దేశ రాజధాని ఢిల్లీకి యునెస్కో ప్రపంచ వారసత్వ నగర హోదా కోసం ఏళ్ల తరబడి సన్నాహాలు చేసిన కేంద్ర ప్రభుత్వం చివరికి తన ప్రయత్నాన్ని విరమించుకుంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి యునెస్కో ప్రపంచ వారసత్వ నగర హోదా కోసం ఏళ్ల తరబడి సన్నాహాలు చేసిన కేంద్ర ప్రభుత్వం చివరికి తన ప్రయత్నాన్ని విరమించుకుంది. యునెస్కో(ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) ప్రకటించే ‘ప్రపంచ వారసత్వ నగరం(వరల్డ్ హెరిటేజ్ సిటీ)’ హోదా కోసం దాఖలు చేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంది. ప్రపంచ వారసత్వ నగరాల జాబితాలో ఢిల్లీ చేరితే నగరంలో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు, ప్రణాళికల అమలు, భూమి వినియోగం వంటి వాటికి అనేక అడ్డంకులు ఎదుర వుతాయని, అందుకే నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ తెలిపారు.
పట్టణాభివృద్ధి శాఖతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. వారసత్వ హోదా కోసం పాత ఢిల్లీలోని మొఘలుల కాలం నాటి షాజహానాబాద్, కొత్త ఢిల్లీలోని లుతేన్స్ బంగ్లా జోన్ ప్రాంతాలను మాత్రమే ఎంపిక చేసినా, వీటికి వారసత్వ హోదా వస్తే మౌలిక వసతుల కల్పనకు అడ్డంకులు ఏర్పడతాయన్నారు. భవిష్యత్తులో మళ్లీ నామినేషన్ వేసే అవకాశముందన్నారు. కాగా, ఢిల్లీకి ప్రపంచ వారసత్వ నగర హోదా కోసం గత యూపీఏ, షీలా దీక్షిత్ ప్రభుత్వాలు గట్టిగా కృషి చేశాయి.