World chess tournament
-
కోనేరు హంపితో ప్రియాంక పోటీ! ముగిసిన హర్ష భరతకోటి కథ..
బకూ (అజర్బైజాన్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో రెండో రౌండ్‌కు చేరుకుంది. మరీనా బ్రునెల్లో (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్లో ప్రియాంక ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్‌లో 1.5–0.5తో గెలుపొందింది. టైబ్రేక్ తొలి గేమ్‌ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న ప్రియాంక, రెండో గేమ్‌లో 45 ఎత్తుల్లో మరీనాను ఓడించి ఓవరాల్‌గా 2.5–1.5తో విజయం అందుకుంది. క్లాసికల్ ఫార్మాట్లో వీరి ద్దరి మధ్య జరిగిన తొలి రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ గేమ్‌లను నిర్వహించారు. రెండో రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కోనేరు హంపితో ప్రియాంక తలపడుతుంది. ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి కథ తొలి రౌండ్లోనే ముగిసింది. లెవాన్ పాంట్సులెయ (జార్జియా)తో టైబ్రేక్ తొలి గేమ్‌లో హర్ష 75 ఎత్తుల్లో ఓడిపోయి, రెండో గేమ్‌ను 66 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని 0.5–1.5తో ఓటమి చవిచూశాడు. -
చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు షాక్
చెన్నై: ఆన్లైన్ వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో గత ఏడాది సంయుక్త విజేత భారత జట్టుకు చుక్కెదురైంది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో 1.5–4.5తో పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించినా ఆమె సహచరులు తడబడటంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ముందుగా తొలి రౌండ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1తో అమెరికాను ఓడించి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. హారిక 68 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీపై, విశ్వనాథన్ ఆనంద్ 57 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్‌పై, పెంటేల హరికృష్ణ 53 ఎత్తుల్లో దరియజ్పై, వైశాలి 38 ఎత్తుల్లో థలియా లాండిరోపై గెలుపొందారు. కోనేరు హంపి 29 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, నిహాల్ సరీన్ 70 ఎత్తుల్లో లియాంగ్ అవండర్లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 2–4తో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. హారిక 51 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై నెగ్గగా... హంపి 32 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, వైశాలి 60 ఎత్తుల్లో థలియా లాండిరోతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో లియాంగ్ చేతిలో, విదిత్ 46 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో, ఆనంద్ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో ఓడిపోయారు. నిర్ణాయక ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో హారిక 34 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై గెలుపొందగా... నిహాల్ 44 ఎత్తుల్లో లియాంగ్‌తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. వైశాలి 31 ఎత్తుల్లో థలియా చేతిలో, హరికృష్ణ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో, హంపి 49 ఎత్తుల్లో ఇరీనా క్రష్ చేతిలో, ఆధిబన్ 33 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో ఓటమి చవిచూశారు. మరో సెమీఫైనల్లో రష్యా 2–0తో చైనాను ఓడించి నేడు జరిగే ఫైనల్లో అమెరికాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. -
హంపి శుభారంభం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజయంతో శుభారంభం చేయగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో సరిపెట్టుకుంది. హయత్ తుబాల్ (అల్జీరియా)తో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో హంపి 46 ఎత్తుల్లో గెలిచింది. సోపికో ఖుఖాష్‌విలి (జార్జియా)తో జరిగిన తొలి గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. జన్సాయా అబ్దుమలిక్ (కజకిస్తాన్)తో జరిగిన తొలి గేమ్‌ను భారత్‌కే చెందిన పద్మిని రౌత్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... నటాలియా పొగోనినా (రష్యా)తో జరిగిన తొలి గేమ్‌లో భక్తి కులకర్ణి 63 ఎత్తుల్లో ఓడిపోయింది. ఆదివారం ఈ జోడీల మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. హంపి తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంటే తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. హారిక, పద్మిని రౌత్‌లు మాత్రం ముందంజ వేయాలంటే... టోర్నీలో నిలబడాలంటే భక్తి కులకర్ణి రెండో గేమ్‌లో తప్పకుండా గెలవాలి. ఒకవేళ హారిక, పద్మిని తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంటే మాత్రం సోమవారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు. -
రన్నరప్ ప్రజ్ఞానంద
ప్రపంచ చెస్ చరిత్రలో పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన రెండో ప్లేయర్‌గా... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా శనివారం కొత్త రికార్డు నెలకొల్పిన భారత కుర్రాడు ప్రజ్ఞానంద గ్రెడైన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఇటలీలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో 12 ఏళ్ల ప్రజ్ఞానంద 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్ కూడా సంపాదించాడు. ఈ టోర్నీలో అతను ఆరు గేముల్లో గెలిచి, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. -
హరికృష్ణ గేమ్ ‘డ్రా’
బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ సేతురామన్‌తో సోమవారం జరిగిన తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 74 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మంగళవారం వీరిద్దరి మధ్యే జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ‘డ్రా’ అయితే, బుధవారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఆరుగురు బరిలోకి దిగగా... సూర్యశేఖర గంగూలీ, లలిత్‌బాబు, ఆధిబన్, విదిత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. -
రెండో రౌండ్లో హరికృష్ణ
బాకు (అజర్బైజాన్) : ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మాక్స్ ఇల్లింగ్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పోటీలో హరికృష్ణ 2-0తో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన తొలి గేమ్‌లో 72 ఎత్తుల్లో నెగ్గిన హరికృష్ణ, శనివారం జరిగిన రెండో గేమ్‌లో 59 ఎత్తుల్లో గెలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన లలిత్ బాబు తొలి రౌండ్లో 0.5-1.5తో రాడోస్లావ్ వొటాసెక్ (పోలండ్) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో భారత్‌కే చెందిన సేతురామన్‌తో హరికృష్ణ తలపడతాడు.