చేసే పనీ.. చేటు చేయొచ్చు.. జలుబు నుంచి క్యాన్సర్ దాకా..
ఒక వ్యక్తి రోజులో ఎక్కువ భాగం గడిపే చోటు ఏదైనా ఉందంటే అది ఉద్యోగం/ వృత్తిపరమైన విధులు నిర్వర్తించే ప్రదేశమే. ఎవరికైనా ఇది తప్పనిసరే అయినా.. ఆయా ఉద్యోగాలు/వృత్తి ప్రదేశాలకు వ్యక్తుల అనారోగ్యాలకు సంబంధం ఏర్పడుతోంది. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే దాకా.. వివిధ ఉద్యోగాలు, వృత్తుల ప్రభావం పడుతోంది. ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యే వరకు కూడా చాలా మంది ఈ సమస్యను గమనించలేని పరిస్థితి ఉంటుంది.
ఇటీవలికాలంలో వృత్తి వ్యాపకాల ప్రభావం గతంలో కంటే మరింత పెరిగిందని.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. వీటినే ఆక్యుపేషనల్ హజార్డ్స్గా చెప్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆక్యుపేషనల్ హెల్త్‌పై అవగాహన కలిగిస్తున్న పలు సంస్థల అధ్యయనాలు ఏయే రంగాల్లో పనిచేస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నది తేల్చి చెప్తున్నాయి. వాటి ప్రకారం..
– సాక్షి, హైదరాబాద్
అనారోగ్య ‘గనులు’..
గనులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారు పీల్చే కలుషిత గాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఎన్ని జాగ్రత్తలు, గట్టి టోపీలు, అగ్నిమాపక భద్రత పరికరాలు, గాగుల్స్ వంటివి వాడినా ప్రమాదం తప్పని పరిస్థితే ఉంటోందని నిపుణులు తేల్చారు.
సమస్యల కర్మాగారాలు..
కర్మాగారాల్లో భారీ యంత్రాలు, ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. పెద్ద శబ్దాలు వెలువడతాయి. ఇవన్నీ వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమే. ఫ్యాక్టరీ కారి్మకులు, మేనేజర్లు లేదా ఫ్లోర్ వర్కర్లలో వినికిడి లోపం సాధారణంగా మారుతోంది.
భవన నిర్మాణం.. ఆరోగ్య ధ్వంసం..
నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరికీ, వారు కార్మికులు, ఉద్యోగులు, డిజైనర్లు ఎవరైనా సరే.. ఎక్కువసేపు అక్కడే గడిపితే ప్రమాదకరమే. సిమెంట్, మట్టి, ఇసుక ధూళి, పెయింట్లు, మరికొన్ని నిర్మాణ ఉత్పత్తులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి.
బిపీఓలలో.. బాడీ క్లాక్‌కు బ్రేక్..
బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) సెంటర్లలో రాత్రి షిఫ్టులలో పనిచేయడం, నిరంతర రాత్రి షిఫ్టులు, తరచూ షిప్టులు మారడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పగటిపూట నిద్రపోతున్నా, షిఫ్టులు మారుతున్నా శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతోంది. రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్‌తోపాటు సెప్టిక్ అల్సర్లు,
గ్యా్రస్టిక్ అల్సర్లు వస్తున్నాయి.
శుభ్రత.. ఆరోగ్యానికి లేదు భద్రత..
విభిన్న రకాల ఆవరణలను శుభ్రపరిచే వారికీ ఆరోగ్యపు ముప్పు తప్పడం లేదు. టాయిలెట్, బాత్రూం, ఫ్లోర్ క్లీనర్లు వాడినప్పుడు విష వాయువులు వెలువడతాయి. అవి చాలా ప్రమాదకరం.
కంప్యూటర్.. వెన్నెముక కష్టాలు..
కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి వెన్ను భాగం, చేతులు, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఈ రకమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నవారు పెరిగారు. చాలా మంది వెన్నెముక సమస్యలు, స్లిప్డ్ డిస్క్, కండరాల ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
పూల డిజైనర్‌కూ డేంజర్..
అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ పూల డిజైనర్ వృత్తి కూడా సమస్య రేపేదే. పూల డిజైనర్ కాండం నుంచి పూలను కత్తిరించి, అందంగా అమర్చే సమయంలో వాటికి దగ్గరగా ఉంటారు. ఆ పూల మొక్కల కోసం వినియోగించే బలమైన పురుగుమందుల ప్రభావానికి లోనవుతారు.
వినికిడికి.. ‘ధ్వని’ దెబ్బ..
ఎక్కువ ధ్వని వెలువడే పరిశ్రమలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు వినికిడి సమస్యల బారినపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏవైనా పరిశ్రమల్లో ఒక ఉద్యోగి 8గంటల పాటు 90 డెసిబుల్స్ ధ్వనిలో పనిచేయవచ్చు. 95 డెసిబుల్స్ ఉంటే 4 గంటలు, 100 డెసిబుల్స్ ఉంటే 2 గంటలు మాత్రమే పనిచేయాలి. అదే 115 డెసిబుల్స్, ఆపైన తీవ్రతతో ధ్వని ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. అంతేకాదు.. ఇయర్ ప్లగ్స్, ఇయర్ కెనాల్స్ వంటివి వాడాలి.
వృత్తికో వ్యాధి తప్పట్లేదు
అనేక రకాల పరిశ్రమలు, రంగాలు, వృత్తులు, ఉద్యోగాలు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి.
►ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు, అతిగా నిలబడడం వల్ల వెరికోసిటీస్, వినికిడి సమస్యలు వస్తున్నాయి.
►పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. గట్టిగా మాట్లాడుతూ బోధించడం వల్ల గొంతు సమస్యలూ కనిపిస్తున్నాయని అంటున్నాయి.
► లారీలు, కంటైనర్లు వంటి భారీ వాహనాల డ్రైవర్లకు వెన్ను సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, వాహనాల వైబ్రేషన్ వల్ల రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. కన్నార్పకుండా రోడ్లను చూస్తూ ఉండటం వల్ల కళ్లు పొడిబారుతూ దృష్టి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు.
►సిలికా పరిశ్రమలో పనిచేసేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన సిలికోసిస్‌కు గురవుతారు. ఆస్బోస్టాస్ పరిశ్రమల్లో పనిచేసేవారు పలు రకాల కేన్సర్లకు, చక్కెర పరిశ్రమలో పనిచేసేవారు పెగసోసిస్ వంటివాటికి గురవుతారు.
ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు
‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చేస్తున్న ఉద్యోగం/వృత్తి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గుర్తించి.. వాటి నుంచి తప్పించుకునే అంశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.. మధ్యలో కాసేపు లేచి నడవడం, దూరంగా ఉన్న వస్తువులను చూడటం, వీలైతే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదన్నారు. అపరిశుభ్ర, కాలుష్య పరిస్థితుల్లో పనిచేసేవారు మాస్కులు, గ్లౌజులు వంటివి కచ్చితంగా వాడాలన్నారు. వైద్యులను సంప్రదించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు తీసుకుని పాటించాలని స్పష్టం చేస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
వృత్తి, ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటి పై తరచుగా అవగాహన సద స్సులు నిర్వహిస్తున్నాం. గత వారం ట్రాఫిక్ పోలీసులకు వచ్చే సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశాం. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రొఫెషన్ల వల్ల కూడా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ తరహా ఆక్యుపేషనల్ హజార్డ్స్‌కు చికిత్సలు లేవు. అందువల్ల ఆయా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు అవగాహన పెంచుకుని, జాగ్రత్తలు పాటించాలి.
– డాక్టర్ విజయ్‌రావు, జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్