వాయు కాలుష్యంతో కేన్సర్ ముప్పు
ఆగ్నేయ ఆసియా దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
న్యూఢిల్లీ: వాయు కాలుష్యంతో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అధికంగా ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 కాలుష్య నగరాల్లో ఆగ్నేయాసియాలో 14 ఉన్నాయి. ప్రపంచంలో ఏటా 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నాని, వీటిల్లో మూడింట రెండో వంతు మరణాలు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లోనే ఉన్నాయంది. మరణాల్లో 22 శాతం పొగాకు, దాని ఉత్పత్తులు వాడకంతో సంభవిస్తున్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా రీజియన్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, డీపీఆర్ కొరియా, ఇండోనేసియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఉన్నాయి.
ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో కార్మికులకు సూర్య కిరణాలు, కేన్సర్ కారక రసాయనాల నుంచి రక్షణ లేదు. మద్యపానం, అనారోగ్యకర ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. పొగాకు, మద్యం వాడకం తగ్గించే దిశగా, పర్యావరణ పరిస్థితుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలు తేవాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు. ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. అలాగే హ్యూమన్ పాపిలోమ వైరస్ (హెపీవీ), హెపటైటిస్ బి, సీ, హెలికోబక్టర్ పైలోరి వల్ల వచ్చే వ్యాధులు కేన్సర్‌కు కారణాలుగా ఉన్నాయన్నారు.
కేన్సర్‌కు ఏటా 3.5 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: ప్రాణాంతక కేన్సర్ దేశంలో ప్రతి ఏడాది 3.5 లక్షల మందిని మింగేస్తోంది. హృద్రోగ సమస్యల తర్వాత ఇది దేశంలో రెండో ప్రాణాంతక వ్యాధి అని ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ రీసెర్చ్ (ఐఎస్‌సీఆర్) తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ కేన్సర్ నివేదిక 2015 ప్రకారం ఐఎస్‌సీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. ఏటా దాదాపు 7 లక్షల కొత్త కేన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో దాదాపు 3.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని వివరించింది. ఇంకో 10 నుంచి 15 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో కేన్సర్‌ను నయం చేసే, తొలి దశలోనే గుర్తించే కొత్త విధానాలను కనుగొనాల్సిన అవసరం ఉందని పేర్కొంది.