గగన్‌కు రెండు పతకాలు
బింద్రా, చైన్ సింగ్‌లకు కూడా...
హనోవర్ అంతర్జాతీయ షూటింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: వచ్చే వారం అమెరికాలో మొదలయ్యే ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీకి ముందు భారత షూటర్లు గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, చైన్ సింగ్ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారు. జర్మనీలో జరిగిన హనోవర్ అంతర్జాతీయ షూటింగ్ టోర్నీలో హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్‌తోపాటు అభినవ్ బింద్రా, చైన్ సింగ్ రెండేసి పతకాలను సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో గగన్ నారంగ్ (620.3), అభినవ్ బింద్రా (628.3), చైన్ సింగ్ (626.2)లతో కూడిన భారత బృందం 1874.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది.
ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగం ఫైనల్స్‌లో అభినవ్ బింద్రా (208.2 పాయింట్లు), పసిడి పతకాన్ని, చైన్ సింగ్ (206) రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో గగన్ నారంగ్ 447.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అపూర్వి చండేలా (188.1 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది.