World Cancer Day 2025: కేన్సర్‌ని ముందే పసిగట్టేద్దాం ఇలా..!
కేన్సర్ ఉందని కనుగొనడమే క్యాన్సర్‌ను నయం చేసుకోవడం. ఒకప్పుడు దాదాపు 10 శాతం కేన్సర్లకే చికిత్స అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 10 శాతం క్యాన్సర్లు మాత్రమే చికిత్సకు లొంగనివి అని చెప్పవచ్చు. మిగతా అన్ని కేన్సర్లనూ దాదాపు నయం చేయవచ్చు. కాకపోతే కేన్సర్‌ను వీలైనంత త్వరగా అంటే... దాని నాలుగు దశల్లో... మొదటి లేదా కనీసం రెండోదశలోనైనా కనుక్కోవాలి. అప్పుడే ‘కేన్సర్ ఉందని కనుగొనడమే... కేన్సర్‌ను నయం చేసుకోవడం’ అనే మాట వర్తిస్తుంది. అయితే కేన్సర్ అంటూ గుర్తించడానికి ప్రత్యేకంగా లక్షణాలుండకపోయినప్పటికీ... ఏయే లక్షణాలను బట్టి కేన్సర్‌ను అనుమానించవచ్చు? అలా ఆ కేన్సర్స్ను ముందుగానే గుర్తించడమెలా? మహిళలకూ, పురుషులకూ లేదా ఈ ఇద్దరిలోనూ వచ్చే సాధారణ కేన్సర్లేమిటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోడానికి ఉపయోగపడే ప్రత్యేక కథనమిది.కొన్ని కేన్సర్ లక్షణాలే... మామూలు ఇతర జబ్బుల్లోనూ కనిపిస్తాయి. ఉదాహరణకు బరువు తగ్గడం, దగ్గు లాంటి మామూలు లక్షణాలే కనిపించడం. మరి ముందే... అంటే ప్రారంభ దశల్లోనే కేన్సర్‌ను పసిగట్టడానికి స్క్రీనింగ్ పరీక్షలేమిటి,అవి ఎవరెవరికి ఎప్పుడు చేయించాలో చూద్దాం. మహిళలకే అవసరమైన స్క్రీనింగ్స్ పరీక్షలివి... సర్వికల్ కేన్సర్:... సర్వికల్ రూన్సర్కే ఉన్న ఓ ప్రత్యేకత ఏమిటంటే... ఇది వచ్చేందుకు కనీసం పదేళ్ల ముందుగానే రాబోతోందని గుర్తించవచ్చు. అంటే సుదీర్ఘమైన ప్రీ–కేన్సరస్ దశ దీనికి ఉంటుంది. అందుకే దీన్ని రాకముందే పసిగట్టవచ్చు. అందుకు చేయించుకోవాల్సిందల్లా పాప్ స్మియర్ అనే ఓ మామూలు పరీక్ష. ప్రతి మహిళా 25 ఏళ్లు దాటిన నాటి నుంచి ప్రతి మూడేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకుంటూ ఉండటమే సర్వైకల్ కేన్సర్‌కు స్క్రీనింగ్.రొమ్ము కేన్సర్:(నిజానికి రొమ్ము కేన్సర్ మహిళలతోపాటు పురుషులలోనూ కనిపించినప్పటికీ వారిలో కాస్త అరుదు) రొమ్ము క్యాన్సర్ విషయంలో వయస్సుకూ వ్యాధికీ సంబంధం ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు (రిస్క్) పెరుగుతుంటాయి.రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎవరెవరిలోనంటే... పిల్లలు లేనివాళ్లు ముప్ఫయి ఏళ్లు దాటాక మొదటి బిడ్డను కన్న మహిళలు తమ కుటుంబం ఈ వ్యాధి వచ్చిన వారున్నప్పుడు... పైన పేర్కొన్న వాళ్లంతా రొమ్ము క్యాన్సర్‌కు రిస్క్ గ్రూప్. ఈ రిస్క్ గ్రూపులు ప్రతి నిత్యం మూడు పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. అవి... మొదటిది... ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమరొమ్మును కుడిచేత్తో, కుడిరొమ్మును ఎడమచేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో రొమ్ములో ఏ చిన్నమార్పు వచ్చినా డాక్టర్ కంటే ముందే... తమకే తెలిసిపోతుంది. ఫలితంగా ముందస్తు లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరగా కనిపెట్టగలరు. ఇతరత్రా కాస్తంత తేడా ఏమైనా ఉంటే దాన్ని డాక్టర్/గైనకాలజిస్ట్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. రెండోది... మామోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు.ఇది ఎవరికి అవసరం అంటే... ముప్ఫయి ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్ చేయించాలి ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి. ఆ తర్వాత 40 ఏళ్ల నుండి 50వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండటం మంచిది. ఇక 50 ఏళ్లు వచ్చాక ఏడాది కోమారు చేయించడం మంచిది మరీ ఎక్కువ రిస్క్ ఉన్నవారు తమ డాక్టర్ సలహా మేరకు ఇంకా త్వర త్వరగానే పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఇక మూడో రకానికి చెందిన ఈ పరీక్షలు... చాలా చాలా హై రిస్క్ గ్రూపువాళ్లకు... ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని భావించిన మహిళలకు వాళ్ల డాక్టర్లు... బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జీన్ మ్యూటేషన్స్ తాలూకు జన్యుపరీక్షలు చేయిస్తుంటారు. తల నుంచి కాలివరకు తొలి దశలోనే గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి... తల భాగంలో... ఈ కేన్సర్స్ నోట్లో, దవడ, నాలుక మీద లేదా చిగుళ్లు (జింజివా) మీద ఎక్కడైనా రావచ్చు. ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. కొన్నిసార్లు పుండ్లు కూడా ఉండవచ్చు. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్ గ్రంథుల వాపు.బ్రెయిన్ కేన్సర్‌లో... శరీరంలోని అన్ని భాగాలకు లాగే మెదడుకూ కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, విషయాలు గుర్తుంచుకోకపోవడం, కొన్నిసార్లు సాంఘిక, సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాటకూ, చేతలకు, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయన్న విషయం తెలిసిందే. మెదడులో... కేన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ ఏ అవయవానికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.గొంతు భాగంలో... దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఉన్న అనుభూతి ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది. కడుపు (స్టమక్)లో... అదే కడుపు (స్టమక్)లో అయితే మంట పుడుతున్నట్లుగా ఉండే నొప్పి. పొట్టలో మంట. పొట్టలో రక్తస్రావం అవుతుంది కాబట్టి ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతోపాటు కొన్నిసార్లు కొంచెం తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్. పేగుల్లో... మల మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు రావడం జరుగుతుంది. రెక్టమ్ కేన్సర్‌లో... మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం ఉన్నట్లుగా మెదడుకు సమాచారం చేరవేస్తాయి. దాంతో విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. అయితే విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు చేరవేస్తాయి. దాంతో ఇంకా ఏదో అక్కడ మిగిలి ఉందన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు బంక విరేచనాలు, రక్తంతోపాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఊపిరితిత్తుల్లో... ఊపిరితిత్తుల కేన్సర్ విషయంలో పొగతాగేవారికి అది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఈ కేన్సర్ ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లెలో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీస్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ఒవేరియన్ కేన్సర్‌లో... దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కిందిభాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి కేన్సర్ వస్తే ఏ లక్షణాలూ చూపించకుండానే ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని ‘సైలెంట్ కిల్లర్’గానూ అభివర్ణిస్తుంటారు. టెస్టిస్ కేన్సర్‌లో... పురుషుల్లో వచ్చే ఈ కేన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడి పెద్దగా సీరియస్‌గా తీసుకోక΄ోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. కిడ్నీ అండ్ బ్లాడర్ కేన్సర్స్‌లో... మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ కేన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం. బ్లడ్ కేన్సర్‌లో... రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ కేన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద డ, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్‌కేన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కిందిభాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు. చర్మం కేన్సర్‌లో... చర్మం కేన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, దాన్ని చర్మం కేన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.