అదే అభద్రత!
Published Thu, Sep 12 2013 1:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
కాలానుగుణంగా సమాజంలో అనేక మార్పులొస్తుంటాయి. ఏ విషయంలోనైనా మార్పు అనేది సహజం. కానీ దేశ రాజధానిలో మహిళల భద్రత విషయంలో మాత్రం ఎటువంటి మార్పు రావడంలేదు. డిసెంబర్ 16న జరిగిన దారుణం తర్వాత ప్రజల్లోనుంచి పుట్టుకొచ్చిన ఆగ్రహ జ్వాలలతో కొంతైనా మార్పొస్తుందని ఆశించారు. అయితే భద్రత విషయంలో మహిళల్లో ఎటువంటి భరోసా లభించకపోయినా భయం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికీ మహిళలు అభద్రతాభావంతోనే బయట అడుగుపెడుతున్నారు.
న్యూఢిల్లీ: ‘బస్‌స్టాపుల్లో, బస్సుల్లో ఆకతాయిల వేధింపులు భరించలేకపోతున్నాం. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించాలంటే భయమేస్తోంది. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణించాల్సిన పరిస్థితే వస్తే బస్సులనే ఆశ్రయిస్తున్నాం. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నా అవేవీ మాకు కనిపించడంలేదు. మహిళలను వేధించే లెసైన్సు తమ వద్ద ఉన్నట్లుగానే ఇంకా మృగాళ్లు ప్రవర్తిస్తున్నారు’... దేశ రాజధానిలో ప్రస్తుత పరిస్థితిపై ఓ యువతి చెప్పిన మాటలివి. ఓ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో దాదాపు మహిళలందరూ ఇవేరకమైన బాధలను చెప్పుకున్నారు. డిసెంబర్ 16 ఘటన తర్వాత దేశం యావత్తు ముక్తకంఠంతో మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని నిలదీసింది.
దీంతో సమాజంలో మార్పు వస్తుందని, మహిళలకు మంచిరోజులు వస్తాయని ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. భద్రత కల్పిస్తారనే ధీమాతో ఏ ఒక్క మహిళా బయటకు వెళ్లలేకపోతోంది. పైగా భయంభయంతో వెళ్లాల్సి వస్తోంది. నిజంగా పోలీసులు భద్రత కల్పిస్తే ఆకతాయిల వేధింపులు ఆగిపోయేవి. కామాంధులు భయపడేవారు. కానీ ఆకతాయిల వేధింపులు ఆగకపోగా మరింత పెరిగాయని అనేక సర్వేల్లో వెల్లడైంది. అత్యాచారాల నగరంగా ఢిల్లీని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే విషయం తేటతెల్లమైంది. ‘నిర్భయ ఘటన తర్వాత నాలో భయం మరింతగా పెరిగింది. ప్రతి ఒక్కరినీ అనుమానంతోనే చూస్తున్నాను. ఈ వాతావరణం నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేద’ని రిషితా సింగ్ అనే యువతి వాపోయింది.
మార్పు మహిళల్లోనే...
పసి బాలలు, వికలాంగులు అని కూడా చూడకుండా కామంతో విరుచుకుపడుతున్న మృగాళ్లలో ఎటువంటి మార్పు రాలేదని, వీరి ఈ దుశ్చర్యలతో మహిళల్లోనే జాగ్రత్తగా ఉండాలనే చైతన్యం వచ్చిందని చెబుతున్నారు మానసిక నిపుణులు. బస్సుల్లో ఓ మహిళను ఎవరైనా వేధిస్తున్నట్లు కనిపిస్తే ఆ బస్సులో ఉన్న మహిళలందరూ ఒక్కటవుతున్నారని, వేధింపులకు పాల్పడుతున్నవారికి బుద్ధి చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని, ఈ మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందటున్నారు. అయితే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రమే మహిళల్లో ఈ చైతన్యం కనిపిస్తోందని, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆమె ‘అబల’గానే వ్యవహరిస్తోందంటున్నారు. మృగాళ్లలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మహిళలు స్వేచ్ఛగా ఉండగలుగుతారని సూచిస్తున్నారు.
Advertisement
Advertisement