‘కూలి’ పోతున్నారు
దుర్భరమవుతున్న ఇటుక బట్టీ కూలీల జీవనం
ఒక ఇటుక తయారీ కూలీ 25 పైసలు
అలా 1000 చేస్తే వచ్చేది రూ.250
రామచంద్రాపురం: ఇల్లు నిర్మించాలంటే ఇటుకలు కావాలి. కానీ ఇటుకలు తయారీ అంత ఆషామాషీ కాదు. ఎర్రని ఎండలో ఇటుక కూలీలు రోజుల తరబడి కష్టపడితే గాని ఇటుక తయారీ సాధ్యపడదు. కానీ ఇంతా చేసిన ఆ కూలీల బతుకులు మాత్రం నానాటికీ దుర్భరమవుతున్నాయి. మండలంలోని సొరకాయలపాలెం, అనుప్పల్లి, సి.రామాపురం, గంగిరెడ్డిపల్లి, నడవలూరు గ్రామ పంచాయతీలలో ఇటుకల తయారీ కంపెనీలు ఉన్నాయి. కానీ ఇటుకలు తయారు చేయడానికి అనంతపురం, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూలీలు తరలివచ్చి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. యజమానులు కూలీలు తక్కువగా ఇచ్చి వారి కష్టాన్ని దోచుకుంటున్నారు.
ఒక ఇటుక తయారీకి 25 పైసలు
ఒక ఇటుకరాయిని తయారు చేస్తే కూలీలకు ఇచ్చేది 25 పైసలే. రోజుకు 1000 రాళ్లు చేస్తే రూ.250 మాత్రమే ఇస్తున్నారు. కానీ మార్కెట్‌లో ఇటుకరాయి రూ.5కు అమ్ముతున్నారు. దీంతో రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదని కూలీలు వాపోతున్నారు. కాస్త వయసు మళ్లినవారు రోజుకు 1000 ఇటుకలు చేయడం సాధ్యం కాదని, ఇచ్చే కూలీ మరీ తక్కువ ఉండడం వల్ల మూడు పూటల అన్నం తినలేకపోతున్నామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పైగా ఇటుక బట్టీల యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కూడా చెల్లించడం లేదు. ఇటుకలు కాల్చడానికి గ్రామాల్లో దొరికే బొగ్గు, కలపను వాడుతున్నారు. ఇలా ఇటుక బట్టీల యజమానులు కూలీలు కష్టాన్ని దోచుకుని లాభాలను గడిస్తున్నారు.
కష్టానికి తగ్గ కూలీ ఇవ్వడం లేదు
ఇటుక తయారీకి చాలా కష్టపడాలి. కానీ చాలీ చాలని కూలీలతో కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నాం. ఈ పనే మాకు అల వాటైపోయింది. వేరే వృత్తి చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ మా కష్టానికి తగ్గ కూలీ ఇవ్వడం లేదు. - బి.రామాంజనేయులు,
తాడిపత్రి, అనంతపురం జిల్లా
ఇటుకల తయారీనే జీవనం
తరతరాలుగా మా కుటుంబాలకు తెలిసింది ఇటుకల తయారీ చేయడమే. అందుకే మమ్మల్ని ఇటుకల తయారీ పనులకు పంపారు. ఇటుకల తయారీ పనులు రెండు నెలల పాటు నిరంతరంగా ఉంటాయి. కూలీలు పెంచితే సంతోషంగా వుంటుంది. - సూరిబాబు, తాడిపత్రి, అనంతపురం జిల్లా