World Cup Archery Tournament
-
దీపిక... వరల్డ్ నంబర్‌వన్
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించినందుకు భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారికి తగిన ప్రతిఫలం లభించింది. సోమవారం విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27 ఏళ్ల దీపిక రికర్వ్ వ్యక్తిగత విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించింది. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంక్‌లో ఉన్న దీపిక తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు పురోగతి సాధించి 263.7 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌ను అందుకుంది. లీసా బార్బెలిన్ (ఫ్రాన్స్–225.5 పాయింట్లు) తొలి ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోగా... కాంగ్ చె యంగ్ (దక్షిణ కొరియా–208 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి 2012లో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన దీపిక ఆ తర్వాత నిలకడగా టాప్–10లో కొనసాగింది. పారిస్‌లో ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో దీపిక రికర్వ్ టీమ్ విభాగంలో, మిక్స్డ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు నెగ్గి ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు గెలిచిన తొలి భారతీయ ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో దీపిక అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలలో పతకాలు సాధించింది. కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే ఆమెను ఊరిస్తోంది. ప్రపంచకప్ టోర్నీలలో 35 పతకాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు... కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో ఒక పతకం... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు ఆమె సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో తొలి రౌండ్లో... వ్యక్తిగత విభాగంలో తొలి రౌండ్లో వెనుదిరిగిన దీపిక 2016 రియో ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో... వ్యక్తిగత విభాగంలో మూడో రౌండ్లో ఓడిపోయింది. వచ్చే నెలలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో దీపిక కేవలం వ్యక్తిగత విభాగంలో పోటీపడనుంది. -
ఆరేళ్ల తర్వాత...
పారిస్: ఆరేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్‌కప్ స్టేజ్–3 టోర్నీలో 32 ఏళ్ల అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. క్రిస్ షాఫ్ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 15 షాట్ల తర్వాత ఇద్దరూ 148–148తో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. ఇందులో క్రిస్ షాఫ్ 9 పాయింట్లు స్కోరు చేయగా... అభిషేక్ గురికి 10 పాయింట్లు వచ్చాయి. దాంతో పసిడి అభిషేక్ వశమైంది. 2015లో పోలాండ్‌లో జరిగిన వ్రోక్లా వరల్డ్‌కప్ టోర్నీలో చివరిసారి అభిషేక్ వ్యక్తిగత స్వర్ణం సాధించాడు. 2019 ఆసియా చాంపియన్‌షిప్ తర్వాత అభిషేక్ వర్మ బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే కావడం విశేషం. అంతకుముందు సెమీఫైనల్లో అభిషేక్ 146–138తో ఆంటోన్ బులయెవ్ (రష్యా)పై గెలుపొందాడు. -
సెమీస్‌లో దీపిక, అతాను దాస్
గ్వాటెమాలా సిటీ: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో పురుషుల, మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ ఆర్చర్లు, భార్యభర్తలైన దీపిక కుమారి, అతాను దాస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో దీపిక కుమారి 6–0తో మిచెల్లి క్రాపెన్ (జర్మనీ)పై గెలుపొందగా... అంకిత 2–6తో అలెజాండ్రా వలెన్సియా (మెక్సికో) చేతిలో ఓడిపోయింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో 6–4తో ఎరిక్ పీటర్స్ (కెనడా)పై గెలుపొందాడు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రెండో రౌండ్లో 5–6తో డానియల్ క్యాస్ట్రో (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల టీమ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత జట్టు 4–5తో గార్సియా, క్యాస్ట్రో, పాబ్లోలతో కూడిన స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో మహిళల జట్టు మహిళల టీమ్ విభాగంలో దీపిక కుమారి, అంకిత, కోమలికలతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో టీమిండియా 6–0తో ఇలియా, ఇనెస్, లెరీ ఫెర్నాండెజ్‌లతో కూడిన స్పెయిన్‌పై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–0తో నాన్సీ, సింతియా, కామిలాలతో కూడిన గ్వాటెమాలా జట్టును ఓడించింది. -
దీపికకు కాంస్యం
అంటాల్యా (టర్కీ) : ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక కుమారి కాంస్య పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో దీపిక 6-2తో జిన్ హై చాంగ్ (దక్షిణ కొరియా)పై గెలుపొందింది. మొత్తం నాలుగు రౌండ్లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దీపిక మూడు రౌండ్లలో ఆధిక్యంలో నిలి చింది. ఒక్కో రౌండ్‌కు రెండు పాయింట్లు ఇస్తారు. ఓవరాల్‌గా దీపిక 26-25, 29-26, 26-28, 28-27 స్కోరుతో జిన్ హై చాంగ్‌ను ఓడించింది.