హెడ్ అండ్ నెక్ కేన్సర్స్ స్క్రీనింగ్ కోసం... మన దక్షిణ భారతదేశంలోని పురుషుల్లో కోలోరెక్టల్ కేన్సర్ తర్వాత చాలా ఎక్కువగా కనిపించేవి హెడ్, నెక్ కేన్సర్లే. పురుషుల్లో పొగాకు, ఆల్కహాల్ అలవాట్లు చాలామందిలో ఉంటాయి కాబట్టి ఈ క్యాన్సర్లు మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఒకసారి హెడ్ అండ్ నెక్ రూన్సర్ వచ్చిన వారు ఏడాదికోసారి డాక్టర్‌ను కలిసి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకసారి వచ్చి తగ్గినవాళ్లు ఆ మొదటి ఏడాదిలో ప్రతి మూడు నెలలకొకసారి, ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ప్రతి ఆర్నెల్లకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. హెడ్ అండ్ నెక్ స్క్రీనింగ్ కోసం పరీక్షల్లో కొన్ని: సాధారణంగా తలకు చేసే ఎమ్మారై, సీటీలతో పాటు కొన్ని రక్తపరీక్షలు, పనోరమిక్ డెంటల్ ఎక్స్–రే, డెంటల్ కోన్ బీమ్ సీటీ, అవసరాన్ని బట్టి పెట్/సీటీ పరీక్షలతోపాటు ఎండోస్కోపీ, బయాప్సీ (తలలో అనుమానం ఉన్నచోటి నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించడం). ఊపిరితిత్తుల కేన్సర్... ఇది ముఖ్యంగా మనదేశంలోని పురుషుల్లో చాలా ఎక్కువ. ఇక సిగరెట్ / బీడీ/ చుట్ట / ఇతరత్రా పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లలో మరీ ఎక్కువ. తమ పొగతాగే అలవాటునే ఈ క్యాన్సర్‌కు హైరిస్క్‌గా పరిగణించాలి. ఈ అలవాటున్నవాళ్లు తమలో ఎలాంటి అసౌకర్యంగాని, దగ్గు వంటి లక్షణాలుగాని కనిపిస్తే తక్షణం పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ చెస్ట్ ఎక్స్–రే, స్ఫూటమ్ సైటాలజీ పరీక్షతోపాటు హై రెజల్యూషన్ సీటీ స్కాన్ ద్వారా దీన్ని కనుగొంటారు. స్టమక్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం... ఈ కింద పేర్కొన్న గ్రూపులు స్టమక్ క్యాన్సర్ రావడానికి మరింత ఎక్కువ ముప్పు కలిగి ఉంటారు. ఈ హైరిస్క్ వర్గాలవారు ఎవరంటే... ‘పర్నీసీయస్ ఎనిమియా’ అనే ఒక తరహా రక్తహీనతతో బాధపడుతూ, కాస్తంత వయసు పైబడ్డవారు. గతంలో అల్సర్‌కు ఆపరేషన్ (గ్యాస్ట్రెక్టమీ) చేయించుకున్నవారు. ‘ఫెమీలియల్ అడెనోమేటస్ పాలింపోసిస్’ తరహా పాలిప్స్ (కండ పెరిగిన) వాళ్లు హెలికోబాక్టర్ పైలోరీ (హెచ్ పైలోరీ) అనే సూక్ష్మజీవి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినవాళ్లు... అవసరమైన స్క్రీనింగ్ పరీక్ష : పైన పేర్కొన్నవాళ్లంతా కడుపులో కేన్సర్ కనుక్కోవడానికి తరచూ ‘డబుల్ కాంట్రాస్ట్ బేరియం’ పరీక్ష, ఎండోస్కోపీ చేయించుకుంటూ ఉండాలి. పై రిస్క్ గ్రూపులతో పాటు ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకునేవాళ్లు, పొగతాగే అలవాటున్నవాళ్లూ, ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సీ తక్కువగా తీసుకునేవారితో పాటు రబ్బరు పరిశ్రమల్లో, బొగ్గుపని చేసేవాళ్లు ఎక్కువగా తరచూ ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది. కేన్సర్లను గుర్తించేందుకు కొన్ని సాధారణ లక్షణాలు ... కారణం తెలియకుండానే అకస్మాత్తుగా బాగా బరువు తగ్గడం ఆకలి తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు ∙ఆయా అవయవాల్లోంచి రక్తస్రావం... ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ చాలామందిలో సాధారణ సమస్యలకూ కనిపిస్తాయి కాబట్టి ఇవి కనిపించగానే అది క్యాన్సరేనేమో అంటూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాక΄ోతే స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకుని, అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండవచ్చు.