రాజధానిలో పెరుగుతున్న ప్రమాదాలు
Published Wed, Dec 25 2013 11:00 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
సాక్షి, న్యూఢిల్లీ:రాజధాని నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికితోడు వాహనాల సంఖ్య కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. గడచిన ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 38 వేల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో 10,500 మంది మృత్యువాతపడగా, 31 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. నగరంలో ట్రాఫిక్‌జాంలతోపాటు రోడ్డు ప్రమాదాలకు పెద్ద వాహనాలే కారణమని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నగర రవాణా విభాగం అధికారులు అందించిన వివరాల ప్రకారం 1980-81లో నగరంలోని రహదార్ల పొడవు 14 వేల కిలోమీటర్లు. వాహనాల సంఖ్య కేవలం ఐదు లక్షలే.
పట్టణీకరణ, అభివృద్ధి పేరిట నగరం విస్తరించడంతో వాహనాల సంఖ్య కూడా 15 శాతం పెరిగి 77 లక్షలకు చేరింది. ఇవికాకుండా ప్రతి ఏడాది నాలుగు నుంచి ఐదు లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిపోయే వాహనాల సంఖ్య రోజుకు సగటున రెండు లక్షలకు చేరింది.
వాహనాల రద్దీ పెరగడంతో రహదారులు సరిపోవడం లేదు. 33 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం నగరంలో రహదారుల పొడవు 33వేల కిలోమీటర్లకు చేరింది. దీంతో వాహనాల వేగం కూడా పెరిగిపోయి ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆశించినమేర ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. వీటితోపాటు కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగాలేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రమాదాల సంఖ్యను మరింత పెంచుతున్నాయి.
ప్రైవేటు వాహనాలే ఎక్కువ:
నగర రహదార్లపై తిరుగుతున్న వాటిలో 94 శాతం వ్యక్తిగత వాహనాలే ఉన్నట్టు రవాణాశాఖ అధికారులు తెలిపారు. రాజధానిలో రోజుకు 12 నుంచి 14వేల కొత్త వాహనాలు నమోదు అవుతున్నాయి. కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ.
నిబంధనలు బేఖాతర్
నగరంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను సరిగా పట్టించుకోకపోవడం వల్లనే ప్రమాదాల సంఖ్య పెరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. మధ్య ఢిల్లీలో మినహా ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులను సైతం నగరవాసులు లెక్కచేయడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, సీట్‌బెల్ట్ వేసుకోకపోవడం తదితరాలు సర్వసాధారణమయ్యాయని ట్రాఫిక్ విభాగం పోలీసులు చెబుతున్నారు.
Advertisement