![Abhishek Verma wins gold medal in men compound individual event - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/27/ABISHEK-VE.jpg.webp?itok=MJwh7sxz)
అభిషేక్ వర్మ
పారిస్: ఆరేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్‌కప్ స్టేజ్–3 టోర్నీలో 32 ఏళ్ల అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. క్రిస్ షాఫ్ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 15 షాట్‌ల తర్వాత ఇద్దరూ 148–148తో సమఉజ్జీగా నిలిచారు.
దాంతో విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. ఇందులో క్రిస్ షాఫ్ 9 పాయింట్లు స్కోరు చేయగా... అభిషేక్ గురికి 10 పాయింట్లు వచ్చాయి. దాంతో పసిడి అభిషేక్ వశమైంది. 2015లో పోలాండ్‌లో జరిగిన వ్రోక్లా వరల్డ్‌కప్ టోర్నీలో చివరిసారి అభిషేక్ వ్యక్తిగత స్వర్ణం సాధించాడు. 2019 ఆసియా చాంపియన్‌షిప్ తర్వాత అభిషేక్ వర్మ బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే కావడం విశేషం. అంతకుముందు సెమీఫైనల్లో అభిషేక్ 146–138తో ఆంటోన్ బులయెవ్ (రష్యా)పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment