వేతన కమిషన్ నిర్ణయించిన ప్రకారం కార్మికునికి కనీసం వేతనం రూ.18 వేలు ఇచ్చే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. టీం వర్కర్లుగా పని చేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలి.
రైల్వే, రక్షణ, భీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోక్యాన్ని నివారించాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. సామాన్య, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
11 కేంద్ర కార్మిక సంఘాల మద్దతు
ఈనెల 2న తలపెట్టిన సమ్మెకు దేశ వ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. వీటితో పాటు సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐద్వా, లారీ వర్కర్స్యూనియన్ సమ్మెలో పాల్గొంటున్నాయి. జిల్లాలో అన్ని శాఖల్లో పనిచేసే కార్మికులు, భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు దాదాపు 3 లక్షల మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
ప్రతి ఒక్కరూ సహకరించాలి– పార్థసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి
వామపక్షాల ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పేద, మధ్య తరగతి వారి కోసమే ఈ సమ్మె చేస్తున్నాం. అర్థం చేసుకుని సమ్మెలో పాల్గొనాలి.
కార్మికుల సంక్షేమం కోసమే సమ్మె – కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
కార్మికుల సంక్షేమం కోసమే సమ్మె చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీని వల్ల సామాన్య, పేద, మధ్య తరగతి వారు జీవనం సాగించాలంటే ఇబ్బంది కరంగా ఉంది.