యంత్రాలకు ‘ఉపాధి’
ఊటకుంటల తవ్వకాల్లో అక్రమాలు
కూలీలకు బదులుగా యంత్రాలతో పనులు
బినామీ మస్టర్లతో నిధుల స్వాహా
అధికార పార్టీ నేతల హవా
ఉదయగిరి : గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది.కూలీలకు ఎంపిక చేసిన పనుల ద్వారా ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం నిబంధనలను గాలికొదిలేసింది. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించి టీడీపీ కార్యకర్తల జేబులను నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అధికారులు చేతులెత్తేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే ఊటకుంటల పనులను యంత్రాలతో చేపడుతూ బినామీ మస్టర్లతో నిధులు స్వాహా చేస్తున్న తంతు ఉదయగిరి నియోజకవర్గంలో య«థేచ్ఛగా సాగుతోంది. ఈ పనులు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం విశేషం. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో నేతల కన్ను వీటిపై పడింది. ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తుండడంతో అవినీతికి అంతులేకుండా పోతోంది.
జిల్లాలో 22,087 ఊటకుంటలు తవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.128.43 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 5467 కుంటల పనులు ప్రారంభించి రూ.10.70 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 791 ప్రస్తుతానికి పూర్తయ్యాయి. జిల్లాలోని 40 మండలాల్లో ఊటకుంటలను తవ్వేందుకు అనుమతులు మంజూరుచేశారు. ఇందులో భాగంగా ఒక్క ఉదయగిరి ప్రాంతానికే పది వేల కుంటలను మంజూరుచేశారు. ఈ పనులను ఉపాధి కూలీలతో చేయించాల్సి ఉన్నప్పటికీ ఉదయగిరి, సీతారామపురం, కలిగిర, వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం, తదితర మండలాల్లో యంత్రాలతో పనులు చేస్తున్నారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో పనులు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాత్రివేళల్లో పనులు:
యంత్రాలతో పగటిపూట పనులు చేయిస్తే కూలీల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో రాత్రి వేళల్లో తవ్వకాలు చేపడుతున్నారు. పగటి వేళ కొంతమంది కూలీలను పెట్టి తుది మెరుగులు దిద్దుతున్నారు. అనంతరం తమకు అనుకూలమైన గ్రూపులను ఎంపిక చేసుకుని బినామీ మస్టర్లతో నిధులు కాజేస్తున్నారు. ఉదయగిర మండలంలోని తిరుమలాపురం, జి.అయ్యవారిపల్లి, దేకూరుపల్లి, జీ చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, జీ అయ్యవారిపల్లి, వరికుంటపాడు మండలంలోని రామాపురం, కొండాయపాళెం, వరికుంటపాడు, తదితర గ్రామాల్లో ఈ తరహాలతో యంత్రాలతో పనులు చేయించి నిధులు స్వాహా చేస్తున్నారు.
పరస్పర సహకారం
ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు, నేతలు ముందుగా పరస్పర అవగాహనతో యంత్రాలతో పనులు చేస్తున్నారు. నేతలు ముందుగా యంత్రాలతో నీటి కుంటలను తవ్విస్తారు. ఆ తర్వాత కూలీలతో తుదిమెరుగులు దిద్దుతారు. యంత్రాలతో చేపట్టిన పనుల విషయమై గ్రామస్తులు ఎవరైనా అధికారుల్ని నిలదీస్తే ఆ పనులతో తమకు సంబంధం లేదని, మస్టర్లు వేసేది లేదని చెబుతారు.అంతా సర్దుమణిగిన తర్వాత నెలకో రెండు నెలలకో మస్టర్లు వేసి నిధులు స్వాహా చేస్తారు. ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో యంత్రాలతో నీటికుంటల పనులు చేస్తున్న విషయం తెలుసుకున్న కూలీలు అక్కడికెళ్లి పనులు ఆపివేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్వామా పీడీ అసంతృప్తి
ఇటీవల నియోజకవర్గంలోని వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డ్వామా పీడీ హరిత పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి కుంటలను యంత్రాలతో నిర్మించినట్లుగా క్షేత్రస్థాయిలో ఆమె గుర్తించినా ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా కూలీలతో పనులు చేయించాలని, లేకపోతే చర్యలు తప్పవని పరోక్షంగా అధికారుల్ని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా కూలీలతో చేయించాల్సిన ఉపాధి పనులను యంత్రాలతో చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి యంత్రాలతో పనులు చేపట్టకుండా కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.
యంత్రాలతో పనులు చేయిస్తే చర్యలు తప్పవు– వీరాస్వామి, ఎంపీడీఓ, ఉదయగిరి
కూలీలతో తవ్వించాల్సిన ఊటకుంటలను యంత్రాలతో చేపడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. యంత్రాలతో పనులు చేపడుతుంటే కూలీలు తమ దృష్టికి తీసుకురావాలి. ఉపాధి పనులను పారదర్శకంగా చేయించే ప్రయత్నం చేస్తున్నాం.