World Athletics Woman Championship
-
హాఫ్ మారథాన్‌లో పెరెస్ ప్రపంచ రికార్డు
గిడినియా (పోలాండ్): ప్రపంచ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కెన్యా అథ్లెట్ పెరెస్ జెప్చిర్చిర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన రేసులో 27 ఏళ్ల పెరెస్ 21.0975 కిలోమీటర్ల దూరాన్ని గంటా 5 నిమిషాల 16 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న ప్రేగ్లో గంటా 5 నిమిషాల 34 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును పెరెస్ తిరగరాసింది. కెజెటా (జర్మనీ–1గం:05ని.18 సెకన్లు), యాలెమ్జెర్ఫ్ యెహుఅలావ్ (ఇథియోపియా–1గం:05ని.19 సెకన్లు) రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలో జేకబ్ కిప్లిమో (ఉగాండా) 58 నిమిషాల 49 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ హాఫ్ మారథాన్‌లో టైటిల్ నెగ్గిన తొలి ఉగాండా రన్నర్‌గా కిప్లిమో గుర్తింపు పొందాడు. -
200 మీటర్ల విజేత షిపెర్స్
మహిళల 200 మీటర్ల విభాగంలో నెదర్లాండ్స్ అథ్లెట్ డాఫ్ని షిపెర్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం నెగ్గిన షిపెర్స్ శనివారం జరిగిన 200 మీటర్ల ఫైనల్ రేసును 22.05 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. మరియా జోస్ (ఐవరీకోస్ట్–22.08సె.) రజతం, షానీ మిల్లర్ (బహమాస్–22.15 సె.) కాంస్యం గెలిచారు. మెర్లీన్ ఒట్టీ (జమైకా), అలీసన్ ఫెలిక్స్ (అమెరికా) తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల విభాగంలో వరుసగా రెండుసార్లు స్వర్ణం గెలిచిన మూడో అథ్లెట్‌గా షిపెర్స్ గుర్తింపు పొందింది. మహిళల లాంగ్‌జంప్‌లో బ్రిట్నీ రీస్ (అమెరికా–7.02 మీటర్లు)... పురుషుల హ్యామర్ త్రోలో పావెల్ (పోలాండ్–79.81 మీటర్లు)... మహిళల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌లో ఎమ్మా కోబర్న్ (అమెరికా–9ని:02.58 సెకన్లు) స్వర్ణాలు నెగ్గారు.