World Heritage City status
-
Kruger National Park: ట్రైన్ రిసార్ట్
చుట్టూ పచ్చని పచ్చికబయళ్లు, వన్యప్రాణులు. నాలుగు అడుగులేస్తే మన కోసమే ప్రత్యేకంగా ఈతకొలను. ఇంకాస్త పక్కకెళితే ప్రకృతి రమణీయతను చూసేందుకు విడిగా వ్యూ డెక్కులు, మనం ఉన్నచోటు కిందే ఉరకలెత్తుతూ సాగే నది, సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న విలాసవంతమైన గది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర జీవనానికి చిరునామాగా నిలిచే ఇలాంటి చోట కొంతకాలమైనా గడపాలని ఎంతో మంది ఆశ పడతారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రైలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ఒక పాత వంతెనపై హోటల్‌గా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ వనంలో ఈ ‘ది ట్రైన్ ఆన్ ది బ్రిడ్జ్’ హోటల్ ఉంది. ఈ కదలని రైలు అరుదైన అనుభూతిని పంచుతుంది. ఇందులో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలతో 31 సూట్లు సిద్ధంచేశారు. అన్ని రకాల వంటకాలతోపాటు స్థానిక రుచులనూ ఆస్వాదించవచ్చు. గైడ్ల సాయంతో అడవిలోకెళ్లి స్వేచ్ఛగా సింహం, చిరుతపులి, ఏనుగు, నీటిగుర్రం, అడవి బర్రెలను దగ్గర్నుంచి చూసిరావచ్చు. ఒక ట్విన్(జంట)రూమ్‌లో పర్యాటకులు ఒక రాత్రి గడపాలంటే ఒక మనిషికి దాదాపు రూ.44,000 రుసుము వసూలుచేస్తారు. 100 ఏళ్లకు పైబడిన ఈ వంతెనపై గతంలో స్టీమ్ రైళ్లు నడిచేవి. వారసత్వంగా నిలిచిన ఈ వన వంతెనను విభిన్నంగా వినియోగిద్దామని ఈ హోటల్‌కు రూపకల్పన చేశామని మోట్సామయీ టూరిజం గ్రూప్ సీఈవో జెరీ మబేనా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జైపూర్‌కు ‘వారసత్వ’ గుర్తింపు
న్యూఢిల్లీ: పింక్ సిటీగా పేరు పొందిన రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక మండలి (యునెస్కో) ప్రపంచ వారసత్వ నగరం గుర్తింపు లభించింది. మధ్యయుగపు రాజరిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన జైపూర్ ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా ప్రపంచ గుర్తింపు పొందింది. జైపూర్‌ను ప్రపంచ వారసత్వ నగరాల్లో చేరుస్తున్నట్లు యునెస్కో శనివారం ట్వీట్టర్లో ప్రకటించింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 43వ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో ఇప్పటి వరకు 167 దేశాలకు చెందిన 1,092 ప్రాంతాలను వారసత్వ స్థలాలుగా గుర్తించింది. యునెస్కో వారసత్వ ప్రాంతాలు, కట్టడాలు, సహజ నిర్మాణాల్లో అత్యధికంగా ఇటలీలో 54, చైనాలో 53, భారత్‌లో 37 ఉన్నాయి. నిర్మాత రెండో జయసింగ్ యునెస్కో జైపూర్‌ను వారసత్వ నగరంగా గుర్తించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. క్రీస్తు శకం 1727లో అంబర్ మహారాజు రెండో జయ సింగ్ ఈ నగరాన్ని నిర్మించాడు. తన రాజధానిని అంబర్ నుంచి జైపూర్‌కు మార్చాడు. 16వ శతాబ్దం నాటి అంబర్ కోట, గులాబీ రంగు ఇసుక రాతి కట్టడమైన హవామహల్, ఖగోళ విజ్ఞాన కేంద్రం జంతర్‌మంతర్ వంటిని పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తన రాజధాని ఆతిథ్యానికి చిహ్నంగా నిలవాలన్న తలంపుతో జైపూర్ మహారాజు రాంసింగ్ నగరంలోని కట్టడాలన్నింటికీ గులాబీ రంగు వేయించాడని చెబుతారు. అందుకే దీనిని గులాబీ (పింక్)నగరంగా పిలుస్తారు. గుర్తిస్తే ఏమవుతుంది? ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్‌కు చెందిన 21 దేశాల అధికారుల బృందం 2018లో జైపూర్‌ను పరిశీలించింది. ఆ బృందం వారసత్వ స్థలాల జాబితాలో చేర్చవచ్చని సూచించింది. బాకులో జరుగుతున్న సమావేశం ఆ ప్రతిపాదనను పరిశీలించి, జైపూర్‌కు వారసత్వ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిద్వారా మానవ సంస్కృతీ వికాసానికి నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాంతం పరిరక్షణ బాధ్యతలను యునెస్కో చేపడుతుంది. మనుషులు, జంతువులు ఈ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించకుండా, స్థానిక పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యానికి గురి కాకుండా కాపాడుతుంది. ఇందుకు అవసరమైన నిధులను ప్రపంచ వారసత్వ నిధి సమకూరుస్తుంది. -
ఢిల్లీకి ప్రపంచ వారసత్వ నగర హోదా వద్దు’
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి యునెస్కో ప్రపంచ వారసత్వ నగర హోదా కోసం ఏళ్ల తరబడి సన్నాహాలు చేసిన కేంద్ర ప్రభుత్వం చివరికి తన ప్రయత్నాన్ని విరమించుకుంది. యునెస్కో(ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) ప్రకటించే ‘ప్రపంచ వారసత్వ నగరం(వరల్డ్ హెరిటేజ్ సిటీ)’ హోదా కోసం దాఖలు చేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంది. ప్రపంచ వారసత్వ నగరాల జాబితాలో ఢిల్లీ చేరితే నగరంలో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు, ప్రణాళికల అమలు, భూమి వినియోగం వంటి వాటికి అనేక అడ్డంకులు ఎదుర వుతాయని, అందుకే నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. వారసత్వ హోదా కోసం పాత ఢిల్లీలోని మొఘలుల కాలం నాటి షాజహానాబాద్, కొత్త ఢిల్లీలోని లుతేన్స్ బంగ్లా జోన్ ప్రాంతాలను మాత్రమే ఎంపిక చేసినా, వీటికి వారసత్వ హోదా వస్తే మౌలిక వసతుల కల్పనకు అడ్డంకులు ఏర్పడతాయన్నారు. భవిష్యత్తులో మళ్లీ నామినేషన్ వేసే అవకాశముందన్నారు. కాగా, ఢిల్లీకి ప్రపంచ వారసత్వ నగర హోదా కోసం గత యూపీఏ, షీలా దీక్షిత్ ప్రభుత్వాలు గట్టిగా కృషి చేశాయి.